Tuesday, August 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇండ్ల లబ్దిదారుల లిస్టులో పేర్ల తొలగింపుపై ఆగ్రహం

ఇండ్ల లబ్దిదారుల లిస్టులో పేర్ల తొలగింపుపై ఆగ్రహం

- Advertisement -

తహసీల్దార్‌ కార్యాలయంలో లబ్దిదారుల ఆందోళన
సీపీఐ(ఎం) నాయకుల అరెస్ట్‌
పోలీసు వాహనాలను 
అడ్డుకున్న మహిళలు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

​ లాటరీ పద్ధతిలో 2023లో ఎంపికైన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల లబ్దిదారుల్లో పంపిణీ సమయంలో సుమారు 60 మందిని తొలగించడంపై కారణాలు చెప్పాలని డిమాండ్‌ ‌చేస్తూ బాధితులు సోమవారం తహసీల్దార్‌ ‌కార్యాలయంలో బైటాయించారు. దాంతో పోలీసులు సీపీఐ(ఎం) నాయకులను ఈడ్చుకెళ్లి అరెస్టు చేసి వాహనాల్లో తరలిస్తుండగా మహిళలు అడ్డుకున్నారు. సమాధానం చెప్పాల్సిన తహసీల్దార్‌ ‌తప్పించుకుని.. పోలీసులతో అరెస్టు చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లగొండ పట్టణంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను ఆగస్టు 15న లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఆ లిస్టులో గతంలో లాటరీ ద్వారా ఎంపికైన కొందరి పేర్లు తొలగించడంతో బాధిత లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, 17న తహసీల్దార్‌ ‌కార్యాలయానికి రావాలని అధికారులు సూచించారు. సోమవారం లబ్దిదారులతో కలిసి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల పోరాట సాధన కమిటీ కన్వీనర్‌ అవుట రవీందర్‌ తదితరులు తహసీల్దార్‌ ‌కార్యాలయానికి వచ్చారు. తహసీల్దార్‌ లేకపోవడంతో ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటామని కార్యాలయంలో బైటాయించారు. దాంతో పోలీసులు నాయకులను అరెస్టు చేసి పోలీస్టేషన్‌‌కు తరలిస్తుండగా లబ్దిదారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వారందరినీ చెదరగొట్టి నాయకులను స్టేషన్‌‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు మాట్లాడుతూ.. అరెస్టులను తీవ్రంగా ఖండించారు. అర్హులుగా ఎంపికైన వారి పేర్లు ఎందుకు తొలగించారో సమాధానం చెప్పకుండా అరెస్టు చేయడం ప్రజాపాలనా? అని ప్రశ్నించారు.

2023లో లాటరీ ద్వారా ఎంపికైన 431 మంది లబ్దిదారుల్లో గతంలో అధికారులు పునర్విచారణ చేసి 421 మందిని పూర్తి అర్హులుగా గుర్తించారని తెలిపారు. నల్లగొండలో నిర్మించిన 552 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు సంబంధించి మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించారన్నారు. అనంతరం 2025 నవంబర్‌లో అధికారులు మరోసారి విచారణ చేపట్టారని గుర్తు చేశారు. ఈనెల 13న మేయర్‌, ఆర్డీఓలు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను సందర్శించారని, గతంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్దిదారులకే ఇండ్లను పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారని అన్నారు. అయితే పంపిణీ సమయంలో సుమారు 60 మంది పేర్లు తొలగించడం అన్యాయమన్నారు. తొలగింపునకు కారణాలు అడిగినందుకు అరెస్టులు చేయడం దుర్మార్గమని అన్నారు.
లాటరీ ద్వారా ఎంపికైన వారికి ప్రొసీడింగ్‌ ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. అర్హులందరికీ ఇండ్లు అందే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల సాధన పోరాట కమిటీ సభ్యులు గంజి రాజేష్‌, పగిళ్ల జయమ్మ, మధుసూదన్‌, రాధ, రహీమున్నీసాభేగం, కాపర్తి ధనమ్మ, పసుపుల సంధ్య, పుట్టబత్తుల పావని, నల్లబోతు కవిత, గుంటి నాగలక్ష్మి, మేకల కల్పన పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -