నవతెలంగాణ – హైదరాబాద్ : పీఎల్ 2026 ప్లేఆఫ్స్ సమరం మొదలైన వేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నాకౌట్ మ్యాచ్‌ల ఒత్తిడిని జయించాలంటే డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లడం కంటే మరింత దూకుడుగా ఆడటమే తమ వ్యూహమని స్పష్టం చేశారు. ఈరోజు చండీగఢ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు ఆయన తన మనసులోని మాటలను పంచుకున్నారు.
నరాలు తెగే ఉత్కంఠ రేపే నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడి సహజమని కమిన్స్ అభిప్రాయపడ్డారు. టోర్నీలో ఇప్పటివరకు జట్టును విజయతీరాలకు చేర్చిన సహజ శైలిని మార్చుకోవద్దని ఆటగాళ్లకు సూచించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా వంద శాతం శ్రమించాలనే మైండ్‌సెట్‌తోనే తాము బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. ట్రోఫీ గెలవాలంటే వరుసగా మూడు మ్యాచ్‌లు నెగ్గాలని, లీగ్ దశలో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన తమకు ఇది అసాధ్యమేమీ కాదని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున పరుగుల వరద పారిస్తున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై కమిన్స్ ప్రత్యేకంగా స్పందించారు. ఈ టోర్నీలో 583 పరుగులతో దూసుకుపోతున్న వైభవ్‌ను కట్టడి చేసేందుకు తమ వద్ద ప్లాన్-బి, ప్లాన్-సి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. గత మ్యాచ్‌లో వైభవ్ తమపై సెంచరీ బాదినప్పటికీ కొన్ని ఓవర్లలో అతడిని బాగానే కట్టడి చేశామని గుర్తుచేశారు. ఆ తప్పుల నుంచి నేర్చుకుని ఈసారి పక్కా వ్యూహంతో బౌలింగ్ చేస్తామని తెలిపారు.



