– కాంగ్రెస్ కార్యకర్తల కాళ్లల్ల కట్టె అడ్డం పెట్టొద్దు
– చట్టసభల సభ్యులు రాజ్యాంగ విలువలకు కట్టుబడాలి :మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
నవతెలంగాణ – జగిత్యాల
ఇకనైనా పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకోవాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఎమ్మెల్యే సంజయ్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా బుద్ధిగా ఉండాలని, అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాళ్లల్ల కట్టే అడ్డం పెట్టడం మానుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై స్పీకర్ తీర్పు వచ్చిందని, ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీకే చెందినవారని స్పష్టమైందని అన్నారు. ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకున్నందుకు సంతోషమని వ్యాఖ్యానించారు. చట్టసభలకు ఎన్నికైన వారు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. తమ సంసారం చక్కబెట్టుకోకుండా కాంగ్రెస్ కుటుంబంలో ఎందుకు చిచ్చు పెడుతున్నారని నిలదీశారు. 20 నెలల్లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన పనులు ఏవో చెప్పాలన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మెడికల్ కళాశాలలు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలేనని తెలిపారు. జగిత్యాలలో బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో తాను రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేయించానని, నేటికీ పేదలకు అది వరంగా మారిందని చెప్పారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులనే తిరిగి తెచ్చినట్టు చెప్పుకోవడం సరికాదన్నారు. కాంట్రాక్టుల ద్వారా లాభాలు పొందడమేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట ఫలితంగానే రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆ ఫలాలు కార్యకర్తలకే దక్కాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమ్మ ఆదర్శ పాఠశాలలు, ప్రత్యేక అభివృద్ధి నిధులు, ఉపాధి హామీ నిధులతో మూడు నెలల్లో రూ.30 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. బీసీ మహిళలకు కేటాయించిన సీటును చట్టంలోని లొసుగులతో కాజేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాలలో అంగడి చిట్టి రద్దు చేయించిన ఘనత తమదేనని గుర్తు చేశారు. యావర్ రోడ్డు విస్తరణ ఎందుకు చేయలేకపోయారో చెప్పాలన్నారు. జగిత్యాల బైపాస్ రోడ్డు మరమ్మతులకు ప్రతిపాదనలు చేసినట్టు తెలిపారు. ప్రజలంతా గమనిస్తున్నారని, మార్పు కోరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇకనైనా కాంగ్రెస్ కుటుంబంలో చిచ్చు పెట్టకుండా పక్కింటికి కన్నం వేసే బుద్ధి మానుకోవాలని జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేకు సూచించారు.
పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



