నవతెలంగాణ – ఉప్పునుంతల
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు కార్మిక సంఘ హక్కులను గుర్తించాలని, 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఐసిడిఎస్‌కు సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
ఉప్పునుంతల మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో సీఐటీయూ మండల కార్యదర్శి చింతల నాగరాజు మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, అంగన్వాడీ టీచర్స్‌ను మూడవ తరగతి, హెల్పర్స్‌ను నాలుగవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని అన్నారు. స్కీమ్ కార్మికుల కోసం పే కమిషన్ ఏర్పాటు చేసి క్రమబద్ధీకరణ జరిగే వరకు నెలకు రూ.26 వేల కనీస వేతనం, రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రాట్యూటీపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని, ఐసిడిఎస్‌ను ప్రైవేటీకరించరాదని అన్నారు. డిజిటలైజేషన్, ఎఫ్‌ఆర్‌ఎస్ పేరుతో వేధింపులు ఆపాలని, అదనపు పనులు అప్పగించకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మ, సరస్వతి, భాగ్యమ్మ పాల్గొన్నారు.



