Tuesday, May 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎండ ప్రచండం

ఎండ ప్రచండం

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి మండుటెండలు మరణ మృదంగాన్నీ సృష్టిస్తు న్నాయి. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ‘సీవియర్‌ ‌హీట్‌‌వేవ్‌’ నమోదు చేస్తున్నాయి. చాలాచోట్ల ఎండ వేడి తట్టుకోలేక జనాలు పిట్టల్లా రాలుతున్నారు. ఒకరోజు యాభై ఒక మంది, మరుసటి రోజు ఇరవై రెండు మంది, ఇంకోరోజు ముప్పయి మంది, ఇలా ఈ మూడు రోజుల లెక్కల్ని వింటేనే గుండె తరుక్కుపోతోంది. మృతులు వందకు పైగా దాటడం తీవ్ర విషాదకరం. ఉదయం పనికెళ్లిన మనిషి సాయంత్రానికి శవంగా ఇంటికి రావడం, ‘కొద్దిసేపట్లో వస్తా’నని బయలుదేరిన తండ్రి దారిలోనే కుప్పకూలడం విచారకరం. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో పొద్దంతా చెమడొడిస్తేగానీ ముద్ద నోట్లోకి వెళ్లని శ్రమజీవుల సంగతేమిటి? ఈ వేసవిలో వారి బతుకు చిత్రం ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. ఇంట్లో ఉంటే పూట గడవదు, బయటకు వెళ్తే మరణం తప్పదన్న దుస్థితి ఎదురైతే వారు ఎవరికి చెప్పుకోవాలి? వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో నలభై ఏడు డిగ్రీలు అత్యధికం. భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ‌జారీచేసింది. ఉదయం తొమ్మిది గంటలకే జనం బయట అడుగుపెట్టడం లేదు. మధ్యాహ్నం అయితే గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. కానీ పొలాల్లో పనిచేస్తున్న రైతులు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి కూలీలు ఈ ఎండల్లో కుప్పకూలుతున్న దయనీయ స్థితి నెలకొంది. ఎందుకంటే, పేదరికం వారిని ఇంట్లో ఉండనివ్వదు. ఆకలి వాళ్లను ఎండలోకి నెట్టేస్తోంది. చివరకు అదే ఎండ వారి ప్రాణాలను కూడా మింగేస్తోంది.

ఈ విపత్కర పరిస్థితులకు కారణాలను విశ్లేషిస్తే ఒకటి ఎల్‌నినో ప్రభావం, రెండోది కార్పొరేట్ల ధనదాహం. పసిఫిక్‌ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. భారత దేశంలో ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి తరంగాలు నమోదవు తున్నాయి. కానీ, ప్రకృతి ఒక్కటే కాదు. చెట్ల నరికివేత, చెరువుల మాయం, కాంక్రీట్‌ నగరాల పెరుగుదల, పచ్చదనం తగ్గిపోవడం కూడా ఈ వేడిని మరింత భయంకరంగా మార్చేస్తున్నాయి. అయితే, ఈ వినాశనంలో పాలకవర్గాల పాత్ర ప్రధానం. లాభాల కోసం ప్రకృతిని విచక్షణా రహితంగా దోచుకుంటున్న కార్పొరేట్ విధానా లు, వాటికి అనుగుణంగా రూపొందుతున్న ప్రభుత్వ నిర్ణయాలే పర్యావరణ సంక్షోభాన్ని అసలు కారణాలు. వేలాది ఎకరాల అడవిని ఆదానీ, అంబానీ లాంటి ప్రయివేటు కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారు. వారేమో ఖనిజ సంపదకోసం లక్ష‍లాది చెట్లను నరికేస్తున్నారు. దీంతో అడవులు కనుమరుగవుతున్నాయి. ఇంకా, గనుల తవ్వకాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండలాల కోసం లక్షల ఎకరాల భూమి వినియోగిస్తున్నారు. ఇదే వాతావరణ సమతుల్యతను దెబ్బతీసి భూమి ఉష్ణోగ్రతలను పెంచుతోంది.

ఏడాదికేడాది ఎండలు పెరుగుతున్నా, ప్రభుత్వాల సిద్ధత మాత్రం పాత స్థాయిలోనే ఉంది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే? వడదెబ్బతో చనిపోతున్న వాళ్లలో ఎక్కువ మంది పేదలే. ఏసీ గదుల్లో ఉండేవాళ్లు కాదు. రోజు పనిచేసి కుటుంబాన్ని పోషించుకునే రైతులు, కూలీలు, ఆట్రోడైవర్లు. ఇప్పుడు చనిపోయిన వారిలో కూడా వారే ఎక్కువ. అంటే ఈ మరణాలకు కారణం కేవలం సూర్యుడి వేడి కాదు, సామాజిక అసమానత కూడా అందులో దాగుంది. అయినా, పర్యావరణం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఒకప్పుడు గ్రామాల్లో పెద్దపెద్ద చెట్లు ఉండేవి. ఇపుడు వాటి స్థానంలో సిమెంట్‌ ‌గోడలు వచ్చాయి. పట్టణాల్లో బస్‌‌స్టాప్‌‌లకు సరైన షెడ్లు కూడా లేవు. చలివేంద్రాలు కనిపించడం కూడా అరుదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కోవాలి. పట్టణాభివృద్ధి పేరుతో చెట్లను నరికి వేసి, తర్వాత “హరితహారం” పేరుతో మొక్కలు నాటితే సరిపోదు. పర్యావరణాన్ని కాపాడకుండా ఈ వేడి సంక్షోభం తగ్గదు. చెరువులు, పార్కులు, పచ్చదనం పెరగాలి. అందుకు బృహత్తర కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. ఎందుకంటే, దేశమే కాదు, మన రాష్ట్రమూ ప్రమాదకర అంచున నిలబడి ఉంది. ఎండలు ప్రతిసంవత్సరం వచ్చేవే. కానీ, గతేడాదితో పోలిస్తే ఈ సారి మరణాలు రెట్టింపు పెరిగాయి. ఈ ఒక్కో మరణం వెనుక కుటుంబ శోకం, దాని వెనుక పిల్లల ఆర్తనాదాలు ఉన్నాయి. ఇప్పటివరకు చనిపోయిన వారి కుటుంబాలను ప్రకృతి విపత్తుల కింద ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఇది ప్రకృతి, పాలన కలిపి సృష్టించిన సంక్ష‍ోభం. దీనికి అడ్డుకట్ట వేయకుంటే, రోజురోజుకూ వార్తల్లో మరణాల సంఖ్య మారుతుంది. కానీ, పేదల ఇళ్లలో వినిపించే ఏడుపు మాత్రం అలాగే ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలు ప్రభుత్వాలను క్ష‍మించవు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -