నవతెలంగాణ-హైదరాబాద్: అన్నాడీఎంకే (AIADMK)పార్టీకి మరో ఎమ్మెల్యే మంగళవారంనాడు రాజీనామా చేశారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా, అంబసముద్ర ఎమ్మెల్యే డాక్కర్ ఎసాక్కీ సుబయా (Esakki Subaya) తాజాగా తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్‌కు సమర్పించారు. తొలుత నిబంధనలకు అనుగుణంగా లేదని ఆయన రాజీనామాను స్పీకర్ తోసిపుచ్చారు. దాంతో టైపింగ్ చేసిన లేఖకు బదులుగా లిఖిత పూర్వక రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు సుబయా సమర్పించడంతో స్పీకర్ అనుమతించారు. ముఖ్యమంత్రి విజయ్ టీవీకేలో సుబయా చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈనెల 13న అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా మాజీ మంత్రులు సీవీ షణ్ముగం, ఎస్.పి.వేలుమణి సారథ్యంలోని పలువురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. వీరిలో సుబయా కూడా ఉన్నారు. ఇప్పటికే షణ్ముగం, వేలుమణి వర్గంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు మరగతం కుమరవేల్, పి.సత్యభామ, ఎస్.జయకుమార్ అన్నాడీఎంకేకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.



