Thursday, June 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువిద్వేషాలను తెలంగాణ సమాజం క్ష‍మించదు

విద్వేషాలను తెలంగాణ సమాజం క్ష‍మించదు

- Advertisement -

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
అవాస్తవాలతో మాపై బురదజల్లడం 
ప్రజల దృష్టి మళ్లించే యత్నమే : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కమ్యూనిజం, ప్రజా పోరాటాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధ్యాతారాహిత్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ఒక ప్రకటనలో ఖండించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ విద్వేషాలను, భాషా విభేదాలను రెచ్చగొట్టేలా, పీడిత ప్రజల వర్గ పోరాటాలను అవమానించేలా మాట్లాడటం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి తగదన్నారు. ‘తనపై వచ్చిన 10 ఎకరాల చెరువు భూమి ఆక్రమణ ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవడానికి లేదా ఇతర ప్రజా సమస్యలపై మాట్లాడటానికి పవన్ కళ్యాణ్‌‌కు పూర్తి హక్కు ఉంది. సీపీఐ(ఎం) పార్టీ తెలంగాణను వ్యతిరేకించిందంటూ అవాస్తవాలతో బురదజల్లడం కేవలం తనపై వచ్చిన ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే అవుతుంది. కమ్యూనిజం చచ్చిపోయింది అనడం పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానాన్ని, అవివేకాన్ని తెలియజేస్తోంది.

ప్రపంచంలో పెట్టుబడిదారులు, దోపిడీ వర్గాలు ఉన్నంత కాలం శ్రామిక వర్గాల తరఫున ఎర్రజెండా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కేవలం కొన్ని చోట్ల పదవులు లేదా ప్రభుత్వాలు కోల్పోయినంత మాత్రాన సిద్ధాంతం నశించిపోదు. ఈ దేశంలోని దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, కుల, మత, ప్రాంతాలకతీతంగా శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం సీపీఐ(ఎం) పోరాడుతోంది. తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలను పక్కదారి పట్టించేందుకు ప్రాంతీయ విద్వేషాలు రగల్చడం దుర్మార్గం’ అని వెస్లీ పేర్కొన్నారు. బీజేపీ, ప్రధాని మోడీ ఎజెండాకు అనుగుణంగా మతోన్మాద, విద్వేష రాజకీయాలను తెలంగాణలో చొప్పించడానికి పవన్‌ ‌కళ్యాణ్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన చేస్తున్న చర్యలను తెలంగాణ సమాజం ఎన్నటికీ ఆమోదించదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రజలు పవన్‌ ‌కళ్యాణ్‌‌కు తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -