బరితెగించిన బీజేపీ సర్కార్ ఇక మతవిశ్వాసాలూ…ఆర్థిక వనరులే!
టెంపుల్‌బాండ్స్ పేరుతో నిధుల సమీకరణకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు
ఉజ్జయినిలో దేవాలయాల అభివృద్ధి కోసమేనంటూ ప్రచారం
‘సింహస్థ కుంభమేళా’ కోసం దేవుడ్ని తాకట్టు పెడుతున్న వైనం
ఇక్కడ సక్సెస్ అయితే అన్ని రాష్ర్టాల్లోనూ దేవుడి పేరుతో వ్యాపారాలు షురూ
ఎస్ఎస్ఆర్ శాస్ర్తి
‘ప్రజల మతవిశ్వాసాలు వ్యక్తిగతం… దాన్ని రాజకీయాలతో ముడిపెట్టరాదు’ అనే రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని కూడా విస్మరించి, ఆ విశ్వాసాలనే వ్యాపార వస్తువులుగా మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా “టెంపుల్ బాండ్స్”ను ప్రతిపాదించింది. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక నిధుల సమీకరణ కోసం ఈ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ నిధులను ప్రధానంగా ఉజ్జయినీ మరియు మాల్వా ప్రాంతంలోని 11 దేవాలయాల అభివృద్ధి కోసం వినియోగిస్తారు. 2028లో ఈ రాష్ర్టంలో జరగనున్న ‘సింహస్థ కుంభమేళా’ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళిక రూపొందించారు. ఉజ్జయిని అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఉజ్జయిని డెవలప్‌మెంట్ అథారిటీ) ఈ బాండ్లను జారీ చేయాలని నిర్ణయించారు. 2028లో జరిగే ‘సింహస్థ కుంభమేళా’ నాటికి రూ.1,100 కోట్లతో దేవాలయ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. ఈ నిధుల సమీకరణ కోసం టెంపుల్ బాండ్స్ ద్వారా రూ.200 కోట్లు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా రూ.275 కోట్లు, బ్యాంకు రుణాల ద్వారా రూ.625 కోట్లు సమీకరిస్తారు.
ఎలా చెల్లిస్తారు?
బాండ్స్ కొనుగోలు చేయడం అంటే వాటిని కొన్న వ్యక్తులు, సంస్థలకు దేవుడు అప్పు ఉన్నట్టే! వారికి అసలు, వడ్డీలను దేవాలయాలకు వచ్చే హుండీ ఆదాయం, విరాళాలు, యాత్రికుల సేవల ద్వారా వచ్చే సొమ్ము నుంచి చెల్లిస్తారు.
సెంటిమెంటే పెట్టుబడి
దేవుడి పేరు చెప్తే దానం చేయని వ్యక్తులు ఉండరు. అసలు దేవుడే మనకు బాకీ ఉన్నాడనే సెంటిమెంట్ ఆ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఆధ్యాత్మిక పర్యాటకం పేరుతో దేశంలోని అన్ని దేవాలయాల్లోనూ ఈ తరహా ‘రుణ మేళా’లు ప్రారంభమవుతాయి. ఫలితంగా ఆధ్యాత్మికం, భక్తి స్థానాన్ని వ్యాపారం అక్రమిస్తుంది. మతాన్ని ఆర్థిక సాధనంగా మార్చే ప్రమాదం లేకపోలేదు. దానికి తోడు దేవాలయాల ఆదాయాన్ని రుణ చెల్లింపులకు అనుసంధానించడం వివాదాస్పదమవుతుంది. పారదర్శకత, బాధ్యతాయుత నిర్వహణపై సందేహాలు సహజమే!
పుణ్యం…పెట్టుబడి : ‘టెంపుల్ బాండ్స్’లో పెట్టుబడి పెట్టడం వల్ల భక్తులకు పుణ్యంతో పాటు వడ్డీల రూపంలో ఆదాయం కూడా వస్తుందనే ఆశ పెరుగుతుంది. ‘భక్తి’ అనే సెంటిమెంట్‌ను ఆర్థికవనరుగా ఉపయోగించుకుంటే చాలు. అసలుకు భరోసా కల్పిస్తూ బాండ్ పేపర్‌పై ష్యూరిటీ కూడా ఇస్తారు. ఇకపై ప్రతి భక్తుడు గుడికి వెళ్లి తప్పులు క్షమించమని చెంపలేసుకుని మొక్కుకుంటూ అదే దేవుడికే వడ్డీకి డబ్బులు ఇచ్చిరావచ్చు. హతవిధీ… ప్రధాని నరేంద్రమోడీ హయాంలో ఇంకా ఏమేం చూడాలో!!
దేవుడి పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు ఆ దేవుడిని కూడా వ్యాపార వస్తువుగా మార్చేసింది. ఇప్పటికే దేవాలయాల్లో దేవుడి ముందు అంతా సమానమే అనే వ్యవస్థే నాశనమైంది. వీఐపీ, స్పెషల్ దర్శనాలు, ప్రత్యేక పూజల పేరుతో దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు. ఇప్పుడు అసలు దేవుడి పేరుపైనే భక్తుల దగ్గర అప్పుచేసి, దేవుడే భక్తులకు బాకీ పడేలా బీజేపీ పాలకులు చేస్తున్నారు. దేవుడి కోసం డబ్బును భక్తుడిని అనుసంధానం చేసే విధానాలను అమల్లోకి తెస్తున్నారు. ఉలుకు పలుకు లేని ‘రాయి’నే పెట్టుబడిగా పెట్టి, కాస్తంత విశ్వాసం అనే సెంటిమెంట్‌ను రగిలిస్తే, దేవుడి పేరుతో నిధుల వరద పారుతుందని గ్రహించేశారు. దీన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా మధ్య ప్రదేశ్‌లో అమల్లోకి తెస్తున్నారు. దీనికి అక్కడి బీజేపీ ప్రభుత్వం పెట్టుకున్న ముద్దుపేరు ‘టెంపుల్ బాండ్స్’.
ఏమిటీ టెంపుల్ బాండ్స్?
సాధారణంగా ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు రోడ్లు, మెట్రో రైల్, మౌలిక సదుపాయాలతోపాటు ఇతర అభివృద్ధి పనుల కోసం రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం బాండ్స్‌ను జారీ చేస్తాయి. ప్రధానంగా ఆయా రాష్ర్టాల్లో ఆర్థిక శాఖ, విద్యుత్ సంస్థలు, నగరాభివృద్ధి సంస్థలు, నీటి సరఫరా సంస్థలు, రోడ్లు, మౌలిక సదుపాయాల సంస్థలు, ప్రత్యేక ప్రాజెక్ట్ సంస్థలు ఈ బాండ్లను జారీ చేస్తాయి. ఇప్పటి వరకు దేశంలో దేవాలయాల పేరుతో బాండ్స్‌ను పిలిచిన దాఖలాలు లేవు. మధ్యప్రదేశ్‌లో తొలిసారిగా ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాండ్స్‌ను కొనుగోలు చేసే వ్యక్తులు, సంస్థలకు
పదేండ్ల కాలపరిమితి తర్వాత పెట్టిన పెట్టుబడి సొమ్ముతో పాటు వడ్డీని కూడా చెల్లిస్తారు. అయితే వడ్డీ రేటు, కనీస పెట్టుబడి వంటి వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.



