Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్యవివాహాల నిర్మూలనకు సమాజం ముందుకు రావాలి.

బాల్యవివాహాల నిర్మూలనకు సమాజం ముందుకు రావాలి.

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు,జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి మల్లీశ్వరి సూచనలతో బాల్య వివాహం–బతుకు ఆగం అనే నినాదంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్ల ఎంపీడీవో కార్యాలయంలో అంగన్ వాడిల సూపర్వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సఖి కేంద్రం కేస్ వర్కర్ సరిత మాట్లాడుతూ, బాల్యవివాహాలు బాలికల జీవితాలను అర్ధాంతరంగా నిలిపివేసే సామాజిక సమస్యని పేర్కొన్నారు.చిన్న వయస్సులో వివాహం జరగడంవల్ల బాలికల చదువు మధ్యలోనే ఆగిపోవడంతో పాటు, ఆరోగ్యపరమైన సమస్యలు,మానసిక ఒత్తిడి,కుటుంబ బాధ్యతలు వంటి అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు.ప్రస్తుత సమాజంలో బాలికలకు విద్య, నైపుణ్యాభివృద్ధి ఆర్థిక స్వావలంబన ఎంతో అవసరమని,తల్లిదండ్రులు బాల్యవివాహాలకు దూరంగా ఉండాలని సూచించారు.జిల్లా మహిళా సాధికారత కేంద్రం మిషన్ కోఆర్డినేటర్ క్రిష్ణ మాట్లాడుతూ బాల్య వివాహం–బతుకు ఆగం అనే నినాదాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.బాల్యవివాహాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, అలాంటి వివాహాలు జరిపించిన వారికి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు.

పెళ్లిలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొన్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.1098 (చైల్డ్ హెల్ప్‌లైన్),181 (మహిళా హెల్ప్‌లైన్),14567 వంటి అత్యవసర సేవ నంబర్ల గురించి వివరించి,ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.బాల్యవివాహాల వల్ల బాలికల ఆరోగ్యం,భవిష్యత్తు, సమాజ అభివృద్ధిపై పడే ప్రతికూల ప్రభావాలను వివరిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ శక్తి పథకం ద్వారా మహిళలకు అందుతున్న రక్షణ, న్యాయ సహాయం, సాధికారత సేవల గురించి అవగాహన కల్పించారు.బాలికలు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.సమాజంలో బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జయప్రద, అరుణ,లక్ష్మీ,బాలమ్మ అధిక సంఖ్యలో బాలికలు,మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -