Sunday, August 2, 2026
E-PAPER
Homeజాతీయంఆందోళన ముగిసినా… ఆఫీసులో మరో పరీక్ష!

ఆందోళన ముగిసినా… ఆఫీసులో మరో పరీక్ష!

- Advertisement -

జంతర్‌మంతర్‌లో నిరసన తెలిపిన
జెన్‌ ‌జీ ఉద్యోగులపై సంస్థల భిన్న వైఖరి

ఢిల్లీలోని జంతర్‌‌మంతర్ వద్ద రోడ్డుపై నినాదాలు ఆగిపోయినంత మాత్రాన నిరసన ఆగిపోలేదు. మరుసటి రోజు ఉదయం కార్యాలయాలకు వెళ్లిన తర్వాతే చాలా మంది యువ ఉద్యోగులకు అసలు పరీక్ష మొదలైంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షా వ్యవస్థ సంస్కరణల కోసం చేపట్టిన నిరసనల్లో పాల్గొన్న జెన్‌-జీ విద్యార్థులు, యువ ఉద్యోగులు తిరిగి కాలేజీలకు వెళ్లినప్పుడు, విధుల్లో చేరినప్పుడు కొందరికి ప్రశంసలు లభించగా, మరికొందరు అనుమానాలు, పరోక్ష హెచ్చరికలు, మేనేజర్ల ‘లెక్చర్లు’ ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితి భారత కార్పొరేట్ రంగంలో ఉద్యోగి వ్యక్తిగత అభిప్రాయాలు, పౌరస్వేచ్ఛ, సంస్థల ప్రతిష్ఠ మధ్య కొత్త చర్చకు తెరలేపుతోంది.

న్యూఢిల్లీ : ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో వేలాది మంది విద్యార్థులు, యువ ఉద్యోగులు పరీక్షా వ్యవస్థలో సమూల మార్పులు కోరుతూ మోడీ సర్కారుకు వ్యతిరేకంగా వారాల తరబడి ఆందోళనలు నిర్వహించా రు. ఇందుకోసం కొందరు ప్రత్యేకంగా సెలవులు తీసుకుని వచ్చారు. మరికొందరు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ప్రయాణించి వచ్చి మరీ నిరసనల్లో పాల్గొన్నారు. ఎట్టకేలకు మోడీ ప్రభుత్వాన్ని మోకాళ్లపై నిలుచోబెట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాను సాధించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఉద్యమం ముగించుకొని అందరూ తమ తమ ఉద్యోగాలు, కళాశాలలకు తిరిగి వెళ్లిన తర్వాత వారికి వేర్వేరు అనుభవాలు ఎదురయ్యాయి.

‘దేశాన్ని మార్చేసి వచ్చావా’ అంటూ…
గురుగ్రామ్‌లోని ఓ ప్రకటన సంస్థలో పనిచేస్తున్న దీపాలి కపూర్‌ మాట్లాడుతూ… ‘‘నిరసన ఎలా జరిగిందని ఎవరూ అడగలేదు. ‘దేశాన్ని మార్చేసి వచ్చావా?’ అంటూ మేనేజర్ నవ్వుతూ అన్నారు. మేనేజర్‌ ‌మాటలతో సహోద్యోగులు, సిబ్బంది అందరూ నవ్వారు. నేనూ నవ్వాల్సి వచ్చింది. కానీ మేనేజర్‌ ‌చేసిన ఆ వ్యాఖ్య వెనుక నన్ను ఎద్దేవా చేసే భావన ఉందని అర్థమైంది’’ అని తెలిపింది. జంతర్‌‌మంతర్‌ ‌నిరసనల్లోనే పాల్గొన్న ఘజియాబాద్‌కు చెందిన మార్కెటింగ్ ఉద్యోగి దీక్షా శర్మకు మాత్రం ఇందుకు భిన్నమైన అనుభవం ఎదురైంది. సహోద్యోగులు ఆమెను అభినందించడమే కాకుండా.. సమాజ సమస్యలపై యువత స్పందించడం అభినందనీయమని సీనియర్ అధికారులు ప్రశంసించినట్టు తెలిపింది. మరోవైపు గురుగ్రామ్‌కు చెందిన ఓ సేల్స్ ఉద్యోగిని మాట్లాడుతూ.. ‘‘నాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. కానీ రాజకీయాలకు దూరంగా ఉండాలని మేనేజర్ 20 నిమిషాల పాటు లెక్చర్‌ ఇచ్చారు. అది ‌నాకు ఒక శిక్ష కంటే ఎక్కువగా అనిపించింది’’ అని వివరించింది.

