నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయంలో వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళిక, నీటి సంరక్షణ, సేంద్రియ పోషకాల వినియోగం, పంటల వైవిధ్యీకరణకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పెంటేల రవి సూచించారు. ఇంచార్జి ఎంపీడీవో రామ కోటా రెడ్డి నోడల్ అధికారిగా నిర్వహించే వ్యవసాయ శాఖ గ్రామ సభలు మండలం లోని నారంవారిగూడెంలో గురువారం ప్రారంభించారు.
రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు నిమిత్తం జూన్ 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ పనులు చేపట్టాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ సందర్భంగా రైతులకు అందజేయాల్సిన ముఖ్య సూచనలు ఇవి:
వాతావరణ పరిస్థితులు
ఈ వానాకాలంలో వర్షపాతం సాధారణం నుంచి సాధారణానికి సమీప స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంది.
జూన్ నెలలో పంటల విత్తనాల విత్తనానికి అనుకూల పరిస్థితులు ఉండనున్నాయి.
ఎల్‌నినో ప్రభావం జూలై, ఆగస్టు నెలల్లో కనిపించే అవకాశం ఉంది.
పంటల పెరుగుదల సమయంలో బెట్ట పరిస్థితులు ఏర్పడి వర్షాధార పంటలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంది.
పంటల ఎంపిక – ప్రత్యామ్నాయ ప్రణాళిక
రుతుపవనాలు ఆలస్యమైతే రైతులు స్వల్పకాలిక వరి రకాలు, పత్తి, అపరాల పంటలను ఎంపిక చేసుకోవాలి.
వర్షాలు ఆలస్యమైన పరిస్థితుల్లో కంటింజెన్సీ ప్రణాళిక ప్రకారం అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలి.
రుతుపవనాలకు ముందు కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకుని జీలుగ, జనుము, పెసర వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేయాలి.
సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం
చెరువు మట్టి, పశువుల ఎరువు, కంపోస్ట్, వెర్మి కంపోస్ట్, జీవన ఎరువులను సమకూర్చుకోవాలి.
పంటలకు అవసరమైన పోషకాలలో కనీసం 50 శాతం వరకు సేంద్రియ రూపంలో అందించడం వల్ల నేల సారవంతత పెరగడంతో పాటు తేమ నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది.
నీటి సంరక్షణ చర్యలు
రైతులు తమ పొలాల్లో పడే వర్షపు నీటిని అదే పొలంలో నిల్వ ఉండేలా కాంటూర్ కందకాలు, నీటి కుంటలు, పర్కొలేషన్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి.
దీని ద్వారా వర్షాభావం లేదా బెట్ట పరిస్థితులు వచ్చినా పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుంది.
ఆధునిక సాంకేతిక సేవలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వాతావరణ సూచనలను 17 జిల్లాల రైతులకు వాట్సాప్ ద్వారా అందించే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ సూచనల ద్వారా రైతులు పంట యాజమాన్యంలో మెరుగైన పద్ధతులు పాటించడంతో పాటు వాతావరణ సంబంధిత ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకోవచ్చు.
సమయానుకూలంగా వ్యవసాయ నిర్వహణ చేపట్టేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయి.
పంటల వైవిధ్యీకరణ
రైతులు వరి, పత్తి, మొక్కజొన్న వంటి సాంప్రదాయ పంటలతో పాటు చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజల పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
సాగునీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగును కూడా పరిశీలించాలి.
భూసార పరీక్షల ప్రాముఖ్యత
రసాయన ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి.
నేలలో ఏ పోషకాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకోవడానికి భూసార పరీక్షలు చేయించుకోవాలి.
భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం ద్వారా ఖర్చులు తగ్గి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దాసరి కిశోర్,ఏవో పి.శ్రీనివాస్ లు పాల్గొన్నారు.



