ఖెష్మ్ దీవిపై అమెరికా దాడి
కువైట్, బహ్రెయిన్ పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
నవతెలంగాణ – జనరల్ డెస్క్
దాడులు, ప్రతి దాడులతో మధ్యప్రాచ్యం మరోసారి అట్టుడికిపోతోంది. ఓ వైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుండగానే హార్ముజ్ జలసంధిలోని ఖెష్మ్ దీవిపై ‘ఆత్మరక్షణ’ దాడులు జరిపానని అమెరికా సైన్యం బుధవారం ఉదయం తెలిపింది. ఇరాన్ వైపు నుంచి దూసుకొచ్చిన పలు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా తిప్పికొట్టామని సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రాంతీయ పొరుగు దేశాలపై ఇరాన్ అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, అయితే అవి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యాయని చెప్పింది. ‘కువైట్‌పై ఇరాన్ రెండు క్షిపణులను ప్రయోగించింది. అవి లక్ష్యాన్ని చేరుకోలేక కింద పడిపోవడమో లేదా దారిలోనే విచ్ఛిన్నం కావడమో జరిగింది. బహ్రెయిన్ పై కూడా మూడు క్షిపణులను ప్రయోగించారు. వాటిని అమెరికా, బహ్రెయిన్ గగనతల రక్షణ దళాలు వెంటనే నిలువరించాయి’ అని వివరించింది. ‘అమెరికా దళాలపై ఇరాన్ జరిపిన దాడులన్నీ విఫలమయ్యాయి. అమెరికా సేనలు అప్రమత్తంగా ఉన్నాయి. అవాంఛనీయ ఇరాన్ దూకుడును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి’ అని తెలిపింది. ఇరాన్ దాడులలో తమ సిబ్బందికి కానీ, ఆస్తులకు కానీ ఎలాంటి నష్టం జరగలేదని చెప్పింది. కాగా దాడుల నేపథ్యంలో కువైట్, బహ్రెయిన్ లలో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు.
అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతి దాడులు
హార్ముజ్ జలసంధి సమీపంలో ఓ ఇరాన్ చమురు ట్యాంకర్‌పై అమెరికా దాడి చేసిందని, దానికి ప్రతిగా నౌకాదళ క్షిపణులతో ప్రయాణిస్తున్న అమెరికా-ఇజ్రాయిల్ ఓడపై దాడి చేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) అంతకుముందు తెలియజేసింది. ఖెష్మ్ దీవికి దక్షిణంగా ఉన్న ఐఆర్‌జీసీ కమ్యూనికేషన్ టవర్‌పై కూడా అమెరికా సేనలు దాడి చేశాయని తెలిసింది. దీంతో బహ్రెయిన్ లోని అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులు, డ్రోన్లతో ఐఆర్‌జీసీ దాడి జరిపింది. దాడికి గురైన వాటిలో అమెరికా ఫిప్త్ ఫ్లీట్ కేంద్ర కార్యాలయం, హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. అయితే బహ్రెయిన్ లో ఎలాంటి దాడులు జరగలేదని అమెరికా సైన్యం చెబుతోంది. లక్ష్యాలను చేరుకోవడంలో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు విఫలమయ్యాయని తెలిపింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించినందుకు బోట్స్‌వానా పతాకంతో ప్రయాణిస్తున్న ట్యాంక్ ఇంజిన్ గదిపై అమెరికా సైనిక హెలికాప్టర్ దాడి చేసిందని సెంట్‌కామ్ చెప్పింది. ఇదిలావుండగా తమ ట్యాంకర్, ఖెష్మ్ దీవిపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దాడులకు బహ్రెయిన్, కువైట్ పాలకులే నేరుగా బాధ్యత వహించాలని నొక్కి చెప్పింది.
హార్ముజ్‌లో 94వ రోజూ అదే పరిస్థితి
హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో గత 94 రోజులుగా వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో ఈ వారం అంతర్జాతీయ వార్షిక షిప్పింగ్ ఎగ్జిబిషన్ జరగబోతోంది. దీనికి ప్రపంచంలో అత్యంత శక్తివంతులైన షిప్పింగ్ ఎగ్జిక్యూటివ్‌లు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చే ప్రధాన విషయం హార్ముజ్ జలసంధే. హార్ముజ్‌ను తెరవడం అనివార్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చెప్పారు. జలసంధి మీదుగా నౌకల రాకపోకలు జరుగుతున్నాయని అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ అనేక మంది షిప్పింగ్ ఎగ్జిక్యూటివ్‌లు తమ కార్గో నౌకలను హార్ముజ్ మీదుగా నడిపేందుకు ఇష్టపడడం లేదు. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరి, జలసంధిని తిరిగి తెరిచినప్పుడే నౌకాయానం సజావుగా సాగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
హార్ముజ్ మూసివేతతో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వివిధ దేశాలకు చమురు సరఫరాలలో 20 శాతం కోత పడుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు అవసరమైన లిక్విడ్ నేచురల్ గ్యాస్, ఎరువుల రవాణాకు కూడా ఆటంకం కలుగుతోంది. గత వారం చమురు ధరలు కొంతమేర దిగివచ్చినప్పటికీ మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా పరిస్థితుల కారణంగా తిరిగి భగ్గుమంటున్నాయి. కెప్లర్ పరిశోధనా సంస్థ అందించిన సమాచారం ప్రకారం గత శుక్రవారం కేవలం ఏడు నౌకలు మాత్రమే హార్ముజ్‌లో రాకపోకలు సాగించాయి. వీటిలో ఐదు నౌకలు లోపలికి రాగా రెండు బయటికి వెళ్లిపోయాయి. వారాంతంలో కేవలం మరో నాలుగు నౌకలు మాత్రమే హార్ముజ్‌ను దాటాయి. యుద్ధానికి ముందు ఈ జలసంధి మీదుగా రోజుకు సగటున వంద కార్గో నౌకలు రాకపోకలు సాగించేవి. ప్రస్తుతం ప్రతి రోజూ కొన్ని నౌకలు హార్ముజ్‌ను దాటుతున్నప్పటికీ మొత్తంగా చూస్తే జలసంధి మూతపడే ఉంది.
హార్ముజ్‌ను దాటే వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తామని గొప్పలు చెప్పిన అమెరికా ఇప్పుడు మౌనం వహిస్తోంది. సాధారణ ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి సమయం పడుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. హార్ముజ్‌ను దాటే నౌకలకు ఇప్పటికీ ముప్పు బాగానే ఉన్నదని, సురక్షిత ప్రయాణానికి గ్యారంటీ ఇచ్చే వరకూ జలసంధి మీదుగా పూర్తి స్థాయిలో నౌకల రాకపోకలు జరగవని తేల్చి చెప్పాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో 39 నౌకలపై దాడులు జరిగాయని, 11 మంది ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మారీటైమ్ ఆర్గనైజేషన్ తెలియజేసింది. గల్ఫ్ దేశాలకు ఆహారం, ఇతర వస్తువులను సరఫరా చేసే కంటైనర్ నౌకలు జలసంధిలోనే చిక్కుబడి ఉన్నాయి. ప్రపంచంలోని అతి పెద్ద కంటైనర్ షిప్పింగ్ సంస్థలలో ఒకటైన మెర్స్క్ మే మధ్య నుంచి ఇప్పటి వరకూ ఒక్క నౌకను కూడా హార్ముజ్‌కు పంపలేదు. ఈ సంస్థకు చెందిన ఆరు నౌకలు ప్రస్తుతం హార్ముజ్‌లోనే ఉండిపోయాయి.
మధ్యవర్తులతో చర్చలు నిలిపేసిన ఇరాన్
కాల్పుల విరమణ పొడిగింపుపై మధ్యవర్తులతో జరుపుతున్న చర్చలను ఇరాన్ నిలిపివేసిందని ప్రభుత్వ అనుకూల వార్తా సంస్థలు ఫార్స్, తస్నిమ్ తెలియజేశాయి. అయితే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. చర్చలు కొనసాగాలంటే లెబనాన్‌లో కూడా కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్ చేస్తున్న ఇరాన్ వైపు నుంచి మంగళవారం సమాచారమేదీ రాలేదని మధ్యవర్తిత్వంలో భాగస్వామి అయిన ప్రాంతీయ ప్రతినిధి ఒకరు చెప్పారు. చర్చలు నిలిచిపోయాయన్న వార్తలను ట్రంప్ తోసిపుచ్చుతూ ‘మా మధ్య సంభాషణ కొనసాగుతూనే ఉంది. చర్చలు ఎక్కడికి దారితీస్తాయో ఎవరికీ తెలియదు. అయితే నేను ఇరాన్‌కు ఓ విషయం చెప్పాను. ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించాను’ అని అన్నారు.
లెబనాన్‌పై ఆగని దాడులు
హిజ్బుల్లా-ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరు పక్షాలు ఖాతరు చేయడం లేదు. ఇజ్రాయిల్ దళాలు దక్షిణ లెబనాన్‌లోని లితానీ నదిని దాటి ముందుకు చొచ్చుకుపోతున్నాయి. మరోవైపు ఇజ్రాయిల్ దళాలపై 13 దాడులు జరిపామని హిజ్బుల్లా తెలిపింది. లెబనాన్ నుంచి తమ ఉత్తర ప్రాంతం వైపు వచ్చిన శత్రు యుద్ధ విమానాన్ని అడ్డుకున్నామని ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది. అయితే ఆ విమానానికి, హిజ్బుల్లాకు సంబంధం ఉన్నదీ లేనిదీ తెలియలేదు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ సేనలు మంగళవారం జరిపిన పలు దాడులలో కనీసం పది మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఇదిలావుండగా ఇజ్రాయిల్, లెబనాన్ అధికారులు వాషింగ్టన్ డీసీలో నాలుగో విడత చర్చలు జరిపారు.
హార్ముజ్‌ను తెరిచినా ఆంక్షలను సడలించం : రుబియో
హార్ముజ్ జలసంధిని తెరిచినప్పటికీ ఇరాన్‌పై విధించిన ఆంక్షలను సడలించే ప్రసక్తే లేదని అమెరికా స్పష్టం చేసింది. ఆంక్షల సడలింపుకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. యురేనియంను శుద్ధి చేయబోమని, అణు కార్యకలాపాలు నిర్వహించబోమని ఇరాన్ హామీ ఇస్తేనే, దానికి కట్టుబడి ఉంటేనే ఆంక్షల సడలింపు జరుగుతుందని తెలిపారు.
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి : పలువురికి గాయాలు
ఇరాన్ ప్రయోగించిన క్షిపణి, డ్రోన్ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దాడి నేపథ్యంలో అనేక విమానాల రాకపోకలను నిలిపివేశారు. కొన్నింటిని ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు దారి మళ్లించారు. ఇరాన్ దాడిలో విమానాశ్రయంలోని టీ-1 భవనం దెబ్బతింది.
ఇరాన్ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌పై అమెరికా ఆంక్షలు
ఇరాన్‌లోని అతి పెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ నోబిటెక్స్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ ప్రభుత్వానికి, నిషేధిత ప్రభుత్వ సంస్థలకు ఈ ఎక్స్ఛేంజ్ సాయపడుతోందన్న ఆరోపణపై అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ కేంద్ర బ్యాంక్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)ల కోసం వందల మిలియన్ డాలర్ల లావాదేవీలు నిర్వహించడానికి ఉపయోగపడుతున్న సమాంతర ఆర్థిక వ్యవస్థలో నోబిటెక్స్ కేంద్ర బిందువుగా మారిందంటూ రాయిటర్స్ వార్తా సంస్థ ఈ నెల 1వ తేదీన ఓ వార్తను అందించింది. దీనిపై స్పందించిన అమెరికా ప్రభుత్వం నోబిటెక్స్‌పై తాజా ఆంక్షలు విధించింది. ప్రభుత్వం అంతర్గతంగా దానిపై నిషేధం విధించినప్పటికీ నోబిటెక్స్ తన కార్యకలాపాలను కొనసాగించిందని, అనేక మిలియన్ డాలర్ల మేర లావాదేవీలు జరిపిందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. రాయిటర్స్ వార్తా సంస్థ జరిపిన పరిశోధన ప్రకారం…ఇరాన్‌లోని అత్యంత శక్తివంతమైన కుటుంబాలలో ఒకటైన ఖర్రాజీ కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు నోబిటెక్స్‌ను నిర్వహించారు. వీరికి నూతన సుప్రీం నేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాగా సోదరులైన సయీద్ మహమ్మద్ అలీ అగ్హమిర్ మహమ్మద్ అలీ, సయీద్ మహమ్మద్ అగ్హమిర్ మహమ్మద్ అలీలపై వ్యక్తిగత ఆంక్షలు విధించామని అమెరికా వాణిజ్య శాఖ తెలిపింది.



