రెండ్రోజుల్లో తేల్చాలి

It should be decided in two days– లేకపోతే.. విడిగానే పోటీ
– పదవులకోసం కాదు..విధానాల కోసం నిలబడేవాళ్లమని కాంగ్రెస్‌ గుర్తించాలి
– రాజకీయ లక్ష్యాల కోసం ఇప్పటికే చాలా రాజీపడ్డాం
– ఇంకా అంటే సాధ్యంకాదు.. : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
రెండు రోజుల్లో పొత్తులపై తేల్చకపోతే లౌకిక శక్తులను కలుపుకొని విడిగా పోటీ చేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. రెండురోజుల్లో కాంగ్రెస్‌ స్పష్టంచేయక పోతే తమ పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందని, ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కు వచ్చేది ఉండదని హెచ్చరించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. లౌకికశక్తుల ఐక్యత కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే ప్రతిపాదన పెట్టారని, ఆ ప్రకారం తాము ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్‌ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. భద్రాచలానికి పది సార్లు ఎన్నికలు జరిగితే దానిలో 8 సార్లు సీపీఐ(ఎం) గెలిచిందన్నారు. అయినప్పటికీ ఆ స్థానాన్ని త్యాగం చేస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ, భద్రాచలం, పాలేరు, మధిర, ఇబ్రహీంపట్నం స్థానాలను తమ పార్టీ కోరిందన్నారు. ఈ స్థానాలు కాంగ్రెస్‌తో పొత్తు కోసమో.. లేక ఇతర పార్టీలతో పొత్తుకోసమో ఎంపిక చేసినవి కాదని, తమకున్న బలం దృష్ట్యా వీటిని ఎంచుకున్నామని తెలిపారు. భద్రాచలం ప్రస్తుతం తమ సిట్టింగ్‌ స్థానమని, అక్కడి ఎమ్మెల్యే నిబద్ధతతోని పార్టీకి కట్టుబడి ఉన్నారని కాంగ్రెస్‌ నాయకత్వం పట్టుబట్టడంతో భద్రాచలం స్థానాన్ని వదిలేశామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కస్థానమైనా ఉండాలని కోరుతూ పాలేరు సీటు అడిగామన్నారు. ఒక దశలో వారు ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినా.. ఆ తర్వాత మీడియాలో లీక్‌లు, రకరకాల వార్తలు వచ్చాయన్నారు. తమ్మినేని వీరభద్రం పట్టుదలతోనే చర్చలు ఆలస్యమవుతున్నా యని ఓ పత్రిక రాసిందన్నారు. తాజాగా మరో పత్రిక మిర్యాలగూడ, వైరా రెండుస్థానాలు ఇస్తామంటే కూడా వైరాను కాదని పాలేరు కోసమే సీపీఐ(ఎం) పట్టుబడుతుందని రాసిందని తెలిపారు. ఇవేవీ వాస్తవాలు కాదన్నారు. 27వ తేదీ ఉదయం పాలేరు సీటు ఇవ్వడం కుదరదని చెప్పి.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రకటించిందన్నారు. ఆ స్థానంలో వైరా సీటును ప్రతిపాదించిందన్నారు. అదేరోజు సాయంత్రం జరిగిన తమ పార్టీ కార్యదర్శివర్గ సమావేశంలో వైరా సీటును అంగీకరిద్దామనే నిర్ణయించినట్టు చెప్పారు. ఆ ప్రకారం మిర్యాలగూడ, వైరా సీట్లను తీసుకోవడానికి సిద్ధమయ్యాయమ న్నారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ తేల్చకపోవడం విచారకరమన్నారు. సీపీఐ(ఎం) విధానాల కోసం కట్టుబడే పార్టీ అని గుర్తుచేశారు. ఇప్పటికీ కలిసే పోటీ చేద్దామని కాంగ్రెస్‌ నాయకత్వానికి చెబు తుఆన్నమన్నారు. తేల్చాల్సింది కాంగ్రెస్సేనని, లేదంటే మా నిర్ణయం మేం తీసుకుంటామని చెప్పారు.
బీజేపీ అనుకూల శక్తులను ఓడించేందుకే..
రాష్ట్రంలో బీజేపీ, దాని అనుకూల శక్తులేవీ గెలవొద్దనే తాము కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికైనా ఆ ప్రాధాన్యతను గుర్తించి మిర్యాలగూడతో పాటు వైరా స్థానాన్ని ఇస్తే కాంగ్రెస్‌తో పొత్తుకు తాము సిద్ధమన్నారు. ఇప్పుడు వైరా కూడా కాదంటే పొత్తు సాధ్యం కాదన్నారు. మిర్యాలగూడ, వైరా సీట్లివ్వడంతో పాటు అక్కడ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థులు లేకుండా ఐక్యంగా గెలిపించాల్సిన అవసరం కూడా కాంగ్రెస్‌ నాయకత్వంపై ఉందన్నారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) కలిస్తే ఎలా ఉంటుందో చూపించాలంటే ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికైనా పునరాలోచించాలని కోరారు. ఆ రకంగా జరగని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విడిగా పోటీ చేయడం మినహా మరో మార్గం లేదన్నారు. సోమవారం వరకు చూస్తామని, ఆ తర్వాత హైదరాబాద్‌లో రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం, ఆ మరుసటి రోజే రాష్ట్ర కమిటీ మీటింగ్‌ ఉంటుందని, దీనికి పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరవుతారని తెలిపారు.
ఈ లోపు ఏ సీట్లనేది కాంగ్రెస్‌ స్పష్టం చేయకపోతే ఆ సమావేశాల్లో ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఒక్కసారి నిర్ణయానికి వచ్చాక సీపీఐ(ఎం) వెనక్కు తగ్గేది ఉండదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, ఎం.సాయిబాబు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతి పాల్గొన్నారు.

Spread the love