జేసీబీలతో పురాతన
గుడుల పెకిలింపు
చెట్ల నరికివేత…
జంతువుల వేట
అధికార పార్టీ అండతోనేనా..?
ఫారెస్ట్ అధికారుల
తీరుపై ఆరోపణలు
నవతెలంగాణ – బల్మూరు
‘కాకతీయుల కాలంనాటి కళా వైభవం…శిల్పకళా నైపుణ్యపు కట్టడాలు.. గుడులు, కోటలు అందులోని అద్బుత శిల్పాలకు సంబంధించిన చారిత్రిక కృషిని చూసి ‘వావ్.. సూపర్..! అంటూ ఆశ్చర్యపోతాం. అటవీ సంపద, చారిత్రిక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరముంది. చారిత్రిక వైభవం, శిల్పకళలు, జంతు, వృక్ష సంపద భావితరాలకు అందించాలి. కానీ..! అటవీ శాఖ వైఫల్యంతో నల్లమల ఫారెస్ట్‌లో కొందరు చారిత్రిక సంపదను కొల్లగొడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా మాఫియా సహజ సందపను దోచుకుంటోంది. ఎక్కడో ఒకచోట గుడులు తవ్వడం, విగ్రహాలు కూల్చడం, జంతువుల్ని వేటాడడం, వృక్ష సపందను నరికేయడం వంటి ఘటనలు యదేచ్ఛగా సాగుతున్నాయి. ఎంతో కఠినమైన అటవీ చట్టాలను అధికారులు, అధికార పార్టీ నేతలు చేతులు కలిపి దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. నల్లమల అడవుల్లో ఇటీవల పలు గుళ్లను తవ్వడం, జంతువుల్ని వేటాడిన ఘటనలు వెలుగుచూశాయి. నల్లమలలో గుట్టుగా సాగుతున్న మాఫియా తంతుపై నవతెలంగాణ ప్రత్యేక కథనం.
బల్మూర్ మండల పరిధిలోని బిల్లకల్ గ్రామ సమీపాన రసూల్ చెరువు నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో కాకతీయుల కాలంనాటి పురాతన పాపమ్మ గుడులు అద్భుతమైన కట్టడాలతో ఉన్నాయి. ఎంతో కాలంగా చుట్టుపక్కల ఉన్న చెంచులు అక్కడికి వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఆ గుడులు కాస్త మాఫియా కంట పడ్డాయి. 2026 ప్రారంభంలోనే ఆ గుడులను జేసీబీతో పెకలించి విగ్రహాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఇటీవల కూడా మరోసారి దుండగులు గుడులను తవ్వేందుకు ప్రయత్నించినట్టు విశ్వసనీయ సమాచారం ఉందని ఎన్జీవోస్ చెబుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా కొందరు దుండగులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారనే చర్చ ఉంది. అయినప్పటికీ సంబంధిత ఫారెస్టు అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వలన యదేచ్ఛగా అడవి జంతువులను సైతం వేటాడి మాంసాన్ని విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల దుప్పి మాంసం విక్రయిస్తూ పట్టుపడిన కేసులో 17 మంది అరెస్ట్ అయిన సంఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. అడవి జంతువుల వేటతోపాటు విలువైన వృక్ష జాతులను సైతం నరికి మాఫియా వ్యాపారం చేస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
అచ్చంపేట నియోజకవర్గంలో విస్తారంగా ఉన్న నల్లమల అడవుల్లో విలువైన గుడుల శిల్పకళలు, అరుదైన జంతు జీవరాసులు, ఖరీదైన కలప సంపద ఉన్నది. అధికార పార్టీ నాయకులు కొందరు తమ ఇష్టారాజ్యంగా పెత్తనం చెలాయిస్తూ గుడులు, జంతువులు, వక్షాలను కొల్లగొడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా అధికార పార్టీ వాళ్లపై ఇలాంటి విమర్శలు అనేకం వచ్చాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులపై కూడా అవే ఆరోపణలు పునారావృతం అవుతున్నాయి.
అటవీ శాఖ నిర్లక్షం..
గుడుల తవ్వకాలు, అడవి జంతువుల వేట, వృక్ష సంపద తరలింపు వంటి ఘటనలు వెలుగుచూస్తున్నా అటవీ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. మాఫియాతో అధికారులు కుమ్మక్కైనట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల కనుసన్నల్లోనే దట్టమైన అడవిలోకి జేసీబీలు, కార్లు ఇతర వాహనాలు వెళ్లి వస్తున్నాయని చెబుతున్నారు. అటవీ శాఖలోని ఓ ఇద్దరు అధికారులు ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకృతిలోని శిల్పకళ సంపద, వన్య ప్రాణులు, వృక్ష సంపదను పరిరక్షించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
మా దృష్టికి వస్తే కఠిన చర్యలు రేవంత్ చంద్ర, ఫారెస్ట్ అధికారి
నల్లమల ఫారెస్ట్‌లో గుడుల తవ్వకం, చెట్ల నరికివేత వంటి ఘటనలు జరిగినట్టు మాకు ఏలాంటి సమాచారంలేదు. అలాంటి పనులు జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాం.



