Tuesday, May 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఢిల్లీ ట్రిప్పులు కాదు.. లారీల ట్రిప్పులు పంపించు

ఢిల్లీ ట్రిప్పులు కాదు.. లారీల ట్రిప్పులు పంపించు

- Advertisement -


కల్లాలో పోసిన ధాన్యం చెదలుపడుతోంది
రెండ్రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ల ముట్టడి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ- సిద్దిపేటఅర్బన్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు మానుకొని.. కల్లాల్లో రైతుల ధాన్యం తరలింపునకు లారీ ట్రిప్పులు పంపించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుమారు 45 రోజులుగా ధాన్యం కల్లాల్లోనే ఉంటోందని, అడుగు భాగంలో చెదలు వస్తోందని చెప్పారు. రోహిణి కార్తి వచ్చి నారు పోసే సమయం వచ్చినా ఇంకా కల్లాల్లో వడ్లు ఉండటం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. గతంలో రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌ రెడ్డి, రోశయ్య పాలనలో కూడా రైతులు ఇంత ఇబ్బంది పడలేదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేసే కంటే ఢిల్లీ వెళ్లి మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నా చేసి రైతు సమస్యను పరిష్కరించేలా చూడాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి రైతు సమస్యలపై నిరసన తెలిపి పంట కొనేలా చేశారని గుర్తుచేశారు.వరి కుప్పలపై పడిగాపులు కాసి ఇప్పటికే 10 నుంచి 12 మంది రైతులు ప్రాణం కోల్పోయినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిషన్‌ మోడ్‌ అని చెప్తున్నారు కానీ అది కమీషన్‌ మోడ్‌గా మారిందని విమర్శించారు. రైతు సమస్యలపై పోరాటం చేస్తే.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కోటి 40 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తే.. నిన్నటి దాకా 90 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు కొంటామని చెప్పిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఇవాళ 70 లక్షల మెట్రిక్‌ టన్నులే కొంటామంటున్నారని అన్నారు.తన నియోజకవర్గంలో రైతుల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. రైతులు మిట్టపల్లి, నంగనూరు, చిన్నకోడూరులో రాస్తారోకోలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కనికరం లేద న్నారు. వెంటనే మక్కలు, సన్‌ ఫ్లవర్‌, జొన్నలు అమ్మిన రైతులకు ఆ డబ్బులు ఖాతాల్లో జమ చేయాలన్నారు. రెండు, మూడ్రోజుల్లో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, తరుగు లేకుండా కొనాలని, లారీలు, గన్నీ బ్యాగులు పంపాలని.. లేదంటే రైతులను వెంటబెట్టుకుని వెళ్లి కలెక్టరేట్‌ను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సుడా చైర్మెన్‌ రవీందర్‌ రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ రాజానర్సు, సర్పంచ్‌ నాగుల స్రవంతి ప్రశాంత్‌ తదితరులు ఉన్నారు.
అన్నదాతల సమస్యలు పట్టవా ఆర్డీఓ గారు?
సిద్దిపేట ఆర్డీవో సదానందంకు ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫోన్‌ చేసి.. అన్నదాతల సమస్యల గురించి మాట్లాడారు. ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేసినప్పటికీ స్పందించడం లేదని.. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆర్డీవోకు సూచించారు. నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావుపేట, సిద్దిపేటఅర్బన్‌, సిద్దిపేటరూరల్‌ మండలాలకు సంబంధించి దాదాపు 18 గ్రామాల రైతులు తనకు ఫోన్‌ చేసి బాధపడ్డారని ఆర్డీవోకు చెప్పారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -