ఆస్తులు రూ.4,929 కోట్లు, అప్పులు రూ.32 వేల కోట్లు
5,22,479 ట్రాన్స్ఫార్మర్లు, 29,05,779 వ్యవసాయ పంపుసెట్లు
అధికారులతో కలిసి మొత్తం సిబ్బంది 2 వేలు
ఒక వ్యక్తికి 600 ట్రాన్స్ఫార్మర్లు, 3 వేల పంపు సెట్లు
నిర్వహణ ఎలా సాధ్యమవుతుందో సర్కారే చెప్పాలి
అనుమతిపై నేడు ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ
ఊరగొండ మల్లేశం
బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టి నడవమంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టే ఉంటది యవ్వారం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే రైతు డిస్కం పరిస్థితి అలాగే ఉంది. ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా తీసుకున్న నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారే ప్రమాదముంది. 29,05,779 వ్యవసాయ పంపుసెట్లు, 5,22,479 ట్రాన్స్ఫార్మర్లు, 2,61,240 కిలోమీటర్ల వ్యవసాయ ఎల్టీ(లోటెన్షన్) లైన్ల నిర్వహణకు అధికారులతో కలిసి మొత్తం 2 వేల మందిని మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఒక వ్యక్తికి 600 ట్రాన్స్ఫార్మర్లు, 3 వేల పంపు సెట్ల నిర్వహణ ఎలా సాధ్యమవవుతుంది. తెలంగాణలో సగటున ఏటా 5 శాతం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడమో, రిపేర్ అవడమో జరుగుతున్నాయి. రెండు మండలాలకు ఇద్దరు చొప్పున ఉండే విద్యుత్ సిబ్బంది వాటిని మరమ్మత్తు చేయించాలంటే 6 నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. పంటలు ఎండి పోతున్నాయనే ఆదుర్దాలో రైతులే వాటిని కిందికి దించి రిపేర్ చేయించడం, తిరిగి పునరుద్ధరించడం లాంటి చర్యలు పాల్పడే అవకాశం ఉంది. ఫలితంగా రాష్ట్రంలో విద్యుత్ మరణాలు పెరిగే అవకాశం ఉందనే అందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అలాగే ఎల్టీ లైన్ల నిర్వహణ కూడా క్షేత్ర స్థాయి సిబ్బందికి భారంగా మారనుంది. సరైన నిర్వహణ లేక బ్రేక్‌డౌన్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
రెండు డిస్కంల పరిధిలోని వ్యవసాయ విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లపై మూడో డిస్కంకు పూర్తి అధికారాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాకు గాను వీల్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది రైతు డిస్కంకు అదనపు భారంగా మారనుంది. అలాగే పెట్టుబడి వ్యయానికి మూడో డిస్కం అప్పు చేయాల్సి ఉంటుంది. ఉచిత పథకాలన్నీ మూడో డిస్కంకు బదలాయించడంతో ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలు లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించడంపై మూడో డిస్కం మనుగడ అధారపడి ఉంది. రైతు డిస్కం ఏర్పాటులో ఇన్ని సమస్యలున్నప్పటికి ప్రభుత్వం ముందస్తు అంచనా ఎందుకు వేయలేదనేది అందరిని వేధిస్తున్న ప్రశ్న. ఎవరి ప్రయోజనం కోసం సర్కార్ ఇంత ఆదరాబాదరాగా ముందుకు వెళుతోంది. స్టేక్ హోల్డర్లు, విద్యుత్ రంగ నిపుణులతో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాన్ని ఎందుకు గాలికొదిలేసింది? ఇవన్ని శేష ప్రశ్నలే. నేడు జరగనున్న విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ప్రజాభిప్రాయ సేకరణలో దీన్ని వ్యతిరేకించాలని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్తో పాటు సీపీఐ(ఎం), సీపీఐ తదితర వామ పక్ష పార్టీలకు చెందిన ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పబ్లిక్ హియరింగ్‌లో ప్రత్యేక్షంగా పాల్గొని తమ వాదనలు బలంగా వినిపించా లని సమాయత్తమవుతున్నాయి.
భారం కానున్న నిర్వహణ
కొత్త డిస్కం పరిధిలోకి రూ.4,929 కోట్ల ఆస్తులతో పాటు రూ.32 వేల కోట్ల అప్పులను ప్రభుత్వం బదిలీ చేసింది. 5,22,479ల డీటీఆర్‌ల ఖరీదు రూ.2,792 కోట్లు కాగా, 2,61,240 కిలోమీటర్ల ఎల్టీ లైన్ల విలువ రూ.2,137 కోట్లుగా తేల్చింది. కొత్త డిస్కం పరిధిలోని ప్రతి డీటీఆర్ కు స్మార్ట్‌మీటర్ బిగించనున్నారు. ఒక్కో మీటర్‌కు రూ.25 వేలు అవుతాయని అంచనా వేసి, మొత్తం డీటీఆర్‌ల స్మార్ట్ మీటర్లకు రూ.1,306 కోట్లు అవుతాయని లెక్కతీశారు. రైతులు, గృహజ్యోతి తదితర పథకాలకు ఏటా రూ.16 వేల కోట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని సర్కార్ చెల్లిస్తామంటోంది. అయితే విద్యుత్ ఉద్యోగులు, నిపుణుల అంచనాల ప్రకారం రెండు డిస్కం పరిధి నుంచి ఈ మొత్తం దాదాపు రెండింతలు ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు మిగిలిన మొత్తం విద్యుత్‌ను అంతర్గతంగా ఇతర వాణిజ్య అవసరాల నుంచి సర్దుబాటు చేస్తున్నా రని చెబుతున్నారు. ఉచితాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ డిస్కంకు కేవలం రూ.16 వేల కోట్లు మాత్రమే సర్దుబాటు చేస్తే మిగిలిన మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో తెలియని పరస్థితి నెలకొంది. దానికి తోడు సర్కార్ చెల్లింపులు ఆలస్యం అయితే నెల వారి జీతాలకు కూడా కటకట ఏర్పటయ్యే అవకాశం ఉంటుందనే అందోళన వ్యక్తమవుతోంది.
కుట్ర కోణం..
రైతు డిస్కం ఏర్పాటులో కుట్ర కోణం దాగుందని రాష్ట్రంలోని రాజీకీయ పార్టీలు, ప్రజ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, మేధావులు, పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ముందస్తు అంచనాలు, ప్రణాళిక లేకుండా, పౌరసమాజంతో ఎలాంటి చర్చలు జరపకుండా రాష్ట్రప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రయివేట్ వ్యక్తులకు ధారదత్తం చేయాలని సర్కార్ ప్రయత్నిస్తోంది. రూ.35 కోట్ల అప్పులతో ఏర్పాటు చేసే డిస్కం రైతులకు ఎలా మేలు చేస్తుంది? ఈఆర్సీ ఇంకా అనుమతివ్వకుండానే జూన్ 2న రైతు డిస్కంను ప్రారం భిస్తామని సీఎం ఎలా చెబుతారు? కేంద్రం ఒత్తిడి మేరకే రైతు డిస్కంను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రయోజనాల కోసం తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తోంది. రైతు డిస్కంను వేరు చేసి ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌ను ప్రయివేటీకరించే ప్రయత్నం జరుగుతోంది’ అనే ఆందోళన పౌర సమాజంలో వ్యక్తమవుతోంది.
విద్యుత్ సంస్థలను ప్రయివేటీకరించేందుకే రైతు డిస్కం
-కె. ఈశ్వర్రావు, టీయూఏయూ(సీఐటీయూ),
రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలను ప్రయివేటీకరించేందుకే రైతు డిస్కంను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2003 విద్యుత్ సవరణ చట్టంను అమలు చేసేందుకే రైతు డిస్కం పేరిట ప్రజలను మభ్య పెడుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభు త్వం ఆర్డీఎస్ఎస్లో చేరడమే ఇందు కు నిదర్శనం. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) రైతు డిస్కంకు అనుమతి ఇవ్వద్దు.
ముందస్తు చర్యలేవి?
తుల్జారాం సింగ్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ ఎంప్లాయీస్ ఫోరం
ముందస్తు చర్యలు చేపట్టకుండా రైతు డిస్కంను ఏర్పాటు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఏటా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిం చాల్సిన సబ్సీడి రూ.16 వేల కోట్ల మొత్తం ఆలస్యమైతే నిర్వహణ, జీతాలు భారంగా మారుతాయి. ఫలితంగా డిస్కం మరింత అప్పుల్లో కూరుకు పోయే ప్రమాదముంది. ఒక్కో సిబ్బందికి 600 ట్రాన్స్ఫార్మర్లు, 3వేల కనెక్షన్ల నిర్వహణ ఎలా సాధ్యం? కొత్త డిస్కం వల్ల రైతులతో పాటు ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు.



