అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తోన్న రాష్ట్రం..సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవానికి హైడ్రా అహర్నిశలు శ్రమించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హైడ్రా అధికారులకు, సిబ్బందికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈమేరకు శనివారం ట్వీట్ చేశారు. చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మారుతున్న హైదరాబాద్‌ను చూడటం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. క్యూర్ పరిధిని క్యూర్ చేసుకుంటూ… మన చెరువులకు జీవం పోస్తూ… జీవంతో నిండిన భవిష్యత్తును భావి తరాలకు హైడ్రా అంకితం చేస్తోందని తెలిపారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదనీ, భావి తరాల భవిష్యత్తును భద్రపరచడం కూడా అని పేర్కొన్నారు. ప్రతి చెరువును కాపాడుతూ… ప్రజల ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతామని ఆయన భరోసా ఇచ్చారు. కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న తెలంగాణరాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కొత్త శిఖరాలను అధిరోహిస్తూ సరికొత్త విజయాలను సాధిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ పని తీరును ప్రదర్శిస్తోందని ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో తలసరి ఆదాయం రూ. 4,18,931గా నమోదయ్యిందనీ, ఇది గతేడాది రూ. 3,80,031గా ఉందని గుర్తు చేశారు. ఒకే సంవత్సరంలో తాము 10.23 శాతం వృద్ధిని సాధించామనీ, ఇది రూ. 38,900 పెరుగుదల అని తెలిపారు. కఠోర శ్రమ, ఆర్థిక వృద్ధిపై దృష్టి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, అన్ని రంగాలలో సమతుల్య అభివృద్ధి, తాత్కాలిక విధానాల నుంచి విధాన ఆధారిత పాలనకు మారడం, శ్రద్ధతో కూడిన పని, నిరంతర సమీక్షలు, వివరాలపై శ్రద్ధ, భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు చేయడం ద్వారా ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం… గత దశాబ్దకాలపు వైఫల్య పాలనను, నిరాశావాద వాతావరణాన్ని తిప్పికొట్టి, ప్రతి పౌరునిలో ఆశావాదాన్ని, నమ్మకాన్ని నింపిందని వివరించారు. తమ విజయానికి మహిళలు, రైతులు, యువత అతిపెద్ద లబ్దిదారులని తెలిపారు. రాబోయే కాలంలో రాష్ట్రం మరింత గొప్ప విజయాలను సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నల్ల చెరువు పునరుజ్జీవంలో హైడ్రా అహర్నిశలు కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



