ఆయన స్పందించి ఉంటే భారత్‌లో మానవ హక్కుల పరిస్థితిపై ప్రశ్నించేదానిని
ఆ ఘటన తర్వాత సోషల్ మీడియా ఖాతాలు సస్సెండ్ అయ్యాయి
భారత మీడియా అసలు అంశాన్ని వదిలి నన్నే టార్గెట్ చేసింది : నార్వే జర్నలిస్టు హెల్లే ల్యాంగ్ స్వెండ్సెన్
ఓస్లో : నార్వేకు చెందిన యువ జర్నలిస్టు హెల్లే ల్యాంగ్ స్వెండ్సెన్.. భారత ప్రధాని మోడీని మీడియా స్వేచ్ఛపై ప్రశ్నించిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలు సస్పెండ్ అయ్యాయని ఆరోపించారు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో మోడీ.. ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైందని ఆమె తెలిపారు. ఓస్లోలో నార్వే ప్రధానితో కలిసి మోడీ మీడియా ప్రకటన ముగించుకొని వెళ్లిపోతుండగా.. ‘‘ప్రపంచంలో అత్యంత స్వేచ్ఛాయుతమైన మీడియా ఉన్న దేశంలో జర్నలిస్టుల ప్రశ్నలు ఎందుకు తీసుకోరు?’’ అని స్వెండ్సెన్ ప్రశ్నించడం, దానికి మోడీ ఎలాంటి సమాధానమూ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది.
ప్రపంచ మీడియా స్వేచ్ఛ సూచీలో నార్వే మొదటి స్థానంలో ఉండగా.. భారత్ 157వ స్థానంలో ఉందని ఆమె గుర్తు చేశారు. కాగా మోడీని ప్రశ్నించిన తర్వాత కొద్ది గంటల్లోనే తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలు సస్పెండ్ అయ్యాయని స్వెండ్సెన్ చెప్పారు. ‘‘మోడీ దేశం విడిచిపోయిన వెంటనే నా ఖాతాలపై చర్యలు మొదలయ్యాయి. కొన్ని గంటల్లోనే మెటా నా అకౌంట్లు నిలిపివేయడం ఆశ్చర్యంగా అనిపించింది’’ అని ఆమె చెప్పారు. ‘ది టెలిగ్రాఫ్ ఇండియా’కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు పంచుకున్నారు.
టీవీ చర్చలు, సోషల్ మీడియాలో నాపై తీవ్ర విమర్శలు
భారత టీవీ చర్చల్లో, సోషల్ మీడియాలో తనపై తీవ్ర విమర్శలు జరిగాయని స్వెండ్సెన్ తెలిపారు. ‘పబ్లిసిటీ కోసం ఇలా చేసింది’, ‘భారత వ్యతిరేకి’, ‘విదేశీ ఏజెంట్’ వంటి ఆరోపణలు తాను ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు. మోడీ తన ప్రశ్న వినలేదన్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ‘‘ఆయన కచ్చితంగా నా మాట విన్నారు. వినకపోతే ఆరోగ్య సమస్య ఉండి ఉండాలి. నేను చాలా దగ్గర్లోనే కూర్చున్నాను. చిన్న గదిలో రెండో వరుసలో ఉన్నాను’’ అని స్వెండ్సెన్ చెప్పారు. మోడీ ఆగి సమాధానం ఇచ్చి ఉంటే భారత్‌లో మానవ హక్కుల పరిస్థితిపై ప్రశ్నించేదానినని తెలిపారు. ‘‘మీ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఎలాంటి మార్పులు తీసుకు రాబోతున్నారు? విమర్శలు స్వీకరిస్తారా? భారత్‌లో స్వతంత్ర జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారా?’’ అని అడిగేదాన్నని చెప్పారు.
వివాదాన్ని భారత మీడియానే పెద్దది చేసింది
ఈ వివాదాన్ని తనకంటే భారత మీడియానే పెద్దది చేసిందని స్వెండ్సెన్ విమర్శించారు. “మోడీపై మీడియా స్వేచ్ఛ ప్రశ్న అనే అసలు అంశం బదులు, జర్నలిస్టునే టార్గెట్ చేశారు’’ అని ఆమె అన్నారు. భారత లోక్‌సభలోని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోషల్ మీడియాలో తనకు మద్దతు తెలిపిన తర్వాత, కొందరు తనను ‘కాంగ్రెస్ ప్రతినిధి’, ‘జార్జ్ సోరోస్ ఏజెంట్’, ‘విదేశీ గూఢచారి’గా అభివర్ణించారని ఆమె చెప్పారు. రాహుల్ గాంధీపై తనకు ప్రత్యేక అభిప్రాయం లేదనీ, ఆయనను కూడా తాను విమర్శాత్మక ప్రశ్నలే అడుగుతానని స్పష్టం చేశారు. అయితే భారతీయుల నుంచి భారీ మద్దతు కూడా లభించిందని ఆమె తెలిపారు.
భారత్‌లో కష్టపడి పనిచేస్తున్నది స్వతంత్ర జర్నలిస్టులే
ఇక నార్వేలో రాజకీయ నాయకులు పెద్ద వివాదాల్లో ఉన్నప్పటికీ మీడియా ఇంటర్వ్యూలకు ముందుకు వస్తారని ఆమె వివరించారు. నార్వే మాజీ ప్రధాని ఎర్నా సోల్బెర్గ్ ఒకరోజులోనే 14 ఇంటర్వ్యూలు ఇచ్చిన ఉదాహరణను ఆమె ప్రస్తావించారు. తాను హీరో కాదని, కేవలం జర్నలిస్టుగా తన పని మాత్రమే చేశానని స్వెండ్సెన్ అన్నారు. భారత్‌లో నిజంగా కష్టపడి పనిచేస్తున్నవారు అక్కడి స్వతంత్ర జర్నలిస్టులేనని ఆమె వ్యాఖ్యానించారు. భారత్‌కు రావాలనుకుంటున్నానని, కానీ ప్రస్తుతం భారత్ తనను స్వాగతిస్తుందో లేదో తెలియదని ఆమె నవ్వుతూ చెప్పారు.
మోడీ నా ప్రశ్నను కచ్చితంగా విన్నారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



