Thursday, May 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీఏ కార్యాలయాల్లో అక్రమార్కుల దందా

ఆర్టీఏ కార్యాలయాల్లో అక్రమార్కుల దందా

- Advertisement -

 లైసెన్స్‌‌ల జారీలో ప్రయివేటు ఏజెంట్లు, ప్రయివేటు డ్రైవింగ్‌ ‌స్కూళ్ల యాజమాన్యాలతో అధికారులు,
 సిబ్బంది కుమ్మక్కు
 పెద్ద మొత్తంలో లంచాలు దండుకుంటున్న వైనం
ఏసీబీ దాడుల్లో వెల్లడి


​నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు హైదరాబాద్‌‌తో పాటు మేడ్చల్‌‌-మల్కాజ్‌‌గిరి జిల్లాలోని మూడు ఆర్టీఏ కార్యాలయాలపై దాడులు జరిపి పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని గుర్తించారు. ముఖ్యంగా ప్రయివేటు ఏజెంట్లు, ప్రయివేటు డ్రైవింగ్‌ ‌స్కూళ్ల యాజమాన్యాలతో కుమ్మక్కై శాశ్వత లైసెన్స్‌‌లు, తాత్కాలిక లైసెన్స్‌‌ల జారీలో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. ఏసీబీ డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌చారుసిన్హా బుధవారం తెలిపిన వివరాల ప్రకారం… మేడ్చల్‌, కొండాపూర్‌, నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఈ మూడు ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రయివేటు ఏజెంట్లు తమ ఇష్టానుసారం తిష్ట వేసి తమకు చెందిన దరఖాస్తుదారులకు లైసెన్స్‌‌లను మంజూరు చేయించడంలో కీలక పాత్ర వహిస్తున్నట్టు సోదాల్లో బయటపడింది. ఒక్కో ఏజెంటు వద్ద మూడు నుంచి నాలుగు దరఖాస్తు ఫారంలు ఉండటం, వాటిని సులువుగా అధికారుల వద్దకు పంపించి, పని పూర్తయ్యేలా చేసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు.

అలాగే కొందరు ఆర్టీఏ అధికారుల వద్ద కోడ్‌‌ల రూపంలో ఏజెంట్ల పేర్లు ఉండటం, వాటి ఆధారంగానే గుట్టు చప్పుడు కాకుండా ఏజెంట్లకు సంబంధించిన దరఖాస్తుదారులకు లైసెన్స్‌‌లు మంజూరు చేస్తూ పెద్ద మొత్తంలో లంచాలను దండుకుంటున్నట్టు కూడా తేలింది. ఈ లంచాలను కూడా మూడో కంటికి తెలియకుండా ప్రయివేటు వ్యక్తుల ద్వారా పొందుతున్నట్టు అధికారులు గుర్తించారు. అలాగే మేడ్చల్‌‌తో పాటు నాగోల్‌ ‌డ్రైవింగ్‌ ‌టెస్టుల ట్రాక్‌‌ల వద్ద ఏకంగా ప్రయివేటు ఏజెంట్లు, ప్రయివేటు డ్రైవింగ్‌ ‌స్కూళ్ల యాజమాన్యాల ప్రతినిధులు చేరుకొని దరఖాస్తుదారులు లేకుండానే డ్రైవింగ్‌ ‌టెస్టులు పూర్తయినట్టుగా సర్టిఫికెట్లు పొందడాన్ని కూడా ఏసీబీ గుర్తించింది. మొత్తం 180 డ్రైవింగ్‌ ‌లైసెన్స్‌‌లను ఏజెంట్లకు సంబంధించినవి ఆర్టీఏ అధికారులు, సిబ్బంది జారీ చేసినట్టుగా ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. ఒక్క నాగోల్‌‌ ఆర్టీఏ కార్యాలయంలోనే రూ.41వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పై మూడు ఆర్టీఏ కార్యాలయాల నుంచి ఏజెంట్ల ద్వారా వచ్చిన దరఖాస్తులను పెద్ద మొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -