Wednesday, May 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌పై అమెరికా దాడులు

ఇరాన్‌పై అమెరికా దాడులు

- Advertisement -

‘ఆత్మరక్షణ’ కోసమేనంటూ సమర్ధన అమెరికా డ్రోన్‌ను కూల్చిన ఐఆర్‌జీసీ
క్షిపణి ప్రయోగ కేంద్రం, పడవల ధ్వంసం
టెహ్రాన్‌ : మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఓ వైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే మరోవైపు ‘ఆత్మరక్షణ’ పేరిట ఇరాన్‌పై అమెరికా దాడులకు తెగబడింది. దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, హార్ముజ్‌ జలసంధి సమీపంలో ఉన్న ఇరాన్‌ పడవలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపింది. ఇరాన్‌ దళాల బెదిరింపుల నుంచి తమ సేనలను రక్షించుకునేందుకు దక్షిణ ప్రాంతంలో దాడులు జరిపామని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్‌కామ్‌) ప్రతినిధి కెప్టెన్‌ టిమ్‌ హాకిన్స్‌ ఒక ప్రకటనలో తెలిపారు. క్షిపణి ప్రయోగ కేంద్రాలను, హార్ముజ్‌లో మందుపాతరలు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్‌ పడవలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేశామని ఆయన చెప్పారు. కాల్పుల విరమణ సమయంలో సంయమనం పాటిస్తూనే తమ దళాలను రక్షించుకునే ప్రయత్నం చేస్తామని అన్నారు.

అమెరికా డ్రోన్‌ కూల్చివేత
హార్ముజ్‌ జలసంధి సమీప ప్రాంతాలలో సోమవారం పేలుడు శబ్దాలు వినిపించాయి. బందర్‌ అబ్బాస్‌లో పేలుళ్లు జరిగాయని ఇరాన్‌ మీడియా తెలిపింది. దక్షిణ తీరం వెంబడి సిరిక్‌, జాస్క్‌ సమీపంలో కూడా పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్‌ గగనతలంలో ప్రవేశించిన అమెరికా ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ను కూల్చివేశామని ఐఆర్‌జీసీ తెలియజేసింది. కాల్పుల విరమణను అమెరికా ఉల్లంఘిస్తే ప్రతీకార చర్యలకు దిగే హక్కు ఇరాన్‌కు ఉంటుందని చెప్పింది. కాగా శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్‌ తమకు అప్పగిస్తే దానిని ధ్వంసం చేస్తామని, లేదా ఇరాన్‌లోనే అంతర్జాతీయ సాక్షుల సమక్షంలో దానిని నాశనం చేస్తామని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ చేశారు.

అమెరికా అధికారులు ఏమన్నారంటే…
అమెరికా అధికారుల కథనం ప్రకారం… హార్ముజ్‌లో మందుపాతరలు అమరుస్తున్న రెండు ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) పడవలను గుర్తించి సైనిక చర్యకు దిగారు. బందర్‌ అబ్బాస్‌లో ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణులను ప్రయోగించే స్థావరంపై కూడా దాడి జరిగింది. ఈ స్థావరం అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకుంది. ఆత్మరక్షణ కోసం రెండు పడవలను, క్షిపణి స్థావరాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఆపరేషన్‌ కారణంగా కాల్పుల విరమణ ఒప్పందానికి ఎలాంటి విఘాతం కలగదు. జరిగిన దాడుల పరిధి చాలా తక్కువ. ప్రస్తుతానికి దాడులు
ఆగిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -