59.10 అడుగులకు పెరిగి.. రాత్రి 8 గంటలకు 54అడుగులకు తగ్గిన గోదావరి
కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
ప్రధాన రహదారులపైకి వరద నిలిచిన రాకపోకలు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రి చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా గోదావరి వేగంగా ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయిలో పెరిగింది. కేవలం ఒక్కరోజు అందులోనూ 12 గంటల్లోనే మూడు ప్రమాద హెచ్చరికలు జారీ చేసే స్థాయిలో నీటి ప్రవాహం గంటగంటకూ పెరిగింది. శనివారం ఉదయం 10 గంటలకు 56 అడుగులకు చేరిన గోదావరమ్మ 11 గంటలకు 56.10 అడుగులకు చేరింది. 2 గంటలకు అదే స్థాయిలో కొనసాగిన వరద 3 గంటల తరువాత శాంతించడం ప్రారంభించింది. 3 గంటలకు 59.10 అడుగుల వద్ద ఉన్న వరద రాత్రి 8 గంటలకు 54.50 అడుగులకు చేరింది. 15,02,258 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అప్పటికే భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ స్లూయిజులు లీకేజీతో పంట పొలాలలోకి నీరు భారీగా వచ్చి చేరాయి. మరోపక్క రామాలయం వద్ద స్లూయిజీలు మోటర్లు పనిచేయకపోవడంతో అన్నదాన సత్రాన్ని నీళ్లు చుట్టుముట్టాయి. రామాలయ ప్రాంతం వద్ద ఏర్పాటు చేయాల్సిన బాహుబలి మోటార్ల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా అన్నదాన సత్రం వద్దకు భారీగా నీరు వచ్చిందని స్థానికులు ఆరోపించారు.
భద్రాచలం- చర్ల ప్రధాన రహదారి ఏటపాక, తూరుబాక, బుర్ర వేముల, పర్ణశాలతో పాటు సున్నం బట్టి, బైరాగులపాడు గ్రామాల మధ్య రహదారిపైకి భారీగా వరద నీరు చేరి రహదారులు మూసుకుపోయాయి. దీంతో భద్రాచలం నుంచి చర్లకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేయగా వాహన రాకపోకలు సైతం పూర్తిగా నిలిచిపోయాయి. గంగోల్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. బైరాగులపాడులోని పలు ఇండ్లలోకి వరద నీరు చేరుకుంది. సీతారాంపురంలో గల ఏకలవ్య పాఠశాలలోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో పలుచోట్ల వరి నారుమల్లు, పత్తి చేలు ముంపునకు గురయ్యాయి. ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా అధికారులు రహదారికి అడ్డంగా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఇంకా భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
శాంతిస్తున్న గోదావరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



