Monday, June 8, 2026
E-PAPER
Homeజాతీయంమోడీ ఇంటర్న్‌‌షిప్‌ ‌పథకానికి ఆదరణ కరువు

మోడీ ఇంటర్న్‌‌షిప్‌ ‌పథకానికి ఆదరణ కరువు

- Advertisement -

లక్ష‍ల ఉద్యోగాల హామీ.. వేల మందికే అవకాశం!
కోటి మంది యువతకు కార్పొరేట్‌ ‌ప్రపంచం తలుపులు తెరుస్తామని ప్రకటించిన కేంద్రం
రెండు దశల్లో 1.65 లక్ష‍లకు పైగా ఆఫర్లు ఇచ్చినా పూర్తి చేసిన వారు 3,605 మంది మాత్రమే
తక్కువ స్టైపెండ్‌, దూర ప్రాంతాల్లో పోస్టింగ్‌‌లు, దీర్ఘకాల వ్యవధితో పథకం లక్ష్యాలు దెబ్బతిన్నాయనే విమర్శలు

​న్యూఢిల్లీ : దేశంలోని నిరుద్యోగ యువతకు కార్పొరేట్‌ ‌రంగంలో అవకాశాలు కల్పిస్తామని ఘనంగా ప్రకటించిన ప్రధాన మంత్రి ఇంటర్న్‌‌షిప్‌ ‌పథకం (పీఎంఐఎస్‌) అమలులో తీవ్ర లోపాలు బయటపడు తున్నాయి. రాబోయే ఐదేండ్లలో కోటి మంది యువతకు అవకాశాలు కల్పిస్తామని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఘనంగా ప్రకటించినప్పటికీ.. వాస్తవ గణాంకాలు ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఈ పథకం కింద తొలి రెండు దశల్లో లక్ష‍ల సంఖ్యలో ఇంటర్న్‌‌షిప్‌ ఆఫర్లు ఇచ్చినప్పటికీ… వాటిని పూర్తి చేసిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఇది పథకం ప్రభావంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. యువతలో ఈ పథకం ఆదరణకు నోచులేకపోతోందనీ, ఇందుకు ప్రభుత్వ గణాంకాలే ప్రత్యక్ష‍ నిదర్శనమని అంటున్నారు.

​మధ్యలోనే వైదొలుగుతున్న అభ్యర్థులు
దేశంలోని యువతకు ఉద్యోగ నైపుణ్యాలు, కార్పొరేట్‌ అనుభవం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2024 అక్టోబర్‌‌లో ప్రధాన మంత్రి ఇంటర్న్‌‌షిప్‌ ‌పథకాన్ని ప్రారంభించింది. ఐదేండ్లలో కోటి మంది యువతకు అవకాశాలు కల్పించాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నది. అయితే పథకం ప్రారంభ దశలోనే ఆశించిన ఫలితాలు రాకపోవడం ప్రభుత్వ అంచనాలపై సందేహాలు పెంచుతోందని విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంట్‌‌లో కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం… తొలి దశలో 82 వేలకు పైగా ఇంటర్న్‌‌షిప్‌ ఆఫర్లు జారీ చేసినప్పటికీ.. 8,760 మంది మాత్రమే చేరారు. వారిలోనూ సగానికి పైగా (54 శాతం మంది) మధ్యలోనే వైదొలిగారు. చివరకు పూర్తి 12 నెలల ఇంటర్న్‌‌షిప్‌‌ను ముగించినవారు 3,605 మంది మాత్రమే కావడం గమనార్హం. ఇక రెండో దశలోనూ పరిస్థితి పెద్దగా మారలేదు. 83 వేలకు పైగా ఆఫర్లు ఇచ్చినా.. 7,300 మంది మాత్రమే చేరారు. రెండు దశలను కలిపి చూస్తే 7292 మంది అభ్యర్థులు మధ్యలోనే పథకాన్ని వదిలేయడం గమనార్హం.

‘నిరుద్యోగానికి ఇంటర్న్‌‌షిప్‌‌లు కాదు.. శాశ్వత పరిష్కారాలు కావాలి’
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపకుండా ఇంటర్న్‌‌షిప్‌‌లను ఉద్యోగాల ప్రత్యామ్నా యంగా ప్రదర్శించే ప్రయత్నం కేంద్రంలోని మోడీ సర్కారు చేస్తోందన్న విమర్శలూ సర్వత్రా వినిపిస్తున్నాయి. నెలకు రూ.5 వేల స్టైపెండ్‌‌తో యువత జీవన వ్యయాలను భరించడం కష్టమవడంతో చాలా మంది ఆసక్తి చూపలేదని విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే ఇంటర్న్‌షిప్ అవకాశాలు స్వస్థలాలకు దూరంగా ఉండటం, ఏడాది కాలం పాటు తక్కువ భృతితో పనిచేయాల్సి రావడం కూడా అభ్యర్థులు వెనుకాడటానికి కారణమ య్యాయని అంటున్నారు.

​‘పథకంలో మార్పులతో లోపాన్ని ఒప్పుకున్న కేంద్రం’
ఈకారణాలతో కేంద్ర ప్రభుత్వం మార్చిలో పథకంలో కీలక మార్పులు చేయాల్సి వచ్చింది. స్టైపెండ్‌‌ను రూ.5 వేల నుంచి రూ.9 వేలకు పెంచడం, వయోపరిమితిని 21-24 ఏండ్ల నుంచి 18-25 ఏండ్లకు మార్చడం, ఇంటర్న్‌‌షిప్‌ ‌వ్యవధిని 12 నెలల నుంచి 6-9 నెలలకు తగ్గించడం వంటి చర్యలు తీసుకుంది. అయితే పథకాన్ని తొలిసారి తీసుకొచ్చినప్పుడు లోపాలున్నాయని తాము చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష‍ాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. తాజా మార్పులతో కేంద్రం ఈ లోపాలను అంగీకరించినట్టయ్యిందని అంటున్నాయి. ఇక పథకం ద్వారా కొందరు యువత కార్పొరేట్‌ ఉద్యోగాలు పొందిన ఉదాహరణలను ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. అలాంటి విజయగాథలు మొత్తం పథకం విజయాన్ని ప్రతిబింబించవని విశ్లేషకులు అంటున్నారు. ‘నాణ్యమైన ఉద్యోగాలపై దృష్టి పెట్టాలి’ దేశంలో పట్టభద్రుల నిరుద్యోగం పెరుగుతున్న సమయంలో భారీ హామీలతో ప్రారంభించిన పథకం లక్ష్యాలకు, వాస్తవ ఫలితాలకు మధ్య భారీ అంతరం కనిపిస్తోందని పరిశీలకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే ఐదేండ్లలో కోటి మంది యువతకు అవకాశాలు కల్పిస్తామన్న ప్రభుత్వ ప్రకటనల కంటే.. నాణ్యమైన ఉద్యోగాల సృష్టిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -