Tuesday, June 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిప్పుకణిక ‘సోషల్ పర్స్పెక్టివ్స్‌’ పుస్తకం

నిప్పుకణిక ‘సోషల్ పర్స్పెక్టివ్స్‌’ పుస్తకం

- Advertisement -

 సామాజిక అంశాలపై లోతైన విశ్లేషణలు
నీలం సంపత్‌ కుమార్‌ రచనలపై వక్తల ప్రశంసలు

న‌వతెలంగాణ‌ – హైదరాబాద్‌
సామాజిక కార్యకర్త, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ డాక్టర్ నీలం సంపత్ కుమార్‌ రాసిన ‘సోషల్ పర్స్పెక్టివ్స్‌’ పుస్తకం ఓ నిప్పు కణిక అని వక్తలు కొనియాడారు. ప్రజాస్వామ్యం, విద్యా, వైద్యం, గ్రామీణాంశాలు, మీడియా రంగం, రోడ్డు భద్రత తదితర అన్ని రకాల సామాజిక అంశాలపై లోతైన విశ్లేషణలు చేశారని ప్రశంసించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ తెలుగు పరిశోధక మండలి ఆధ్వర్యంలో ‌అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంపత్‌‌కుమార్‌ ‌రచించిన ‘సోషల్ పర్స్పెక్టివ్స్‌’ పుస్తకాన్ని శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం లాంచనంగా ఆవిష్కరించారు. తెలంగాణ మీడియా అకాడమీ తొలి చైర్మన్ అల్లం నారాయణ, మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి, ఆల్‌ ఇండియా కిసాన్‌ ‌సభా ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, ఇతర ప్రముఖులు అర్విని రాజేంద్ర బాబు, ఏ. పుల్లయ్య, ఏవీవి ప్రసాద్, కే. విద్యాసాగర్, పొదిలి కృష్ణమూర్తి, కృపాకర్ తదితరులు పాల్గొని సంపత్‌ ‌రచనలను కొనియాడారు. ఈ సభకు రచయిత, లెక్చరర్ నర్రా ప్రవీణ్ రెడ్డి అధ్యక్షత వహించగా, కోట సతీష్ కుమార్ ఆహ్వానం పలికారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. సంపత్ హుజురాబాద్‌ కనుకుల గిద్ద అనే గ్రామంలోని తీవ్ర ఘర్షణల వాతావరణం నుండి, కుటుంబంలో ఎవరూ చదువుకోని నేపథ్యం నుండి వచ్చారని గుర్తుచేశారు. ఆ కుటుంబంలో మొదటి తరం చదువుకున్న వ్యక్తిగా ఎదిగి, సమాజం ఆలోచించేలా ఇంత అద్భుతమైన పుస్తకాన్ని రాయడం చాలా గొప్ప విషయమని, ఆయన వ్యాసాలే ఆయనలోని నిజమైన ఫ్రీలాన్స్ జర్నలిస్టును ప్రతిబింబిస్తున్నాయని కొనియాడారు.

అల్లం నారాయణ మాట్లాడుతూ.. పుస్తకం చదివిన తర్వాతే సంపత్ పరిచయం లోతుగా అర్థమైందని అన్నారు. హుజురాబాద్, జమ్మికుంట పరిసర ప్రాంతాల సామాజిక అంశాలపై సంపత్ లోతైన విశ్లేషణ చేశారని, మీడియా రంగంపై కూడా సునిశిత పరిశీలనతో వ్యాసాలు రాశారని అభినందించారు. నేడు అనేక పత్రికలు బాదితుల పక్కన కాకుండా అధికారంలో ఉన్న వారికి వంత పాడుతున్నాయన్నారు. ఇందుకు బండి భగీరథ కేసే నిదర్శనమన్నారు. తెలంగాణలో జరిగిన బండి భగీరథ కేసు విషయంలో అదే సోషల్ మీడియా ప్రజల ముందు వాస్తవాలను ఉంచిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మతం, కులం, గోవులు తదితర వాటిపై ఫేక్‌ ‌న్యూస్‌‌తో అధికారంలోకి వస్తున్న పార్టీలను ఆయన ఎండగట్టారు. ప్రజలు నిత్య చైతన్యంతో ఉండకపోతే దేశానికే ప్రమాదమన్నారు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని సంపత్ ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం డెమోక్రసీ (ప్రజాస్వామ్యం) కేవలం డేంజర్‌లో పడడమే కాదు.. అది మరింత దిగజారి మంచమెక్కిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అనేక సామాజిక దృక్పథాలు, ప్రశ్నలను సంపత్ తన పుస్తకంలో సంధించారని, సొసైటీకి తిరిగి ఏదో ఒకటి అందించాలనే ఆయన కుతూహలాన్ని అందరూ ఆదరించాలని కోరారు. ఈ సభలో రచయిత డాక్టర్ నీలం సంపత్ ముగింపు ఉపన్యాసం చేశారు. తాను రాసిన 550కి పైగా వ్యాసాల నుండి ఎంపిక చేసిన 42 ప్రత్యేక వ్యాసాలతో ఈ పుస్తకాన్ని తెచ్చానని తెలిపారు. దీని వెనుక తన తల్లిదండ్రులు, గురువులు, తనను తీర్చిదిద్దిన ఎందరో రాజనీతిజ్ఞుల కృషి ఉందన్నారు. ఈ పుస్తకాన్ని తనను ఎంతో చైతన్యవంతం చేసిన కాగజ్‌నగర్‌లోని ఎస్.కే.ఈ డిగ్రీ కళాశాలకు ఈ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంపత్ గారి అభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -