అధికారుల నిర్లక్ష్యానికి ప్రజాధనం దుర్వినియోగం
నవతెలంగాణ-అచ్చంపేట
పోలీసు, ఆర్మీ ఇతర ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న యువతి, యువకులు పట్టణంలో తమ శారీరిక దేహ ధారుడ్యాన్ని పెంపొందించుకోవడానికి, పట్టణ ప్రజలు ఉదయం, సాయంత్రం వ్యాయామశాల చేసుకోవడానికి పట్టణంలోని వాటర్ ట్యాంక్ గ్రౌండ్ లో ప్రజాధనం రూ.10 లక్షలు ఖర్చు చేసి ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీ అధికారులు పర్యవేక్షణ నిర్వహణ లేకపోవడం నిర్లక్ష్యం కారణంగా విలువైన వ్యాయామ పరికరాలు తుప్పుపట్టాయి.
వినియోగానికి పనికిరాకుండా ఉన్నాయి. దీంతో మున్సిపాలిటీ అధికారులపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. గత ఏడాది ఓపెన్ జిమ్ ప్రారంభించిన రోజులలో పట్టణ ప్రజలు ఉదయం, సాయంత్రం ఎంత శ్రద్ధతో.. ఆసక్తితో శారీరిక వ్యాయామ కసరత్తులు చేశారు. ప్రస్తుతం పరికరాలు చెడిపోయాయి. మ్యాట్లు ఊడిపోయాయి. ప్రస్తుతం ఓపెన్ జిమ్ పరిసరాలు ఇసుక, కంకర రాళ్లు, పిచ్చి మొక్కలతో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఓపెన్ జిమ్ పరికరాల పట్ల అధికారులు పర్యవేక్షణ చేసి ఉంటే..పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవని కాలనీవాసులు చర్చించుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు యువకులు ప్రైవేటు శిక్షణ సంస్థలలో డబ్బులు చెల్లించి కసరత్తు చేస్తున్నారు. ఓపెన్ జిమ్ పరికరాల నిర్వహణను నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



