ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత!
అంబేద్కర్, ఇందిరమ్మతో
పాటు స్మరించుకోవాల్సిన ‘జాతిరత్నం’ ఎన్టీఆర్
ఎందరో మేటి నాయకులను అందించారు
విమర్శలు పట్టించుకోను..
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ‘ప్రజా పాలన’..
30 వేల ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’నిర్మాణం..
అమీర్‌పేటలో విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో/జూబ్లీహిల్స్
తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కేవలం ఒక పార్టీకో, వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని, దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశ చరిత్ర నుంచి ఎవరిని స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు జాతి రత్నాలను తలచుకోవాలన్నారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట మైత్రీవనం సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని గురువారం సీఎం ఆవిష్కరించారు. అనంతరం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
ముగ్గురు ‘జాతిరత్నాల’ స్ఫూర్తితో ముందుకు..
దేశ చరిత్రను తిరగరాసిన ముగ్గురు గొప్ప నేతలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సీఎం సూచించారు. రాజ్యాంగం ద్వారా పేదలకు ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్, భూసంస్కరణలతో పేదలకు భూమిపై హక్కు కల్పించిన ఇందిరా గాంధీ, నీతి – నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచిన ఎన్టీఆర్.. ఈ ముగ్గురూ మానవ మనుగడ ఉన్నంత కాలం స్మరించుకోవాల్సిన ‘జాతిరత్నాలు’ అని చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై వస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ‘ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం నాకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన ఒక మహాశక్తి. ఆనాడు ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి వంటి నేతలను దేశానికి అందిస్తే.. తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, కడియం శ్రీహరి వంటి వారితోపాటు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కూడా ఎన్టీఆర్ గుర్తించి మంచి నాయకులుగా తీర్చిదిద్దారు’ అని అన్నారు.
సంక్షేమంలో అన్నగారి బాట..
నేటి ప్రభుత్వ పథకాల వెనుక ఎన్టీఆర్ ఆలోచనలు ఉన్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘మేము అమలు చేస్తున్న సన్నబియ్యం పథకానికి ఎన్టీఆర్ తెచ్చిన రూ. 2 కిలో బియ్యం పథకమే పునాది. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ఘనత ఆయనది. రాజీవ్ గాంధీ తెచ్చిన రిజర్వేషన్లను అమలు చేసి బలహీన వర్గాలను పాలకులుగా మార్చిన ప్రజాస్వామ్యవాది ఎన్టీఆర్’ అని సీఎం కొనియాడారు.
లక్ష్యం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతామని సీఎం చెప్పారు. తాము 30 వేల ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తామన్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఇక్కడికి రప్పించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. 2034 వరకు ప్రజా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.



