Sunday, July 26, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఏ వయసులో ఏం తినాలి..?

ఏ వయసులో ఏం తినాలి..?

- Advertisement -

సాధారణంగా మహిళల శరీరం ఎన్నో అసాధారణ మార్పులకు లోనవుతుంది. ఇరవైల వయసులో ఉండే ఉత్సాహం నలభైలలో ఉండదు. హార్మోన్లలో మార్పులు, అరవైల నాటి వృద్ధాప్యం.. ఇలా ప్రతి దశలోనూ మహిళల శరీరం నిరంతరం మారుతూనే ఉంటుంది. అయితే ఏ వయసులో ఉన్నా మహిళల ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీసేది మాత్రం పోషకాహార లోపం అంటున్నారు నిపుణులు. కనుక మహిళలకు ఏ వయసులో ఎలాంటి పోషకాలు అవసరమవుతాయో తెలుసుకుందాం…

వయసును బట్టి శరీరానికి కావలసిన పోషకాలు మారుతుంటాయి. కాలేజీ రోజుల్లో అవసరమైన ఆహారం నలభై ఏండ్లలోను, వృద్ధాప్యంలో సరిపోదంటున్నారు నిపుణులు. ఆరోగ్యం పాడైన తర్వాత బాధపడటం కంటే ముందే జాగ్రత్త పడటం ముఖ్యమని సూచిస్తున్నారు. చాలామంది మహిళలు తరచూ వచ్చే అలసట, గోళ్లు విరిగిపోవడం, కారణం లేకుండా మారే మూడ్ స్వింగ్స్ వంటి వాటిని బిజీ లైఫ్ వల్ల వచ్చే సమస్యలని పొరబడతారు. కానీ నిజానికి ఇవి శరీరంలో పోషకాహరం లోపం ఉందని చెప్పడానికి మన శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలని నిపుణులు చెబుతున్నారు.

ఇరవైలలో…
ఈ వయసులో ఉన్నవాళ్లు.. తాము దేన్నైనా సాధించగలమనే బలమైన నమ్మకంతో ఉంటారు. అలాగే దీర్ఘకాలిక శారీరక దృఢత్వానికి పునాది ఈ దశలోనే పడుతుంది. ఈ వయసులో కనిపించే పోషకాహార లోపాలు ఎక్కువగా ప్రత్యుత్పత్తి ఆరోగ్యం, శక్తి, జీవక్రియలకు సంబంధించి ఉంటాయని చెబుతున్నారు. ఐరన్​ : సాధారణంగా మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుందట. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. శరీరమంతటా ఆక్సిజన్​ను రవాణా చేసే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్​కు ఐరన్ ప్రధానమైన మూలకం. అయితే శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు.. తీవ్రమైన అలసట, మానసిక సమస్యలు, ఏకాగ్రత తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటప్పుడు లీన్ మీట్, పప్పుధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు.. ఇలా ఐరన్ ఎక్కువగా లభించే ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. అంతేకాదు శరీరం ఐరన్​ను గ్రహించడానికి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. విటమిన్ B9 (ఫోలేట్) : పిల్లలు పుట్టే వయసులో ఉన్న మహిళలకు అత్యంత కీలకమైన విటమిన్లలో ఫోలేట్ ఒకటి. ఇది కణ విభజనకు, డీఎన్‌ఏ సంశ్లేషణకు చాలా అవసరమంటున్నారు వైద్యులు. శరీరంలో తగినంత ఫోలేట్ స్థాయిలు ఉంటే.. ఎదుగుతున్న పిండాలలో వచ్చే తీవ్రమైన నరాల లోపాలను నివారించవచ్చని చెబుతున్నారు. అందుకు తమ రోజువారీ ఆహారంలో సిట్రస్ పండ్లు, పప్పుధాన్యాలు, అవకాడోలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. విటమిన్లు B9, B12 గర్భధారణకు ముందే మహిళలకు అందించాలని వైద్యులు సూచిస్తున్నారు.

