దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా దాసరి ఘాట్‌ను హీరో మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై మనోజ్ రియాక్ట్ కావటమే కాకుండా స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా మనోజ్ మంచు మాట్లాడుతూ,’గురువు దాసరి గురించి చెప్పాలంటే గొప్ప డైరెక్టర్..గొప్ప యాక్టర్.. గొప్ప స్క్రీన్ ప్లే రైటర్.. డైలాగ్స్, ఎడిటింగ్.. ఇలా 24 శాఖలపై ఆయన రాణించారు. దాసరి ఓ ఇన్స్టిట్యూట్. ఆయన మనకు ఓ దారి చూపించారు. దాసరి పని అయిపోయిందని అనుకునే సమయంలో ఓ కొత్త రకమైన సినిమాతో మన ముందుకు వచ్చేవారు. ఈరోజు మనం థియేటర్స్ సమస్యలంటూ మాట్లాడుకుంటున్నాం.ఇబ్బంది పడుతున్నాం. కానీ నాకు తెలిసి ఆయన ఎప్పుడో దీనికి సంబంధించి మార్గం చూపించారు. ఎప్పుడో ఓ సినిమా చేయటం కాదు.. ఎప్పుడూ సినిమా చేయాలని చెప్పారు. నాతో పాటు నాతోటి హీరోలందరూ సినిమాలు చేయటానికి ఎంతో కష్టపడుతున్నారు. అందరం వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలి. ఆ బాధ్యత అందరిపై ఉంది` అని తెలిపారు.



