చర్చల దశలోనే ‘పొత్తులు’

'Alliances' at the negotiating stage– సీనియర్లతో సంప్రదించాకే సీట్లపై నిర్ణయం
– కాంగ్రెస్‌పై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే చర్యలు
– మెట్రో ప్రకటనలకు అవకాశం ఇవ్వాలి
– అధికారులు బీఆర్‌ఎస్‌కు కొమ్ముకాస్తున్నారు
– బస్సు యాత్ర ఎప్పుడనేది ఆలోచిస్తున్నాం.
– కేటీఆర్‌ తన తండ్రిని జంతువుతో కరెక్టుగానే పోల్చారు : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పొత్తుల అంశం చర్చల దశలోనే ఉందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. సీట్ల విషయంలో పార్టీ సీనియర్‌ నాయకులను సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించేంత వరకు మీడియా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మెట్రోపై అధికార పార్టీ ప్రకటనలకు అవకాశం ఇస్తున్నారనీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బస్సు యాత్ర ఎప్పుడనేది ఆలోచిస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత బస్సు యాత్ర చేయాలా? మధ్యలో చేయాలా? అనేది అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ తన తండ్రిని జంతువుతో కరెక్టుగానే పోల్చారని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే అధ్యక్షతన జరిగింది. తాజా రాజకీయాలు, బస్సుయాత్ర, అభ్యర్థుల ప్రకటన, పొత్తులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం రేవంత్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. సీట్ల విషయంలో సీనియర్ల హోదాలు, గౌరవం తగ్గకుండా సమన్వయం చేసేందుకు కేసీ వేణుగోపాల్‌తో కమిటీని నియమించినట్టు తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా కమిటీ సభ్యులు ఠాక్రే, దీపాదాస్‌ మున్షి, మీనాక్షి నటరాజన్‌, కే. జానారెడ్డి అందుబాటులో ఉంటారని తెలిపారు. కొంత మంది అధికారులు బీఆర్‌ఎస్‌కు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘించి కొందరు అధికారులు నిధులు విడుదల చేస్తున్నారని చెప్పారు. పెన్షన్‌ తప్ప మిగతా వాటికి ఎన్నికలయ్యేవరకు ఎలాంటి నిధులు విడుదల చేయొద్దని కోరారు. చట్టంలో లొసుగులు వాడుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోం దన్నారు. బీఆర్‌ఎస్‌కు కొమ్ముకాసే పోలీస్‌, ఐఏఎస్‌, రెవెన్యూ, అన్ని విభాగాల అధికారుల వివరాలను కాంగ్రెస్‌ సేకరిస్తోందని హెచ్చరించారు. అందుకోసం ఓ ప్రత్యేక కమిటీ నియమించామనీ, తగిన వివరాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాజకీయ పార్టీల సొంత మీడియా కాంగ్రెస్‌పై అపోహలు సృష్టిస్తోందన్నారు. తప్పుడు వార్తలు వేసే మీడియా యజమాన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తప్పుడు వార్తలు వేసి కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడితే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన ఆరు నెలల ముందు వేసిన అన్ని టెండర్లపై అధికారంలోకి రాగానే సమీక్షిస్తామన్నారు. భూముల అమ్మకాలనూ సమీక్షిమిస్తామని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగానే ప్రభుత్వం పని చేయాలని కోరారు. నియమ, నిబంధనలు ఉల్లంఘించి బీఆర్‌ఎస్‌కు ప్రయోజనం చేకూర్చే అధికారులందరిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
కాంగ్రెస్‌లోకి సిరిసిల్ల బీఆర్‌ఎస్‌ నేతలు
కేకే మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఏళ్ల లక్ష్మీ నారాయణ, మాజీ సర్పంచ్‌ వైద్య శివప్రసాద్‌, సీనియర్‌ నాయకుడు మాన్య ప్రసాద్‌, తదితరులకు రేవంత్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Spread the love