ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సిందే
లేకపోతే ఓటును కోల్పోతారు :
మీట్ ది ప్రెస్‌లో సీఈవో సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్టు ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి పౌరుడూ ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 2002లో ఓటర్ల సమగ్ర సవరణ జరిగిందని గుర్తు చేశారు. తాజాగా మరోసారి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టినట్టు వివరించారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సుదర్శన్‌రెడ్డితో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారం భర్తీ చేయకపోతే పౌరులు ఓటును కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పారు. తమ తాత తరం, తల్లిదండ్రుల తరం ఓటర్ల వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపాలని సీఈవో సూచించారు. ఫారం 6, ఫారం 8 కూడా అవసరమైన వాళ్లు భర్తీ చేయవచ్చని తెలిపారు. ఓట్లు ఉన్న ప్రాంతానికి వచ్చి బీఎల్‌వోలు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారని చెప్పారు. ఒక్కో ఓటరుకు రెండేసి ఫారాలు ఇస్తారనీ, మీరు ఆ ఫారాన్ని నింపిన తర్వాత మూడు రోజులకు వచ్చి తీసుకెళతారని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోనూ ఈ ఫారాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నిబంధనలను పాటించని వారికి నోటీసులు వస్తాయని గుర్తు చేశారు. ఆ సమయంలో అవసరమైన ధృవపత్రాలు సమర్పించి ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. స్పెషల్ సమ్మరీ అంటే ఓటు హక్కుగా ఉంటుందనీ, మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే పూర్తిస్థాయి ప్రక్షాళన అని ప్రకటించారు. ఆధారాలు లేని వారి ఓట్లను తొలగిస్తామని వివరించారు. పూర్తి గా కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వస్తుందని గుర్తు చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో సర్ జరిగిందనీ, మరో 17 రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్నదని వివరించారు. జూన్ 24 నుంచి జులై 25 వరకు ‘సర్’ కొనసాగుతుందన్నారు. 3.38కోట్ల మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. హైదరాబాద్‌లో చిరునామాలు తెలుసుకోవడం కష్టంగా ఉందనీ, అందుకే స్థానిక మున్సిపాల్టీల సిబ్బంది సహకారం తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి వ్యక్తి వ్యక్తిగత హోదాతో సంబంధం లేకుండా ఫారం భర్తీ చేయాలని కోరారు. సీఎం అయినా, పీఎం అయినా అందరూ సర్‌లో భాగస్వాములు కావాల్సిందేనని స్పష్టం చేశారు. గత 20 ఏండ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదనీ, అందుకే ఈ ఏడాది చేస్తున్నట్టు వివరించారు. ఓటు లేకపోతే పౌరసత్వం లేనట్టు కాదన్నారు.
ఓటర్ల జాబితా ‘సర్’తో ప్రక్షాళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