నలభైలలో…
ఈ వయసులోకి ప్రవేశించడం వల్ల పెరి మెనోపాజ్ అనే సంక్లిష్టమైన దశ మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో జీవక్రియల రేటు మందగించడం ప్రారంభమవుతుంది. కండరాల ద్రవ్యరాశి సహజంగా తగ్గుతుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలలో వచ్చే హెచ్చుతగ్గులు శరీరం అంతటా శారీరక మార్పులను ప్రేరేపిస్తాయి. కనుక 40 ఏండ్ల వయసులో పోషకాహార పరంగా.. కణాల రక్షణ, ఒత్తిడి నిర్వహణ, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. 40, 50 వయసులో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పుధాన్యాల నుంచి ప్రతిరోజూ 25 – 31 గ్రాముల పీచుపదార్థం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మెగ్నీషియం
ఇది శరీరంలో 300 కంటే ఎక్కువ బయోకెమికల్ ప్రక్రియలను నియంత్రిస్తుందట. 40 ఏండ్లలో హార్మోన్ల మార్పుల కారణంగా మహిళలు తీవ్రమైన నిద్రలేమి సమస్యలు, కండరాల నొప్పులు, ఆందోళనను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. మెగ్నీషియం సహజంగానే నరాల వ్యవస్థను ప్రశాంతపరుస్తుందని అంటున్నారు. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొంటున్నారు. కనుక గుమ్మడికాయ గింజలు, బాదం, డార్క్​ డాకెట్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ దశలో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలియజేస్తున్నారు.
విటమిన్ D3, క్యాల్షియం : ఈస్ట్రోజెన్ స్థాయిలు క్రమంగా తగ్గడం ప్రారంభమవడంతోపాటు ఎముకల క్షీణత వేగంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ దశలో మహిళల్లో కనిపించే విటమిన్ D లోప లక్షణాలను గమనిస్తూ ఉండాలి. తగినంత విటమిన్ D3 లేకపోతే, శరీరం ఆహారం నుంచి క్యాల్షియం సమర్థవంతంగా గ్రహించలేదని వివరిస్తున్నారు. ఇది ఆస్టియోపీనియా ప్రారంభ దశలను వేగవంతం చేస్తుందని తెలియజేస్తున్నారు. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎండలో గడపడం, గుడ్లు, డాక్టర్లు సలహాలతో సప్లిమెంట్లను తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు.

అరవైలలో
ఈ వయసులో దీర్ఘాయువు, రోగనిరోధక శక్తి, ఎముకల సాంద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు నిపుణులు. మెనోపాజ్ తర్వాత ఆరోగ్యానికి కచ్చితమైన జాగ్రత్తలు అవసరమవుతాయని చెబుతున్నారు. ఎందుకంటే ఈ వయసులో సాధారణ ఆహార పదార్థాల నుంచి పోషకాలను గ్రహించడంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుందని తెలియజేస్తున్నారు. రుతువిరతి తర్వాత మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ B12 : వయసు పెరుగుతున్న కొద్ది.. కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందంటున్నారు నిపుణులు. దీనివల్ల మనం తినే ఆహారంలోని ప్రొటీన్ల నుంచి విటమిన్ B12 లోపం వల్ల నరాలు దెబ్బతినడం, చిత్తవైకల్యం లాంటి మానసిక క్షీణత, దీర్ఘకాలిక అలసట వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కనుక శాకాహారం తీసుకునే మహిళలు అయితే.. నరాల బలహీనతను నివారించడానికి 40, 60 ఏండ్లు పైబడిన వారికి అవసరమైన సప్లిమెంట్ల కోసం డాక్టర్లు సంప్రదించడం మంచిది.

జీర్ణాశయంలోని ఆమ్ల స్థాయిలు తగ్గడం వల్ల, జంతు ప్రోటీన్ల నుంచి B12ను విడగొట్టే శరీర సామర్థ్యం దెబ్బతింటుంది, దీనివల్ల నాడీ వ్యవస్థ క్షీణించడం, జ్ఞాపకశక్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నేషనల్‌ ‌లైబ్రరీ ఆఫ్‌ ‌మెడిసెన్‌ పేర్కొంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ : 60 ఏండ్లు పైబడిన మహిళలు.. సరైన ఆహార ప్రణాళికతో గుండె, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అద్భుతమైన యాంటీ ఇన్​ఫ్లమేటరీ కారకాలుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని, కీళ్ల నొప్పులను నియంత్రిస్తాయని తెలియజేస్తున్నారు. అంతేకాదు మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయని వివరిస్తున్నారు. శారీరక కదలికలు సులభంగా ఉండటానికి, మెదడును చురుగ్గా ఉంచుకోవడానికి.. వాల్​నట్స్, అవిసె గింజలు, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలను రోజువారీ ఆహారంలో ముఖ్యభాగంగా చేసుకోవాలని పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -