నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సంస్థ ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ వినేష్ చందేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. బెంగాల్ బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా సోమవారం రాత్రి ఢిల్లీలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంగళవారం ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు 10 రోజుల ఈడీ కస్టడీ విధించింది.
బొగ్గు అక్రమ రవాణా ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల నిధులను హవాలా మార్గాల ద్వారా ఐ-ప్యాక్ రిజిస్టర్డ్ కంపెనీకి మళ్లించారని వినేష్ చందేల్‌పై ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. 2020లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ మనీలాండరింగ్ కేసుపై దర్యాప్తు చేస్తోంది. ఎన్నికలకు కేవలం పది రోజుల ముందు ఈ అరెస్ట్ జరగడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అరెస్ట్‌ను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్రంగా ఖండించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపించింది. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ, ‘బెంగాల్ ఎన్నికలకు కేవలం 10 రోజుల ముందు జరిగిన ఈ అరెస్ట్, స్వేచ్ఛాయుత ఎన్నికల స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. ఇది ప్రజాస్వామ్యం కాదు, బెదిరింపు చర్య’ అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వినేష్ చందేల్ ఈడీ కస్టడీలో ఉండగా, నిధుల మళ్లింపుపై అధికారులు ఆయన్ను విచారించనున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23,29 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.