​సోషల్‌ ‌మీడియాతో చిక్కులు
గతంలో ఉద్యోగులు కార్యాలయం బయట ఏమి చేస్తారో సంస్థలకు పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా ప్రతి ఫోటో, ప్రతి ట్వీట్‌, ప్రతి రీల్‌, ప్రతి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఉద్యోగి డిజిటల్ గుర్తింపులో భాగమవుతోంది. చాలా మంది యువ ఉద్యోగులకు నిరసనల్లో పాల్గొనడం ప్రజాస్వామ్యంలో తమ బాధ్యతగా కనిపిస్తుండగా.. కొందరు యాజమాన్యాలు మాత్రం అలాంటి పోస్టులను చూసి ఉద్యోగి సంస్థకు భవిష్యత్తులో సమస్యలు తెస్తాడా? అనే కోణంలో పరిశీలిస్తున్నాయి. దీంతో సోషల్‌ ‌మీడియాపై మరింత నిఘాను పెంచుతున్నాయి.

​కార్పొరేట్‌ ‌ప్రపంచంలో కొత్త సవాల్‌
ఈ చర్చ కేవలం ఒక నిరసన ఉద్యమానికి మాత్రమే పరిమితం కాదు. కార్యాలయంలో ఉద్యోగి అయినంత మాత్రాన పౌరుడిగా స్పందించకూడదని చెప్పలేమనీ, అలాగే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినంత మాత్రాన ఉద్యోగిగా బాధ్యతల నుంచి తప్పించలేమని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే యువత తమ వ్యక్తిగత అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా వ్యక్తం చేస్తున్న ఈ కాలంలో సంస్థలు అలాంటి ఉద్యోగులను సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులుగా చూస్తాయా? లేక సంస్థకు ప్రమాదంగా భావిస్తాయా? అనే ప్రశ్న కార్పొరేట్ ప్రపంచం ముందున్న కొత్త సవాలుగా మారిందని నిపుణులు అభిప్రా యపడుతున్నారు.

​నైపుణ్యాలే ముఖ్యం… కానీ…
ఇన్‌క్రూటర్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అనిల్ అగర్వాల్‌ ప్రకారం… నియామకాల సమయంలో అభ్యర్థి వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలు, సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడం వంటి విషయాల కంటే సంస్థలు ప్రధానంగా నైపుణ్యాలు, అనుభవం, పనితీరును పరిగణనలోకి తీసుకుంటాయని చెప్పారు. అయితే అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడం ఇప్పుడు సాధారణ ప్రక్రియగా మారిందని ఆయన అంగీకరించారు. ఉద్యమాల్లో పాల్గొన్నాడనే కారణంతో కాకపోయినా, ఆయన స్వభావం, వ్యవహారశైలి గురించి నియామక బృందం ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

కంపెనీల్లో ప్రత్యేక ‘ప్రొటెస్ట్ పాలసీ’ ఉందా?
హెచ్‌ఆర్ నిపుణుల ప్రకారం… చాలా సంస్థల్లో నిరసనల్లో పాల్గొనడాన్ని నేరుగా నిషేధించే ప్రత్యేక విధానం ఉండదు. అయితే ఉద్యోగ నియమావళి (కోడ్‌ ఆఫ్‌ ‌కండక్ట్‌), సోషల్ మీడియా పాలసీ, నైతిక మార్గదర్శకాల ఆధారంగా ఉద్యోగుల ప్రవర్త నను పరిశీలిస్తుంటారు. ఉద్యోగులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని, అయితే వాటిని కంపెనీ అధికారిక అభిప్రాయాలుగా చూప కూడదని, సంస్థ లోగో, బ్రాండ్‌ను దుర్వినియోగం చేయకూడదని ఆ నిబంధనలు స్పష్టం చేస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -