మహిళల ఆరోగ్యం, గౌరవం, సమానత్వం, విద్య, సామాజిక అభివృద్ధి వంటి అనేక అంశాలతో ముడిపడి వున్న పీరియడ్స్ లేక మెన్సెస్ అత్యంత సహజమైన జీవశాస్త్ర సంబంధిత ప్రక్రియ. అయినప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో రుతుక్రమం గురించి ఇప్పటికీ అపోహలు, మూఢనమ్మకాలు, సిగ్గు, వివక్ష కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రతి ఏడాది మే 28న “ప్రపంచ రుతుస్రావ పరిశుభ్రత దినం” ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు మహిళల శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్య పరిరక్షణకు మాత్రమే కాకుండా మానవ హక్కులు, లింగ సమానత్వం, విద్యా అవకాశాలు, ఆరోగ్య అవగాహనకు కూడా సంకేతంగా నిలుస్తోంది.
మహిళల ఆరోగ్యం, గౌరవం, సమానత్వం, విద్య, సామాజిక అభివృద్ధి వంటి అనేక అంశాలతో ముడిపడి వున్న పీరియడ్స్ లేక మెన్సెస్ అత్యంత సహజమైన జీవశాస్త్ర సంబంధిత ప్రక్రియ. అయినప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో రుతుక్రమం గురించి ఇప్పటికీ అపోహలు, మూఢనమ్మకాలు, సిగ్గు, వివక్ష కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రతి ఏడాది మే 28న “ప్రపంచ రుతుస్రావ పరిశుభ్రత దినం” ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు మహిళల శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్య పరిరక్షణకు మాత్రమే కాకుండా మానవ హక్కులు, లింగ సమానత్వం, విద్యా అవకాశాలు, ఆరోగ్య అవగాహనకు కూడా సంకేతంగా నిలుస్తోంది. మహిళ శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ లో జరిగే మార్పులకు అనుగుణంగా గర్భాశయం లోపలి పొర మందంగా అయి తిరిగి విడిపోయి, ఆపొరలో విచ్ఛిన్నమైన సూక్ష్మ రక్తనాళాల నుండి వెలవడిన రక్తంతో కలిసి రుతుస్రావంగా ప్రతి 21-35 రోజుల మధ్య జరిగే సహజ ప్రక్రియ రుతు క్రమం. ఈ ప్రక్రియ యవ్వన దశలో ప్రారంభమై బహిష్టులు ఆగిపోయే వరకు కొనసాగుతుంది. ఇది వ్యాధి కాదు, మైల కాదు, అపవిత్రత కాదు, మహిళ శరీరంలో జరిగే సహజ జీవ ప్రక్రియ.
ప్రపంచ రుతుక్రమ పరిశుభ్రత దినం- ఆవిర్భావం
ప్రపంచ రుతుక్రమ పరిశుభ్రత దినాన్ని జర్మనీకి చెందిన “WASH” అనే స్వచ్ఛంద సంస్థ 2014లో ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా రుతుక్రమ ఆరోగ్యం, రుతుక్రమ పరిశుభ్రత గురించి చర్చలను ప్రోత్సహించడం, అవగాహన పెంచి అపోహలను తొలగించడం, రుతుక్రమ పరిశుభ్రతకు అవసరమైన సాధనాల అందుబాటును మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం. అప్పటినుండి ప్రతి ఏడాది మే 28 వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
మే 28 నే ఎందుకు ఎన్నుకున్నారు?
సాధారణ రుతుక్రమం సగటు 28 రోజులు. సాధారణ రుతుస్రావ దశ సగటు 5 రోజులు. ఈ ప్రాతిపదికన 5 వ నెలలో 28 వ తేదీని ప్రపంచ రుతుక్రమ పరిశుభ్రతా దినంగా నిర్ణయించారు
పరిశుభ్రత అవసరం ఎందుకు? ఆరోగ్యపరమైన అవసరం: రుతుస్రావ సమయంలో సరైన శుభ్రతను పాటించకపోతే అనేక ఆరోగ్యసమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జననేంద్రియ ఇన్ఫెక్షన్లు, మూత్ర వ్యవస్ధ ఇన్ఫెక్షన్లు, చర్మ ఎలర్జీలతో పాటు దీర్ఘకాలిక సమస్యలైన పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, సంతాన ప్రాప్తి సమస్యలు, అరుదుగా జననేంద్రియ కేన్సర్లు మొదలైనవి. మానసిక ప్రభావాలు: మానసిక ఒత్తిడి , తీవ్రమైన అవమానం, ఆందోళన, ఆత్మన్యూనత రోజువారీ జీవితంలో ఆటంకాలు: పీరియడ్స్ సమయంలో స్కూలుకు వెళ్ళకపోవడం, పనికి వెళ్లకపోవడం కారణాలు: శుభ్రమైన టాయిలెట్లు లేకపోవడం, శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో లేకపోవడం, అపోహలు, సిగ్గు, పాఠశాలల్లో అవగాహన లేకపోవడం. దీంతో వారి విద్యలో అంతరాయం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల పరమైన ఎదుగుదల మందగిస్తుంది. సామాజిక ప్రభావం: రుతుక్రమం చుట్టూ సాగుతున్న అపోహలు, మూఢనమ్మకాలు, సామాజిక ఒత్తిడి మహిళల సమగ్ర అభివృద్ధి పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రుతుక్రమం సమయంలో మహిళలపై అనేక ఆంక్షలు ఉంటాయి. రుతుస్రావం మైల, అంచేత రుతుస్రావం అవుతున్న మహిళ ఇంట్లోకి రాకూడదు, ప్రత్యేక ప్రదేశాల్లో, కొన్ని చోట్ల సురక్షితం కాని మెన్స్టృవల్ హట్స్ లో ఉంచుతారు. అసంబద్ధమైన ఆంక్షలు పెడతారు. ఇది మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది, మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది.
ప్రధాన లక్ష్యాలు
అవగాహన పెంపు: రుతుక్రమం మహిళల శరీరంలో జరిగే సహజమైన ప్రక్రియ అని సమాజానికి తెలియజేయడం అపోహల నిర్మూలన: అపోహలను, మూఢనమ్మకాలను తొలగించడం
రుతుస్రావ పరిశుభ్రత సాధనాల అందుబాటు: ప్రతి బాలికకు, మహిళకు శానిటరీ ప్యాడ్స్, శుభ్రమైన నీరు, ప్రత్యేక టాయిలెట్లు, ప్యాడ్స్‌ని సురక్షితంగా పారవేసే సౌకర్యం అందుబాటులో ఉండేలా చెయ్యడం. బాలికల విద్యా రక్షణ: పీరియడ్స్ కారణంగా చదువు మానేయకుండా చెయ్యడం లింగ
సమానత్వం: మహిళలను గౌరవించే సమాజ నిర్మాణం
ఆరోగ్య రక్షణ: సురక్షితమైన రుతుక్రమ నిర్వహణ ద్వారా మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యలు
పేదరికం : అనేక దేశాల్లో మహిళలకు శానిటరీ పాడ్స్ ని కొనుగోలు చెయ్యగల స్థోమత లేదు. దీనిని “పీరియడ్ పావర్టీ” అని అంటారు.
పరిశుభ్రత సదుపాయాల కొరత: గ్రామీణ ప్రాంతాలలో టాయిలెట్స్ లేకపోవడం, శుభ్రమైన నీరు అందుబాటులో లేకపోవడం.
సామాజిక నిషేధాలు: రుతుక్రమం గురించి మాట్లాడటం చాలా కుటుంబాలు నిషేధంగా చూస్తాయి
సమాచార లోపం: బాలికలకు సరైన లైంగిక విద్య అందకపోవడం
పరిశుభ్రత పాటించే సరైన విధానం
శుభ్రమైన శానిటరీ సాధనాలు ఉపయోగించాలి: శానిటరీ ప్యాడ్స్ టాంపూన్స్, మెన్స్ట్రువల్ కప్పులు, శుభ్రంగా ఉతికి మళ్ళీ వాడుకోగల గుడ్డ ప్యాడ్స్ వంటివి.
తరచుగా మార్చాలి : శానిటరీ ప్యాడ్‌ను సాధారణంగా ప్రతి 4-6 గంటలకు మార్చాలి.
చేతులు శుభ్రంగా : ప్యాడ్ మార్చే ముందు, మార్చిన తరువాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి
జననేంద్రియాల్ని శుభ్రంగా: శుభ్రమైన నీటితో జననేంద్రియాల్ని శుభ్రపరుచుకోవాలి
సురక్షితంగా పారవేయాలి: ఉపయోగించిన ప్యాడ్స్ ని పర్యావరణానికి హాని కలిగించకుండా సరైన విధంగా పారవేయాలి
నిర్వహించే విధానం
అవగాహన కార్యక్రమాలు : పాఠశాలల్లో సదస్సులు, ఆరోగ్య శిబిరాలు, గ్రామ సభలు, మహిళా సంఘ సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి.
మీడియా ప్రచారం: టెలివిజన్ కార్యక్రమాలు, సోషల్ మీడియా ప్రచారం, పోస్టర్లు, వ్యాసాలోనూ తెలియజేయాలి.
ఉచిత ప్యాడ్స్ పంపిణీ : పేద బాలికలకు, మహిళలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ని పంపిణీ చేస్తున్నారు
ఆరోగ్య శిక్షణ : ఆశా కార్యకర్తలు, వైద్యులు, ఉపాధ్యాయుల ద్వారా శిక్షణ.
పాఠశాలల పాత్ర: పాఠశాలలు రుతుక్రమ ఆరోగ్య అవగాహనలో కీలకపాత్ర పోషిస్తాయి.
అవసరమైన చర్యలు: పునరుత్పత్తి, లైంగిక విద్యను బోధించడం, బాలికలకు కౌన్సిలింగ్, శుభ్రమైన టాయిలెట్స్, నీటి సదుపాయం, అత్యవసర పరిస్థితిలో శానిటరీ ప్యాడ్స్ i;ఉపాధ్యాయుల బాధ్యత: ఉపాధ్యాయులు బిడియం, సంకోచం లేకుండా ఈ అంశంపై మాట్లాడే వాతావరణం కల్పించాలి.
కుటుంబాల పాత్ర: రుతుక్రమ ఆరోగ్యంపై అవగాహన ఇంటి నుంచే ప్రారంభించాలి. తల్లిదం డ్రులు బాలికలకు రుతుక్రమం ప్రారంభం కాకము నుపే అవగాహన కల్పించాలి, భయాన్ని తొలగిం చాలి, పరిశుభ్రత ను అలవాటు చేయాలి, ఇది సిగ్గు పడే విషయం కాదని నమ్మకం కలిగించాలి.
పురుషుల భాగస్వామ్యం: తండ్రులు, సోదరులు, స్నేహితులు ఈ అంశాన్ని సహజమైనదిగా అర్ధం చేసుకోవాలి.
ప్రభుత్వాల పాత్ర: రుతుక్రమ ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు ప్రజారోగ్య అంశంగా పరిగణించాలి
రుతుక్రమ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం: పీరియడ్స్ సమయంలో కొంతమంది మహిళలు ఒత్తిడి, ఆందోళన, చిరాకు, అలసటకు లోనవుతారు. అందువల్ల కుటుంబ సభ్యులు సహకారం, ఆప్యాయత చూపాలి.
పర్యావరణ పరిరక్షణలో రుతుక్రమం నిర్వహణ : ప్లాస్టిక్ ప్యాడ్స్ వాడకం వలన పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. కనుక వీటికి ప్రత్యామ్నాయాలుగా రీయూజబుల్ క్లాత్ ప్యాడ్స్, మెన్స్ట్రవల్ కప్స్, బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ వాడితే పర్యావరణానికి అనుకూలమైనవి. ప్రపంచస్థాయి లక్ష్యాలు : ప్రపంచ ఆరోగ్యసంస్థ, యూనిసెఫ్, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు రుతుక్రమ ఆరోగ్యాన్ని మానవ హక్కుల అంశంగా గుర్తిస్తున్నాయి. గ్లోబల్ లక్ష్యాలు : ప్రతి బాలికకు రుతుక్రమ ఆరోగ్య అవగాహన, పాఠశాలల్లో పరిశుభ్రత సదుపాయాలు, పీరియడ్ పావర్టీ నిర్మూలన, లింగ సమానత్వం, ఆరోగ్య సేవల అందుబాటు, రుతుక్రమంపై మౌనం తొలగింపు
ఆశించిన ఫలితాలు
ఆరోగ్య పరంగా: ఇన్ఫెక్షన్లు తగ్గడం, మహిళల ఆరోగ్యం మెరుగు పడడం.
విద్యాపరంగా: బాలికల పాఠశాల హాజరు పెరగడం, చదువు మానివేయడం తగ్గడం.
సామాజికంగా : అపోహలు తగ్గడం, మహిళల గౌరవం పెరగడం.
ఆర్ధిక పరంగా: మహిళల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడం, ఆరోగ్య ఖర్చులు తగ్గడం.
మానసికంగా: ఆత్మవిశ్వాసం పెరగడం, భయం, సిగ్గు తగ్గడం
భారతదేశంలో పరిస్థితి
భారత దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా రుతుక్రమ ఆరోగ్యంపై అవగాహన తక్కువగానే ఉంది. అనేకమంది బాలికలు ఆరోగ్యానికి హానికరమైన పాత, మురికి గుడ్డల్ని రుతుస్రావాన్ని పీల్చడానికి వాడుతున్నారు. సరైన పరిశుభ్రతను పాటించకపోతున్నారు. పీరియడ్స్ గురించి మాట్లాడడానికి భయపడుతున్నారు. అయితే ఇటీవల కొన్ని ప్రభుత్వ పథకాల వల్ల పరిస్థితి మెరుగుపడుతోంది
వైద్యుల పాత్ర: వైద్యులు సమాజంలో రుతుక్రమ ఆరోగ్య అవగాహన పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. బాలికలకు సరైన, ప్రామాణికమైన సమాచారాన్ని అందించాల, అనారోగ్యాల లక్షణాలను గుర్తించాలి, అపోహలను తొలగించాలి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. రుతుక్రమ ఆరోగ్యం- మానవ హక్కు: రుతుక్రమ ఆరోగ్యం కేవలం మహిళా సమస్య కాదు. ఇది ఆరోగ్య హక్కు, విద్యా హక్కు, గౌరవ హక్కు, సమానత్వ హక్కు. అందువల్ల ప్రతి సమాజం దీనిని ప్రాధాన్ అంశంగా పరిగణించాలి.
ముగింపు
ప్రపంచ రుతుక్రమ పరిశుభ్రత దినం మహిళల ఆరోగ్యం, గౌరవం, సమానత్వం కోసం ప్రపంచ వ్యా ప్తంగా జరుగుతున్న ఒక గొప్ప అవగాహన ఉద్య మం. రుతుక్రమం సహజ ప్రక్రియ అని సమాజం అర్ధం చేసుకున్నప్పడే నిజమైన అభివృద్ధి సాధ్యమ వుతుంది. ప్రతి బాలిక భయం లేకుండా, బిడియం లేకుండా, వివక్ష లేకుండా ఆరోగ్యంగా జీవించే హక్కు కలిగి ఉంది. రుతుక్రమ ఆరోగ్యం పై మౌనం కాకుండా అవగాహన పెంచితేనే ఆరోగ్యవంతమైన, సమానత్వం ఉన్న సమాజాన్ని నిర్మించగలం.
డా. ఆలూరి విజయలక్ష్మి,
98491 22441



