రేపటి నుంచి అమల్లోకి
క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా మార్కెట్ విలువల సవరణ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టామని అన్నారు. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త విలువలను నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలనీ, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు భూముల ధరలను సవరించామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక ప్రకారం ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించి శాస్త్రీయ పద్ధతిలో కొత్త విలువలను నిర్ణయించామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సమగ్ర కసరత్తు లేకుండా, అశాస్త్రీయ పద్ధతుల్లో 2021-22లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండు సార్లు భూముల ధరలను పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలను ఆరు శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన సవరణలు క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా కేవలం శాతం గణనల ఆధారంగా, పట్టికల ప్రకారం చేపట్టడంతో కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా విలువలున్నాయని పేర్కొన్నారు. వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య భారీ అంతరం ఉండటం వల్ల భూ లావాదేవీలలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతు న్నాయని వివరించారు. ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువల పునర్విమర్శ చేపట్టామని వెల్లడించారు. గ్రామీణ, పట్టణ మార్కెట్ విలువల సవరణ కమిటీలు స్థానిక పరిస్థితులను పరిశీలించి సవరించిన విలువలను రూపొందించి ఆమోదించాయని వివరించారు. ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యం, వృద్ధి రేటు, ఇటీవల జరిగిన భూముల వేలాలు, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, కొత్త రహదారులు, వృద్ధి కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్), రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్), పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ విలువలను నిర్ణయించామని తెలిపారు.ఫ్లాట్ల విషయంలో గతంలో కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ అంతస్తుల వారీగా అధిక రేట్లు నిర్ణయించడం వల్ల అసమానతలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాల్లో అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేస్తూ మార్కెట్ విలువలను హేతుబద్ధీకరించినట్టు వివరించారు. ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు ప్రతిపాదించలేదని తెలిపారు. ప్రాంతాల అభివృద్ధి స్థాయిని బట్టి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), క్యూర్ పరిధి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక రేట్లను కూడా నిర్ణయించామని వివరించారు.



