– రేపే మున్సిపల్ పోలింగ్..
– అశ్వారావుపేట లో… – 22 వార్డులు.. – 35 పోలింగ్ కేంద్రాలు.. – 16,850 ఓట్లు..
– కట్టుదిట్టమైన బందోబస్తు..
– వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో నేడు ప్రజలు తమ తీర్పును వెల్లడించనున్నారు. బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుండగా, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఓటింగ్ సామాగ్రి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరింది.
మంగళవారం స్థానిక వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి కార్తీక్ పర్యవేక్షణలో పోలింగ్ సిబ్బందికి సరంజామా అందజేశారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎన్నికల పర్యవేక్షకులు అమయ్ కుమార్ లు సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎటువంటి రాజకీయ వత్తిళ్లుకు లోనవకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని వారు స్పష్టం చేశారు. పోలింగ్ సందర్భంగా ఎదురయ్యే ఏ చిన్న సమస్యనైనా జిల్లా మున్సిపల్ ఎన్నికల సహాయ అధికారి, స్థానిక మున్సిపల్ కమిషనర్ నాగరాజు లేదా తమకు నేరుగా తెలియజేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినందున ప్రతి చర్య పర్యవేక్షణలోనే ఉంటుందని తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ నాగరాజు వెల్లడించిన వివరాల ప్రకారం, అశ్వారావుపేట పరిధిలోని 22 వార్డులకు 35 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 16,850 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణకు 105 మంది సిబ్బందిని నియమించగా, శాంతిభద్రతల పరిరక్షణకు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ నాగరాజు, ఎస్‌ఐ లు యయాతి రాజు, అఖిల లతో పాటు సుమారు 130 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
తొలి మున్సిపల్ ఎన్నిక కావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రతి ఓటు కీలకంగా మారిన ఈ పోటీలో ఓటర్ల తీర్పే అశ్వారావుపేట రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనుంది. రేపు పడే ఓటే రేపటి మున్సిపల్ పాలనకు దిశానిర్దేశం.కావున ప్రతీ ఓటరు విధిగా తమ హక్కు వినియోగించుకోవాలని నవతెలంగాణ కోరుకుంటుంది.



