విద్యార్థినులపై వేధింపులు

విద్యార్థినులపై వేధింపులు– 142 మంది శారీరకంగా, మానసికంగా
—  హర్యానాలో ప్రభుత్వ స్కూల్‌ ప్రిన్సిపల్‌ దుశ్చర్య
–  రాష్ట్ర విద్యాశాఖకు త్రిసభ్య కమిటీ నివేదిక
చండీగఢ్‌ : హర్యానాలో ఒక ప్రభుత్వ స్కూల్‌ ప్రిన్సిపల్‌ దుశ్చర్యకు పాల్పడ్డాడు. 142 మంది విద్యార్థినులపై శారీరక, మానసిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. సుమారు 142 మంది విద్యార్థినులు శారీరక, మానసిక హింసకు సంబంధించిన సాక్ష్యాలను అధికారులకు అందించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ కర్తార్‌ సింగ్‌ దుశ్చర్యకు పాల్పడ్డారన్న ఆరోపణలపై జింద్‌ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తన నివేదికను రాష్ట్ర విద్యాశాఖకు సమర్పించింది. ఈ కమిటీకి ఉచన సబ్‌డివిజన్‌కు చెందిన ఎస్డీఎం గుల్జార్‌ మాలిక్‌ నేతృత్వం వహించారు. మిగిలిన ఇద్దరు సభ్యులుగా జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి, జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారిణి జ్యోతి ఉన్నారు.
నివేదిక ప్రకారం.. మొదట 60 మంది బాధితులు ఉన్నారు. కమిటీ విద్యార్థులను వినడం ప్రారంభించిన తర్వాత ఆ సంఖ్య 142 కి పెరిగింది. 142 మంది బాధితుల్లో ఎక్కువ మంది ప్రిన్సిపాల్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ ప్రస్తుతం జైలులో ఉన్నారు. చాలా మంది బాధితులు వారి ఛాతీ, తొడ, తలపై శారీరక వేధింపులు జరిగాయని బహిర్గతం చేశారు. వారిలో కొందరు మరింత తీవ్రమైన లైంగిక వేధింపులను నివేదించారు.
ఈ అంశాన్ని లేవనెత్తుతూ 15 మంది బాధితులు ఈ ఏడాది ఆగస్టు 31న భారత రాష్ట్రపతి, ప్రధాని, భారత ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మహిళా కమిషన్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ తదితరులకు లేఖ పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లేఖను స్వీకరించిన తర్వాత, హర్యానా మహిళా కమిషన్‌ సెప్టెంబర్‌ 13న దానిని గమనించి ఆ తర్వాతి రోజే చర్య కోసం జింద్‌ పోలీసులకు పంపింది. అయితే పోలీసులు అక్టోబర్‌ 30న మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితుడు ప్రిన్సిపాల్‌ను పోలీసులు నవంబర్‌ 4న అరెస్ట్‌ చేశారు. తర్వాత నవంబర్‌ 7న జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారు.కాగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో దాదాపు ఒకటిన్నర నెలల జాప్యంపై పలువురు నిపుణులు, సామాజిక కార్యకర్తలు జింద్‌ పోలీసులను ప్రశ్నించారు. పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం కింద కేసు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ఎట్టకేలకు అది ప్రస్తుతం నెరవేరింది. జింద్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం ఇమ్రాన్‌ రజా నివేదికను ధృవీకరించారు. కమిటీ 390 మంది విద్యార్థుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసిందని ఆయన తెలిపారు.

Spread the love