Saturday, July 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపోక్సో కేసు పెట్టారని ఆరుగురి దారుణ హత్య

పోక్సో కేసు పెట్టారని ఆరుగురి దారుణ హత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో శనివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. మండల కేంద్రంలోని దైవాలగూడ గ్రామంలో రాజ్‌కుమార్ (28) అనే వ్యక్తి కక్షతో రగిలిపోతూ ఏకంగా ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఒకేసారి ఆరుగురు వ్యక్తులు నెత్తుటి మడుగులో శవాలుగా మారిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.

పోలీసుల కథనం ప్రకారం.. గతంలో ఒక బాలికను వేధించాడనే ఆరోపణలపై బాధితురాలు, ఆమె తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజ్‌కుమార్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇటీవల బెయిల్‌పై జైలు నుండి బయటకు వచ్చిన రాజ్‌కుమార్.. తనపై కేసు పెట్టారన్న కక్షను పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున నిద్రపోతున్న బాధితులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ఊచకోత కోశాడు.

ఈ దాడిలో ఫిర్యాదు చేసిన బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంతటితో ఆగని నిందితుడు.. తన భార్య సరిత, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడిని కూడా అత్యంత అమానుషంగా కడతేర్చాడు. ఆరుగురిని చంపిన అనంతరం రాజ్‌కుమార్ స్వయంగా ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. కొడుకు చేసిన ఘాతుకాన్ని విని నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే, భార్యాపిల్లలను ఎందుకు హత్య చేశాడనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఘటనా స్థలానికి చేరుకున్న సీపీ తరుణ్‌ జోషి, డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ వివరాలు సేకరించారు. బాధిత బాలిక, బాలిక తల్లి, నానమ్మ, నిందితుడి భార్య సరిత, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు హత్యకు గురైనట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -