సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్దాలు ఉంటాయి
సోషలిస్టు సమాజంతోనే ప్రపంచశాంతి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్
నవతెలంగాణ – ఖమ్మం
ప్రపంచ దేశాలపై, దేశాల మార్కెట్లపై ఆధిపత్యం సాధించడానికి సామ్రాజ్యవాద యుద్ధాలు జరుగుతాయని, సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం ప్రపంచ యుద్ధాలు ఉంటాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్ తెలిపారు. జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా సామ్రాజ్యవాద దోపిడీ అనే అంశంపై క్లాస్ బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రపంచ మార్కెట్లను కొల్లగొట్టడానికి నిత్యం దేశాల మధ్య యుద్ధాలను పెంచి పోషిస్తుందని విమర్శించారు. ఇరాన్ కి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ ను యుద్ధానికి ప్రోత్సహించి అమెరికా ఇజ్రాయిల్ ద్వారా తన ఆధిపత్యం కొనసాగిస్తుందని తెలిపారు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై ఆ దేశ ప్రజలపై ఉంటుందని తెలిపారు.
వెనిజుల అధ్యక్షుడు మధుర దంపతుల కిడ్నాప్ చైనా తైవాన్ యుద్ధంలో అమెరికా జోక్యం ఇలా దేశాల మధ్య అంతర్గత ఘర్షణలు సృష్టించి యుద్ధ వాతావరణం తీసుకొచ్చి తమ ఆయుధాలు కొనుగోలుకు అవసరమైన యుద్ధాలను సామ్రాజ్యవాద దేశాలు సృష్టిస్తాయని, ప్రస్తుతం అమెరికా యుద్దాలకు ఆయుధాలు సప్లై చేసే వ్యాపారానికి కొనసాగిస్తుందని, దాని ద్వారా లాభ పడటానికి ఎలాంటి దుర్మార్గపు చర్యలకైనా ఒడిగట్టడానికి వెనకాడడం లేదని దుయ్యబట్టారు. ఫైనాన్స్ కాపిటల్ ప్రస్తుతం ప్రపంచంపై ఆధిపత్యం చెలాయిస్తోందని, ఫైనాన్స్ కాపిటల్ కార్మిక హక్కులను కాలరాస్తుందని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. కార్మికుల శ్రమ ద్వారా సృష్టించబడిన సంపాదన కార్పొరేట్లకు దోచిపెట్టడానికి పాలకవర్గాలు దోపిడీ విధానాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు.
ఫైనాన్స్ కాపిటల్ ద్వారా పరోక్ష శ్రమదోపిడి చేస్తూ ప్రపంచ మార్కెట్లపై ఫైనాన్స్ కాపిటల్ ఆధిపత్యం చెలాయిస్తోందని తెలిపారు. సామ్రాజ్యవాదుల మధ్య మార్కెట్ పంపిణీలో వస్తున్న పోటీలో భాగంగానే యుద్ధాలు వస్తాయని, యుద్దాల వలన ఆయుధ వ్యాపారుడు, ఆయుధాలు తయారు చేసే దేశాలు లాభపడతాయని, అంతిమంగా యుద్ధాల వలన సాధారణ ప్రజలే నష్టపోతారని తెలిపారు. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులకు ప్రజల ప్రాణాల కన్నా వారి లాభాలే ముఖ్యమని, అందుకు విధ్వంసానికైనా వెనకాడరని తెలిపారు. పెట్టుబడుదారి సమాజంలో శాంతి ఉండదని, అసమానతల సమాజం ఉంటుందని, పేదరికం, దరిద్రం, నిరుద్యోగం, పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలుగా ఉంటాయని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థను పూల రోజు సోషలిస్టు వ్యవస్థ సాధించినప్పుడు మాత్రమే ప్రపంచశాంతి వర్ధిల్లుతుందని, కార్మిక వర్గ శ్రమకు తగ్గ ప్రతిఫలం వస్తుందని, అందుకు ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కొక్కెరపాటి పుల్లయ్య, ఎం బి నర్సారెడ్డి, కే బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్, ధర్మ దొడ్డ రవి, ఎస్ఏ నబి, చిరంజీవి, నాయుడు, పిట్టల అర్జున్, మోరంపూడి శ్రీనివాస్, ముదిగొండ రాంబాబు, కొండబోయిన వెంకటేశ్వర్లు, వీర్ల రమేష్, గడ్డం స్వామి, యాసా నరేష్, భూక్య రమేష్, వాంకుడోత్ కోబాల్, సోడే ప్రసాద్, గద్దల శ్రీను, నిమ్మల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.



