Saturday, August 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం

పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం

- Advertisement -

లాజిస్టిక్స్‌ రంగాన్ని విస్తరించాలి
ప్రత్యేక మాస్టర్‌ ‌ప్లాన్స్‌ ‌సిద్ధం చేసుకోవాలి
పీఎం గతిశక్తి–లీడ్స్‌ 2025 దక్షిణాది రాష్ట్రాల అవగాహనా సదస్సులో పరిశ్రమల శాఖ డైరెక్టర్‌, ఎగుమతుల కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి

నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో
దక్షిణాది రాష్ర్టాల్లో పారిశ్రామికాభివృద్ధిలో లాజిస్టిక్స్‌ ‌విస్తరణను మరింత వేగంగా చేపట్టాలని తెలంగాణ రాష్ర్ట పరిశ్రమల శాఖ డైరెక్టర్‌, ఎగుమతుల కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి అన్నారు. దానికోసం అన్ని రాష్ర్టాలు ప్రత్యేక మాస్టర్‌‌ప్లాన్స్‌ ‌రూపొందించుకోవాలని సూచించారు. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ), భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ వాణిజ్య, ఎగుమతుల ప్రోత్సాహక శాఖ (సీఈపీ) సంయుక్తాధ్వర్యంలో పీఎం గతిశక్తి–లీడ్స్‌ 2025 అవగాహన సదస్సు హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో శుక్రవారం జరిగింది. దీనిలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి, అండమాన్‌–నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లకు చెందిన ఉన్నతాధికారులు, పరిశ్రమల సంఘాలు, వాణిజ్య సంఘాలు, లాజిస్టిక్స్‌ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సును తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యమిచ్చింది. సదస్సును నిఖిల్‌ ‌చక్రవర్తి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. ప్రాంతీయంగా లాజిస్టిక్స్‌ సామర్థ్యాన్ని పెంపొందించడం, సమగ్ర మౌలిక వసతుల ప్రణాళికలను ప్రోత్సహించడం, వస్తువుల రవాణాను మరింత సులభతరం చేయడం, సరఫరా గొలుసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఆచరణయోగ్యమైన నిర్ణయాలు జరగాలని ఆయన చెప్పారు.

ఈ లక్ష్యాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం స్టేట్‌ లాజిస్టిక్స్‌ పాలసీ–2.0, స్టేట్‌ ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్‌ నగరాలకు ప్రత్యేక సిటీ లాజిస్టిక్స్‌ ప్లాన్స్‌ను సిద్ధం చేస్తున్నదనీ, మనోహరాబాద్‌లో మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌ (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. విమాన కార్గో మౌలిక వసతులను బలోపేతం చేయడంతోపాటు ఎయిర్‌ లాజిస్టిక్స్‌ రంగంలో నైపుణ్యాభివృద్ధికి కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇలాంటి ప్రణాళికాబద్ధ చర్యలతో తెలంగాణ బహుళ రవాణా ఆధారిత లాజిస్టిక్స్‌ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. అలాగే లాజిస్టిక్స్‌ ఈజ్‌ అక్రాస్‌ డిఫరెంట్‌ స్టేట్స్‌ (లీడ్స్‌) మదింపులో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పాల్గొంటున్నదని తెలిపారు. భౌగోళికంగా సముద్రతీరం లేని రాష్ట్రాల కేటగిరీలో హై పెర్ఫార్మర్‌గా తెలంగాణ గుర్తింపు పొందిందనీ, విధానపరమైన చర్యలు, మౌలిక వసతులపై పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కారాలు, బహుళ రవాణా వ్యవస్థల అనుసంధానం, సామర్థ్య పెంపు, సంస్థాగత సంస్కరణల ద్వారా లాజిస్టిక్స్‌ పనితీరును మరింత మెరుగుపరచడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన బిసాగ్‌–ఎన్‌ డైరెక్టర్‌ జనరల్‌ వినయ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ పీఎం గతి శక్తి ద్వారా వివిధ రాష్ట్రాల మధ్య అనుభవాలు, ఉత్తమ విధానాలను పంచుకోవడంతోపాటు పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని చెప్పారు. సమగ్ర మౌలిక వసతుల అభివృద్ధి, లాజిస్టిక్స్‌ సామర్థ్యం పెంపొందించేందుకు పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌ అమలును వేగవంతం చేయడంపై దక్షిణాది రాష్ర్టాలు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. డీపీఐఐటీ డైరెక్టర్లు రాకేశ్‌ కుమార్‌ మీనా, సాగర్‌ కడు, డీపీఐఐటీ డిప్యూటీ సెక్రటరీ ప్రవీణ్‌ కుమార్‌ సాహుకారి మాట్లాడుతూ పీఎం గతిశక్తి–లీడ్స్‌ 2025 అవగాహన సదస్సు దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు, సమిష్టి వ్యూహాలను రూపొందించడానికి సదస్సు ఉపయోగపడిందని అభ్రిపాయపడ్డారు. దేశంలో సమగ్ర మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ప్రగతికి ఇది దోహదపడుతుందని చెప్పారు.

తెలంగాణ వాణిజ్య, ఎగుమతుల ప్రోత్సాహక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సుధిన్‌ పాల్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విజన్‌ 2047 లక్ష్యాలకు అనుగుణంగానే ఈ సదస్సుకు ఆతిధ్యమిచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని తయారీ–సేవల రంగాల్లో ప్రముఖ కేంద్రంగా, ప్రపంచస్థాయి పోటీతత్వం కలిగిన లాజిస్టిక్స్‌ గేట్‌వేగా, దానిద్వారా ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. తెలంగాణ సీఈపీ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సందీప్‌ కుమార్‌, లాజిస్టిక్స్‌, సరఫరా గొలుసు విభాగం డైరెక్టర్‌ అండ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఔజాద్‌ షేక్‌‌లు మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధికి లాజిస్టిక్స్‌ కీలకమనీ, రవాణా వ్యయాలను తగ్గించడం, బహుళ రవాణా మార్గాల అనుసంధానాన్ని మెరుగుపరచడం, పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రంలోనూ, ప్రాంతీయంగానూ వస్తువుల రవాణా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించామని తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వివిధ పెషన్స్‌‌లో దక్షిణాది రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులు పలు అంశాలపై చర్చలు జరిపారు. పరస్పరం ప్రశ్నలు-సమాధానాలతో వ్యాపార, వాణిజ్య నైపుణ్యాలను మార్పిడి చేసుకున్నారు. సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు, లాజిస్టిక్స్‌ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -