బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కంటోన్మెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం
ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు : మాజీమంత్రి తలసాని
నవతెలంగాణ-కంటోన్మెంట్
అబద్దాపు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి.. రైతు డిస్కం పేరిట మరో మోసానికి తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామరావు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని క్లాసిక్ గార్డెన్స్‌లో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పై బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయానికి రోజుకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని ప్రగల్బాలు పలుకుతున్నాడని ఆరోపించారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినా.. గ్రామాల్లో రేవంత్ 420 మోసపూరిత హామీలను నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని, దేశం మొత్తం కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే మనం నెత్తి మీద పెట్టుకున్నామన్నారు. ఈ రెండున్నరేండ్లలో రేవంత్ రెడ్డి రూ.4 లక్షల కోట్లు అప్పులు చేసి ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. రైతుల ధాన్యం కొనే దిక్కులేదు కానీ ధనం సంచులను మాత్రం ఢిల్లీకి పంపుతున్నారని అన్నారు. 65 ఏండ్లలో కాంగ్రెస్ చేయని పనిని ఆరు నెలల్లో కేసీఆర్ చేసి చూపించారని, 24 గంటల పాటు రైతులకు, పరిశ్రమలకు కరెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. అందరూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో పాల్గొని.. మన ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు.
ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు : తలసాని
ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని, బాల్క సుమన్‌పై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారని సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అప్పుడు వారి ఆటలు సాగవని, మిత్తీతో సహా చెల్లిస్తామని తెలిపారు. సర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. కంటోన్మెంట్‌లో ఇంకా అభివృద్ధి జరగాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. అలాగే, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును పండుగలా చేపట్టాలని తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గ సభ్యత్వ ఇన్‌చార్జి మన్నే క్రిశాంక్ మాట్లాడుతూ.. గత ఉప ఎన్నికల్లో ఓటుకు రెండు వేలు పంచిన ఎమ్మెల్యే, ఆ డబ్బులను తిరిగి సంపాదించుకోవడంలో బీజీగా ఉన్నారని ఆరోపించారు. సర్, పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోయిన్‌పల్లి మార్కెట్ మాజీ చైర్మెన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్‌నాథం, అనిత, నళిని, శ్యాంకుమార్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు.
రైతు డిస్కం పేరుతో మరో మోసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



