న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జూన్ 6న భారత్‌కు తిరిగివస్తున్నానని, ఆరోజు జరిగే నిరసనల్లో తాను పాల్గొంటానని సోమవారం వెల్లడించారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ విషయంపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తన పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీలో శాంతియుత నిరసన చేపడతామని పేర్కొన్నారు. ఢిల్లీలో తాను చేస్తున్న నిరసనలో విద్యార్థులు, మద్దతుదారులు పాల్గొనాలని సోమవారం ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పిలుపునిచ్చారు. ‘‘భారత రాజ్యాంగ మార్గాన్ని అనుసరిస్తూ మనమందరం ఏకమై, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మనమందరం కలిసి గళం విప్పితే, వారు తప్పకుండా మన మాట వింటారు. నేను జూన్ 6వ తేదీ శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకుంటాను. దయచేసి విమానాశ్రయంలో నాతో కలవండి. మనమిద్దరం కలిసి జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టేందుకు అనుమతి కోరడానికి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్దాం’’ అని వీడియోలో ఆయన అన్నారు. ఆ వీడియోలో, పరీక్షలకు సంబంధించిన వివాదాలు, అంతరాయాల వల్ల విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని, ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని దీప్కే ఆరోపించారు.



