ఫార్మర్ ఐడి లేని వారికి ఇబ్బందులు తప్పవు
– మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని భూమి పట్టా హక్కులు కలిగిన రైతులందరూ వెంటనే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్ కోరారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, పంట పెట్టుబడి సహాయం, పంట బీమా, ఎరువులు, విత్తనాల పంపిణీ వంటి సేవలను సక్రమంగా అందించేందుకు ఫార్మర్ ఐడి కీలకంగా మారిందన్నారు.
మండలంలో ఇప్పటివరకు సుమారు 68 శాతం మంది రైతులు ఫార్మర్ ఐడి నమోదు పూర్తి చేసుకున్నారని తెలిపారు. మిగిలిన రైతులు కూడా ఆలస్యం చేయకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో వ్యవసాయ శాఖ ద్వారా అందించే పలు సేవలు, ప్రయోజనాలు ఫార్మర్ ఐడి ఆధారంగానే అందించే అవకాశం ఉన్నందున ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు.
రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పట్టాదారు పాస్‌బుక్, మొబైల్ నంబర్ తదితర వివరాలతో సమీప రైతు వేదిక, వ్యవసాయ విస్తరణ అధికారి కార్యాలయం లేదా సంబంధిత మీ సేవ కేంద్రాలను సంప్రదించి నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఫార్మర్ ఐడి ద్వారా రైతుల భూ వివరాలు, పంటల వివరాలు ఒకే వేదికపై అందుబాటులో ఉండటంతో ప్రభుత్వ పథకాల అమలు మరింత పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు.
మండలంలోని ప్రతి అర్హ రైతు ఫార్మర్ ఐడి నమోదు చేసుకుని ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్ విజ్ఞప్తి చేశారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి దృష్ట్యా ఈ నమోదు ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంతో పూర్తి చేయాలని కోరారు.



