టిడిపి నేతలకు,
కార్యకర్తలకు చంద్రబాబు హెచ్చరిక
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు
హైబ్రిడ్ మోడ్‌లో ప్రారంభమైన మహానాడు
అమరావతి : ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్య్రకమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -సర్) పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టిడిపి మహానాడు-2026 హైబ్రిడ్ మోడ్‌లో బుధవారం ప్రారంభమైంది. టిడిపి కార్యాలయంలో వేదిక ఏర్పాటు చేయగా రాష్ట్రవ్యాప్తంగా 1874 క్లస్టర్లలో ఏర్పాటు చేసిన స్రీన్ల ద్వారా వర్చువల్‌గా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన చంద్రబాబు సర్ ప్రక్రియలో భాగంగా ఓట్ల నమోదు విషయంలో లీడర్లు, కేడర్ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అదే సమయంలో స్థానిక ఎన్నికల కోసం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏ ఎన్నికలైనా గెలుపే ప్రజాభిప్రాయానికి కొలమానం అన్నారు. మిత్ర పక్షాలతో సఖ్యతగా, సమన్వయంతో ముందుకు వెళ్దామని, 2024 ఎన్నికల్లో సాధించిన విజయం మళ్లీ రిపీట్ అయ్యేలా అందరం మమేకం కావాలన్నారు. తాము ఏ పాలసీ చేసినా అది యువత కోసమే చేస్తున్నామని చెప్పారు. జెన్ జీ, జెన్ అల్ఫా, ఆలోచనలకు అనుగుణంగా విధానాలు రూపొందించి అవకాశాలు కల్పించి సహకారం అందిస్తామన్నారు. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, తద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆకాశమే హద్దుగా యువత రాష్ట్రంలోని అవకాశాలు వినియోగించుకోవాలని తెలిపారు. పాలనలో అగ్రెసివ్‌గా, ప్రోగ్రెసివ్‌గా ముందుకు వెళ్తున్నామని అన్నారు. మహిళల సాధికారత, రాష్ట్రానికి పెట్టుబడులు – యువతకు అవకాశాలు, ప్రతీ ఎకరానికి సాగునీరు, అద్భుత రాజధానిగా అమరావతి నిర్మాణం, పేదవారికి సైతం అత్యుత్తమ వైద్యం, అందరికీ చదువు, అసమానతలు రూపుమాపడం, స్వర్ణాంధ్రను సాధించడమే టిడిపి లక్ష్యమన్నారు.
మొన్నటి విజయంలో మహిళలదే కీలక పాత్ర అని, ప్రజా క్షేత్రంలో పోరాడి పార్టీని గెలిపించారని చెప్పారు. అందుకే ఈ మహానాడును ఆడబిడ్డలకు అంకితం చేసేలా మహిళా మహనాడుగా ప్రకటిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం తనను కూడా అక్రమంగా జైల్లో పెట్టిందని, లోకేష్ యువగళాన్ని అడ్డుకోవడంతో పాటు ఎంతోమంది పార్టీ నేతలు, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టు చేశారని వివరించారు. వైసిపికి రాజధానిపై ఓ విజన్ లేదని, విషం కక్కడమే తెలుసునని విమర్శించారు. విశాఖలో రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని కూడా గత ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని ఆరోపించారు.తాము అధికారంలోకి వచ్చాకే విశాఖ రైల్వే జోన్ సాధించామని, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను తిరిగి నిలబెట్టామన్నారు. మహానాడు ఓ పసుపు పండుగ అని, ప్రజలకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చే ఓ వేదిక అని తెలిపారు. నాయకులను తయారు చేసే విశ్వవిద్యాలయం టిడిపి అని అన్నారు. ఇక్కడ చదువుకున్న, శిక్షణ పొందిన నాయకులే అన్ని చోట్లా రాణిస్తున్నారని తెలిపారు. సోషల్ రీ ఇంజినీరింగ్, అందరికీ అవకాశాలు కల్పించటమే పార్టీ లక్ష్యమన్నారు. ఎవరూ ఇగోలకు వెళ్లొద్దని, ప్రతీ నేతా జనంతో కార్యకర్తలతో మమేకం కావాలని తెలిపారు. అంతకుముందు మహానాడు ప్రారంభం సూచికగా కార్యాలయం వద్ద ఉన్న టిడిపి జెండాను ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులతో కలిసి చంద్రబాబు ఆవిష్కరించి అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళలర్పించారు.



