పలువురికి గాయాలు
నవతెలంగాణ-మర్రిగూడ
రెండు ద్విచక్ర వాహనాలు,బొలెరో డీ కొని పలుగురికి గాయాలైన సంఘటన మంగళవారం మండలంలోని రాంరెడ్డి పల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం చండూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బొలెరో వాహన డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ రాంరెడ్డిపల్లి గ్రామ సమీపంలోకి రాగానే మర్రిగూడ నుంచి రాంరెడ్డి పల్లి గ్రామం వైపు వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. దీంతో పల్సర్ వాహనంపై ఉన్న కనగల్ మండలం బుడమర్లపల్లి గ్రామానికి చెందిన అన్నా చెల్లెలు సూరు రేణుక,మోర శివ తీవ్రంగా గాయపడ్డారు.
అదేవిధంగా మరో వాహనంపై సరంపేట గ్రామానికి చెందిన ఈద స్వామి,స్వప్న చిన్న పాపతో గ్రామానికి వస్తుండగా గాయపడ్డారు. స్వామి స్వప్నలకు స్వల్ప గాయాలు కావడంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలైన శివ,రేణుకలను మెరుగైన చికిత్స నిమిత్తం నల్గొండ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. రెండు వాహనాలను ఢీకొన్న బొలెరో వాహనాన్ని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు.



