Thursday, May 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసర్కార్ బడుల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు

సర్కార్ బడుల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు

- Advertisement -

 ఈ విద్యా సంవత్సరంలో 
2,769 పాఠశాలల్లో 
ప్రీ-ప్రైమరీ సెక్షన్లు షురూ
మౌలిక సదుపాయాల కోసం ఒక్కో బడికి రూ. 1 లక్ష కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగు వేసింది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ అయిన ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించాలని సంకల్పించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఎంపిక చేసిన 2,769 ప్రభుత్వ, స్థానిక సంస్థల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వీటిని ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. క్యూర్ రీజియన్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పట్టణ ప్రాంత పరిధిలోని 529 పాఠశాలలు ఉన్నాయి. నాన్-క్యూర్ రీజియన్ పరిధి అయిన ఇతర జిల్లాల్లోని 2,240 పాఠశాలల్లో ఈ ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. జిల్లాల వారీగా చూస్తే, హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 275 సెక్షన్లు, నల్లగొండలో 124, భద్రాద్రి కొత్తగూడెంలో 118 సెక్షన్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

​సౌకర్యాల కోసం ప్రత్యేక నిధులు
ప్రీ-ప్రైమరీ సెక్షన్లు ప్రారంభించే ప్రతి పాఠశాలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రూ. ఒక లక్ష చొప్పున నిధులను కేటాయించింది. ఈ నిధులతో తరగతి గదులకు చిన్నపాటి మరమ్మతులు చేయడం, చిన్న పిల్లలకు అనువైన ఫర్నిచర్ కొనుగోలు, ఇండోర్, అవుట్‌డోర్ ఆట వస్తువుల ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా, పిల్లలను ఆకట్టుకునేలా తరగతి గది గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలను పెయింటింగ్ వేయించాలని విద్యాశాఖ ఆదేశించింది. చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా శిశు-స్నేహపూర్వక మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం కూడా కల్పించనున్నారు.

​ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకం
ఈ సెక్షన్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లను, ఆయాలను గౌరవ వేతన ప్రాతిపదికన నియమించనున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు ఈ నియామక ప్రక్రియను చేపట్టనున్నాయి. ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ. 8 వేలు, ఆయాలకు రూ. 6 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో చేరడానికి అర్హత ఉన్న వయస్సు గల పిల్లలందరినీ ఈ ప్రీ-ప్రైమరీ సెక్షన్లలో చేర్చుకోవచ్చు. బోధన పూర్తిగా ఎస్సీఈఆర్టీ రూపొందించిన ప్రత్యేక పాఠ్యప్రణాళిక ప్రకారం సాగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేద, మధ్యతరగతి పిల్లలకు బాల్యం నుంచే నాణ్యమైన పునాది విద్య అందుతుందని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

​అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలి:టీపీటీఎఫ్
ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగిందని టీపీటీఎఫ్ పేర్కొంది. ప్రజలు, ఉపాధ్యాయుల డిమాండ్ మేరకు 2025-26లో 1,362 పాఠశాలల్లో ప్రారంభించారనీ, 2026-27లో 2,769 పాఠశాలల్లో ప్రారంభించడానికి ఉత్తర్వులు టీపీటీఎఫ్ అధ్యక్షులు సి.హెచ్. అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 16 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలున్నాయని వారు గుర్తుచేశారు. ప్రతి సంవత్సరం కొన్ని పాఠశాలలకే అనుమతులిస్తే ప్రాథమిక పాఠశాలల బలోపేతం జరగదని తెలిపారు. దశల వారీగా కాకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించేలా ఉత్తర్వులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పూర్వ ప్రాథమిక తరగతులను బోధించడానికి సుశిక్షితులైన ఉపాధ్యాయులను వెంటనే శాశ్వత ప్రాతిపదికన నియమించాలని వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -