Saturday, July 11, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్బస్తీ దవాఖానాలపై నజర్‌

బస్తీ దవాఖానాలపై నజర్‌

- Advertisement -

ఆస్పత్రికో ప్రత్యేకాధికారి నియామకం
మూడ్రోజులపాటు వరుస తనిఖీలు
ఇన్‌‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ ‌పర్యవేక్ష‍ణ
సమస్యలు, మౌలిక వసతులపై సర్కార్‌‌కు రిపోర్టు..!
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ నగరంలోని బస్తీ దవాఖానాలపై సర్కార్‌ ‌నజర్‌ ‌పెట్టింది. మౌలిక సదుపాయాలు, వసతులపై ఆరా తీస్తోంది. ఇందుకోసం ఆస్పత్రికో ప్రత్యేకాధికారిని నియమించారు. శుక్రవారం నుంచే ఆస్పత్రులను పరిశీలిస్తున్నారు. ఇన్‌‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ స్వయంగా ఈ తనిఖీలను ఎప్పటికప్పులూ పర్యవేక్ష‍ిస్తున్నారు. మూడ్రోజులపాటు కొనసాగనున్న తనిఖీల్లో గుర్తించిన సమస్యలు, అవసరాలను నివేదిక రూపంలో తయారు చేసి సర్కార్‌‌కు సమర్పించనున్నారు.

​బస్తీ దవాఖానాకో ప్రత్యేకాధికారి
హైదరాబాద్‌ ‌జిల్లాలో మొత్తం 169 బస్తీ దవాఖానాలున్నాయి. వీటిల్లో తనిఖీలు చేయడానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో పని చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖకు అనుసంధానంగా పని చేసేవారు, ప్రజారోగ్యంపై, మెడికల్‌ ఫీల్డ్‌‌పై అవగాహన ఉన్నవారిని ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఎక్కువగా డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, ఫుడ్‌ ‌సేఫ్టీ ఆఫీసర్లు, హెల్త్‌ అసిస్టెంట్‌ ‌ఆఫీసర్లు, శానిటేషన్‌ సిబ్బంది, ఏఎంహెచ్‌ఓలు, జీహెచ్‌ఎంసీ ఆఫీసర్లు, డీపీఓలు, ఇతర అధికారులను ఆస్పత్రికో ప్రత్యేకాధికారి చొప్పున గెజిటెడ్‌ ఆఫీసర్లను నియమించారు. వీరందరూ వరుసగా మూడ్రోజులపాటు బస్తీ దవాఖానాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న సేవలు, అందుబాటులోని సేవలు, ఇంకా అవసరమైన వైద్య సదుపాయాలను స్వయంగా రోగులు, వారి సహాయకులను అడిగి తెలుసుకోనున్నారు. వీటితోపాటు ఆస్పత్రి పరిసర, ప్రాంగణ ప్రాంతాల్లో పారిశుధ్యం, ఆస్పత్రిలో వసతులు, మౌలిక సదుపాయాలు, మందుల సౌలభ్యం, పరిశుభ్రత, వైద్యుల సమయ పాలన, వైద్య సిబ్బంది ఖాళీలు, రోగులతో వైద్య సిబ్బంది ప్రవర్తనను స్వయంగా పర్యవేక్ష‍ించనున్నారు. వాష్‌ ‌రూంల్ పరిశుభ్రత, మరుగుదొడ్ల సౌకర్యం, రోగులకు తాగునీరు, కుర్చీలు వంటి మౌలిక సదుపాయాలపై ఆరా తీయనున్నారు. ఓపీ సంఖ్యను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, డిప్యూటీ డీఎంఅండ్‌‌హచ్‌ఓలు, అదనపు డీఎంఅండ్‌‌హెచ్‌లతో సంబంధం లేకుండా ఆయా క్లస్టర్లలో ఉండే స్థానిక ఎస్‌‌పీహెచ్‌ఓల సమక్ష‍ంలోనే ఈ తనిఖీలు జరుగుతుండటం గమనార్హం

సీజనల్‌ ‌వ్యాధులపైనే ఫోకస్‌
అసలే వర్షాకాలం.. రానున్న రోజుల్లో భారీ వర్షాలతోపాటు ఎడతెరిపి లేని ముసురు వర్షం కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. దీనికితోడు జ్వరం, డెంగ్యూ, చికెన్‌ ‌గున్యా, డయేరియా, మలేరియా, టైఫాయిడ్‌ ‌వంటి కేసులు ఎక్కువగా ఇక్కడే నమోదవుతుంటాయి. ఈ నేపథ్యంలో గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, కింగ్‌‌కోఠి జిల్లా ఆస్ప్రతి, ఏరియా ఆస్పత్రులు, యూపీహెచ్‌‌సీలతో పోల్చుకుంటే బస్తీ దవాఖానాలకే ఎక్కువ రోగులు వచ్చే అవకాశం ఉంది. జలుబు, దగ్గు, జ్వర సూచనలు లాంటి చిన్న చిన్న లక్ష‍ణాలు కనిపించినప్పుడు పేదలు ఎక్కువగా దగ్గరలో ఉండే బస్తీ దవాఖానాలనే ఆశ్రయిస్తుంటారు. వ్యాధుల నివారణా చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపడుతున్నట్టు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం ‘డ్రై డే’, ల్యాబ్‌ ‌పరీక్షలు, జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల అమలు, గర్భిణుల సంరక్ష‍ణ, శిశు టీకాలు, వ్యాధి నిరోధక టీకాలు, హెచ్‌‌పీవీ టీకాలు, అంటువ్యాధుల నివారణకు చర్యలు, ఇంటింటి ఆరోగ్య సర్వే, కీటక జనిత వ్యాధులపై అవగాహన, టీబీ, ఎయిడ్స్‌ రోగులకు ఆరోగ్య సేవలపై ప్రత్యేకాధికారులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్టు సమాచారం.

సర్కార్‌ ‌కు నివేదిక అందజేత
బస్తీ దవాఖానాల్లో కొనసాగుతున్న తనిఖీలను జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ ప్రత్యేకంగా పర్యవేక్ష‍ిస్తున్నారు. వీరిద్దరూ ఈ మూడ్రోజుల్లో ఏదో ఒక రోజు స్వయంగా బస్తీ దవాఖానాలను తనిఖీ చేసే అవకాశం ఉన్నట్టు వైద్య వర్గాల ద్వారా సమాచారం. ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత తనిఖీల్లో భాగంగా పరిశీలించి, కనుగొన్న, పర్యవేక్ష‍ించిన సమస్యలు, కావాల్సిన మౌలిక వసతులు, ఇంకా అవసరమైన సదుపాయాలు, కావాల్సిన అవసరాల గురించి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లేదా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు ఒక నివేదిక రూపంలో సమర్పించనున్నారు. ఆ తర్వాత తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -