జూన్ నెల వస్తోందంటే ఒకప్పుడు పిల్లల్లో కొత్త తరగతుల ఉత్సాహం, కొత్త పుస్తకాల సువాసన, కొత్త స్నేహాల సందడి కనిపించేది. కానీ, ఇప్పుడు జూన్ పేరు వినగానే తల్లిదండ్రుల గుండెల్లో గుబులు మొదలవుతోంది. పిల్లల చదువు కోసం డబ్బు ఎంత సమకూర్చాలి? ఫీజులు ఎంత పెరిగాయి? పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంల కోసం ఇంకెంత ఖర్చవుతుంది? – ఈ ప్రశ్నలే వారిని వేధిస్తున్నాయి. ఓవైపు అంతర్జాతీయంగా యుద్ధ ప్రభావంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. మరోవైపు ఈఎంఐలు, అప్పులు, కుటుంబ పోషణకే నెలజీతం సరిపోని పరిస్థితి ఉంది. ఇలాంటి స్థితిలో పిల్లల భవిష్యత్తు కోసం పడుతున్న ఈ ఆర్థిక పోరాటం జూన్‌లో మరింత తీవ్రంగా మారుతోంది. ఈ రోజు పిల్లలను పాఠశాలలకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారంటే – అది ముమ్మాటికీ పాలకుల వైఫల్యమే తప్ప వేరేకాదు ప్రభుత్వాలు విద్యను మౌలిక హక్కుగా చెబుతున్నప్పటికీ, ఆచరణలో విద్య క్రమంగా వ్యాపార వస్తువుగా మారిపోవడం విచారకరం. ముఖ్యంగా ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రతి ఏడాది ఫీజులను ఇష్టానుసారంగా పెంచడం తల్లిదండ్రులకు అదనపు భారం హైదరాబాద్‌లోని ఒక ప్రయివేటు పాఠశాలలో ఒకటో తరగతి ఫీజు అక్షరాల రెండులక్షల నలభై వేల రూపాయలు నిజంగా ఆశ్చర్యం. ఒక్కఫీజే కాదు, ట్యూషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, ల్యాబ్ ఫీజు, యాక్టివిటీ ఫీజు, ట్రాన్స్‌పోర్టు ఫీజు, డిజిటల్ క్లాస్‌రూమ్ ఫీజు అంటూ ఏడదంతా వసూళ్ల పర్వం నడుస్తూనే ఉంటుంది.
ఫీజుల సమస్యతో పాటు పుస్తకాల భారం కూడా పెరుగుతోంది. పాఠ్యపుస్తకాలతో పాటు అదనపు నోటుబుక్స్, వర్క్‌బుక్స్, ప్రాక్టీస్ మెటీరియల్ పేరుతో వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. చాలాచోట్ల పాఠశాల యాజమాన్యాలే నిర్దేశించిన దుకాణాల నుంచి మాత్రమే పుస్తకాలు కొనాలని ఒత్తిడి చేస్తున్నాయి. మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే అవకాశం ఉన్నా, తల్లిదండ్రులకు ఆ స్వేచ్ఛ ఉండటం లేదు. విద్యార్థుల భుజాలపై మోయలేని పుస్తకాల బరువు పెరుగుతుంటే, కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. కొన్ని పాఠశాలల్లో యాజమాన్యాలే పుస్తకాల అమ్మకానికి తెరదీశాయి. తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆలోచిస్తేనే వారి ఆవేదన అర్థమవు తుంది. ఒకేసారి ఫీజులు చెల్లించాలి. పుస్తకాలు కొనాలి. యూనిఫాంలు సిద్ధం చేయాలి. రవాణా ఖర్చులు భరించాలి. చాలామంది ఇది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిగా మారుతోంది. ఈ పరిస్థితులకు ప్రధాన కారణం ఫీజుల నియంత్రణపై ప్రభుత్వాల నిర్లక్ష్యం. చాలా ఏండ్లుగా ప్రయివేటు విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే సమగ్ర చట్టం అవసరమని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వంటి చోట ఫీజులు తగ్గించాలని ఆందోళనకు కూడా దిగారు. కోర్టులు కూడా పలుమార్లు ప్రభుత్వాలకు మార్గదర్శకాలిచ్చాయి. అయినప్పటికీ కఠినమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పాలకులు విఫలమవు తున్నారు. విద్యారంగంలో పెరుగుతున్న వ్యాపార ధోరణి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు.
కానీ, పాలకులకు ఆ చిత్తశుద్ది లేదనే తెలుస్తోంది. నేడు బడిలో నూటయాభై మంది విద్యార్థినులకు ఒకే బాత్రూం ఉండటం ప్రభుత్వాల డొల్లతనాన్ని బయట పెడుతోంది. ఇలాంటి కారణాలతోనే తల్లిదండ్రులు ప్రయివేటును ఆశ్రయిస్తున్నారు. అక్కడేమో యాజమా న్యాలు వారిని నిలువు దోపిడీ చేస్తున్నాయి. విద్యా రంగంలో కార్పొరేటీకరణ పెరుగుతుండగా, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో మాత్రం తగిన శ్రద్ధ కనిపించడం లేదు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాణ్యంగా తీర్చిదిద్దితే సహజంగానే ప్రయివేటు విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. కానీ అందుకు అవసరమైన ఉపాధ్యాయ నియామకాలు, మౌలిక వసతులు, నిధుల కేటాయింపులు సరైన స్థాయిలో లేవు. ఒకవైపు ప్రభుత్వ విద్య బలహీనపడుతుంటే, మరోవైపు ప్రయివేటు విద్యాసంస్థలు దాన్ని అవకాశంగా మార్చుకుని తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. అందువల్ల ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయడం అత్యవసరం. జూన్ నెల అంటే పిల్లల భవిష్యత్తుకు పునాది వేసే కాలం. కానీ నేడు అది లక్షల కుటుంబాలకు భయాన్ని, ఆందోళనను మిగులుస్తోంది. విద్యను వ్యాపారంగా మార్చిన విధానాలను అడ్డుకోకపోతే ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. పాలకులు కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాయడం మానేసి ప్రజల పక్షాన నిలవాలి. విద్య హక్కని, వ్యాపారం కాదన్న సత్యాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఈ సారైనా పాఠశాలల ప్రారంభం కాగానే పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేయాలి. అప్పుడే ‘వామ్మో జూన్!’ అనే నిట్టూర్పు స్థానంలో ‘వెల్‌కం జూన్’ అనే ఆనందం తల్లిదండ్రుల ముఖాల్లో కనిపిస్తుంది.
వామ్మో ‘జూన్’!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



