Wednesday, May 27, 2026
E-PAPER
Homeజాతీయంఒడిశాలో ఘోర విషాదం

ఒడిశాలో ఘోర విషాదం

- Advertisement -

సెప్టిక్‌ ‌ట్యాంకులోకి దిగి ఆరుగురు మృతి
ఒకరిని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వైనం

​భువనేశ్వర్‌ : ఒడిశాలో ఘోరం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంకులోని సెంట్రింగ్‌ సామగ్రిని తొలగించేందుకు దిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు భవన నిర్మాణ కార్మికులు. ఈ దుర్ఘటన కలహండి జిల్లా గౌడ కార్లఖుంట గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కొత్తగా నిర్మించిన సెప్టిక్ ట్యాంక్ లోపల ఉన్న సెం‌ట్రింగ్‌ సామాగ్రిని తొలగించడానికి ‌తొలుత ఒక తాపీ మేస్ర్తీ అందులోకి దిగారు. అయితే ట్యాంక్ లోపల ఆక్సిజన్ లేకపోవడం, విషవాయువులు దట్టంగా ముసురుకోవడంతో ఆయన స్పృహతప్పి పడిపోయారు. ఆయనను కాపాడేందుకు ఒకరి వెనుక ఒకరుగా మరో ఐదుగురు ట్యాంకులోకి దిగారు. వారు కూడా ఆ విషవాయువుల ప్రభావానికి లోనై అక్కడికక్కడే కుప్పకూలారు. సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అందరినీ సెప్టిక్ ట్యాంక్ నుంచి బయటకు తీశారు. వారిని వెంటనే మదన్‌పుర్ రాంపుర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ఆరుగురు మరణించినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. గాయపడిన మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మదన్‌పుర్ రాంపుర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులను గౌడ కార్లఖుంట గ్రామానికి చెందిన ఇంటి యజమాని నిమయ్ పాల్ (48), ఆయన కుమారుడు ఆకాశ్ పాల్‌(28)గా పోలీసులు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన అడల్ మాఝీ (55), మటోగండకు చెందిన మిరోనోజ్ హతి (27), దుట గ్రామానికి చెందిన చందా జల్, బిపుల్ జల్ (30) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. హతిఖోజ్ గ్రామానికి చెందిన పంకజ్ భోయిని(32)ని మొదట మదన్‌పుర్ రాంపుర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారని చెప్పారు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కలహండి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు కేసింగ పోలీస్ ఎస్‌డిపిఒ సందీప్ మాఝీ తెలిపారు. ఈ విషాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేసియా ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -