రండి చూపిస్తాం

Let's show you– కర్నాటకలో హామీలన్నీ అమలు చేస్తున్నాం
– బీఆర్‌ఎస్‌ది బూటకపు ప్రచారం
– ఆరు గ్యారంటీలు ఓట్ల కోసం కాదు.. పేదల బతుకుల బాగు కోసమే : ఖర్గే
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
కర్నాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయని, బీఆర్‌ఎస్‌ వాళ్లకు అనుమానం ఉంటే వాళ్లు కర్నాటకకు వస్తే హామీల అమలును చూపిస్తామని, అవసరమైతే మీతో పాటు రేవంత్‌రెడ్డి కూడా వస్తారని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని, బీటీమ్‌ అనేది ఏం లేదని, ఆ రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీని మోడీ తుంగలో తొక్కినట్టుగానే కేసీఆర్‌ కూడా గతంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం మాత్రమే కాదు, అవసరం తీరాక మర్చిపోవడమూ కేసీఆర్‌ నైజమన్నారు. తెలంగాణ ఇవ్వగానే సోనియా గాంధీ ఇంటికెళ్లి ఆమె కాళ్లు మొక్కారని, ఆ మరుసటి రోజే మాట మార్చిన ఘనత కేసీఆర్‌దని విమర్శించారు. ఇందిరా గాంధీ మెదక్‌ ఎంపీగా ఉన్నప్పుడు సంగారెడ్డి, మెదక్‌లో ప్రచారానికి వచ్చి హామీ ఇచ్చినట్టుగానే బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఆర్డినెన్స్‌ ప్యాక్టరీలను నెలకొల్పామని గుర్తుచేశారు. అలాగే, ఇప్పుడు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు సైతం పక్కాగా తెలంగాణాలో అమలవుతాయని స్పష్టంచేశారు. ఓట్ల కోసం ఇస్తున్న హామీలు కావు. పేదల బతుకుల్లో బాగు కోసం ఇస్తున్న గ్యారంటీలని తెలిపారు. సంగారెడ్డి, మెదక్‌ నియోజకవర్గాల్లో ఆదివారం నిర్వహించిన విజయభేరి ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా సోనియాగాంధీకి కేసీఆర్‌ మాట ఇచ్చి తప్పిన విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. సోనియా గాంధీ మాత్రం ఏపీలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో వెనక్కు తగ్గలేదని గుర్తు చేశారు. మెదక్‌ అంటే స్వర్గీయ ఇందిరాగాంధీకి ఎంతో ఇష్టమని, ఇక్కడి నుంచి పోటీ చేసి దేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ పేదల కోసం పనిచేస్తోందన్నారు. బ్యాంకులు జాతీయం చేసి ఫ్యాక్టరీలను నెలకొల్పిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. రైతు కూలీల కోసం ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చామన్నారు. పది పాయింట్ల ప్రోగ్రాం వంటి నిర్ణయాలు చేశామన్నారు. తెలంగాణ ఎవరిచ్చారు.. ఎవరి కోసం ఇచ్చామని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌ ఉందని, కేసీఆర్‌ అధికారంలోకి రాగానే ఉన్న సొమ్మును తనకు నచ్చినట్టు ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. తెలంగాణలో ఒక్కో వ్యక్తిపై రూ.5 లక్షల అప్పు చేసి పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవసరముందన్నారు. కర్నాటకలో ఇచ్చిన హామీల గురించి తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించేలా కేసీఆర్‌, కేటీఆర్‌, మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కూలీల సమస్యలు తీరాలంటే.. ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. సోనియా గాంధీ ఆరు గ్యారంటీలు ఇచ్చారని అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. కర్నాటకలో హామీల అమలును చూసేందుకు వస్తానంటే బస్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ్మ, సంగారెడ్డి అభ్యర్థి, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, మల్కాజిగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్‌, నర్సాపూర్‌, దుబ్బాక అభ్యర్థులు మైనంపల్లి రోహిత్‌రావు, ఆవుల రాజిరెడ్డి, చెరుకు శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love