వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే

Indiramma's kingdom will come– ఎల్బీస్టేడియంలో ఆరు గ్యారంటీలపై తొలి సంతకం
– మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఊరుకోం
– కాంగ్రెస్‌ అభిమానులపై స్టీఫెన్‌ రవీంద్ర నిఘా
– బీజేపీ నేతల మాదిరిగానే రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలు : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
– నేడు స్క్రీనింగ్‌ కమిటీ భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో డిసెంబర్‌ 9న ఏర్పడబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీస్టేడియంలో ఆరు గ్యారంటీలపై తొలి సంతకం పెట్టడం ఖాయమని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. అందుకే సెప్టెంబర్‌ 17న సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరతామని పునరుద్ఘాటించారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వివిధ నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. వారికి రేవంత్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ తాగుబోతుల అడ్డాగా మార్చారని విమర్శించారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్‌, రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను కాంగ్రెస్‌ అమలు చేసిందని గుర్తుచేశారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మా కార్యకర్తలపై ఇన్నాళ్లు కేసులు పెట్టారనీ, ఇంకో 45 రోజుల్లో తమ కార్యకర్తలకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారుల సంగతి తేల్చుతామని హెచ్చరించారు. రాష్ట్ర డీజీపీని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ప్రభాకర్‌ రావు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్న వారిపై, పార్టీ నాయకుల ఫోన్‌లపై నిఘా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘కాంగ్రెస్‌కు సాయం చేస్తున్న 75 మంది లిస్టును ‘కేటీఆర్‌ తయారు చేశారట. ఆ లిస్టును కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఇచ్చారు. కొంతమందిని కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారట. బిడ్డా కేటీఆర్‌.గుర్తు పెట్టుకో.నీ అధికారం 45 రోజులే. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకు ఇంత మిత్తితో చెల్లిస్తాం. ఐఏఎస్‌ అధికారులు అర్వింద్‌కుమార్‌, జయేష్‌ రంజన్‌, సోమేశ్‌ కుమార్‌ వంటి నేతలు అధికార పార్టీకి చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారు. అధికారులు అధికారుల్లా వ్యవహరించండి. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా కాదు’ అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ కూడా మోడీ, కిషన్‌ రెడ్డి, రాజాసింగ్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నన్ను భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేయాలంటున్నారు. భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చేందుకు నేను సిద్ధమే, మీరు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలారా 45రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం మనదే అని భరోసా ఇచ్చారు.
రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నేతలు
– పరిగి – మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కుమారుడు, మాజీ డీసీసీబీ చైర్మెన్‌ కమతం శ్రీనివాస్‌రెడ్డి
– తాండూరు-మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునీతసంపత్‌, యువ నేత మహిపాల్‌ రెడ్డి
– మానకొండూర్‌ – ఇల్లంతకుంట, మానకొండూర్‌ ఎంపీపీలు
– ఎల్బీనగర్‌ -బీఆర్‌ఎస్‌ నేత రామ్మోహన్‌గౌడ్‌ ఆయన భార్య మాజీ కార్పొరేటర్‌ లక్ష్మీ ప్రసన్న
– జయశంకర్‌ భూపాలపల్లి – మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్‌
– కంటోన్మెంట్‌ – శ్రీగణేష్‌ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.
నేడు స్క్రీనింగ్‌ కమిటీ భేటీ – ఢిల్లీ బయలుదేరిన రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా తుది దశకు చేరుకుంది.మరోసారి చర్చించేందుకు శుక్రవారం ఢిల్ల్లీలో స్క్రీనింగ్‌ కమిటీ భేటీ కానుంది. సమావేశంలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌ తదితరులు వెళ్లారు. సీడబ్య్లూసీ సభ్యులు దామోదర రాజనర్సింహ శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు.వీరే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో టికెట్ల లొల్లి ఉన్న నాయకులు కూడా ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారు. వెళ్లారు.

Spread the love