ప్రమాదం జరిగితే.. అంతే సంగతులు…
వర్తించని కార్మిక చట్టాలు
రోడ్డుపైనే పని కోసం పడిగాపులు
ఊరిలో పనిలేక పట్నానికి వలస
పొద్దున్న ఆరు గంటలకు అడ్డామీదికి
నెలలో 15 దినాలు పని దొరకడం గగనమే
పని ప్రదేశాల్లో చీత్కారాలు.. దూషణలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
బతుకుదెరువు కోసం ఉన్న ఊరు వదిలి పట్నం వచ్చిన పేదోడి జీవితం రోడ్డుపైన నిరీక్షిస్తోంది. ప్రతి దినం పని కోసం పరితపించాల్సిందే. నిద్రలేచిందే తరువు పరుగుపరుగున అడ్డామీదికి వచ్చి పని కోసం వెతుకులాడాలి. అడ్డామీదికి ఎవరొచ్చినా.. ‘అయ్యా.. ఏమైనా పని ఉందా.. మేము ఇద్దరం భార్య, భర్తలం ఉన్నాం.. ఏమైనా పని ఉంటే చెప్పు బాంఛన్..’ అంటూ కూలీలు ప్రాధేయపడుతున్న దుస్థితి.. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు ప్రతిరోజూ కనిపిస్తుంటాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో అడ్డా కూలీల దీనగాథలపై కథనం.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, గ్రేటర్ హైదరాబాద్‌లో అడ్డాకూలీలు సుమారు 6 లక్షల మంది ఉన్నట్టు కార్మిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పనిచేస్తున్న అడ్డా కూలీలు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాలైన ఒడిశా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు వలస వచ్చి అడ్డాకూలీలుగా పనిచేస్తున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, మెదక్ ప్రాంతాల నుంచి ఎక్కువగా కూలీ పనుల కోసం హైదరాబాద్‌కు వలస వస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చేద్దామంటే పని లేక.. కనీసం ఉపాధి హామీ పనులు సరిగ్గా అమలు కాక.. కుటుంబాన్ని సాకేందుకు అప్పులు చేసి.. వాటిని తీర్చేందుకు.. బతుకుదెరువు కోసం పేద ప్రజలు పట్నం వస్తున్నారు. పట్నంలో పని దొరుకుతుందని ఆశపడ్డ కూలీలకు నిరాశే ఎదురవుతుంది. నెలలో 10 నుంచి 15 దినాలు పని దొరికితే అదే గొప్ప అన్నట్టు ఉంటుంది కూలీల పరిస్థితి. అలా పనిచేసిన డబ్బులు ఇల్లు గడవటానికే సరిపోవడం లేదు.
కూలి అరకొరే..
పొద్దున 9 గంటలకు పనిలోకి దిగితే సాయంత్రం 5 నుంచి 6 వరకు పనిచేయాలి. దినసరి కూలీ మహిళకు రూ. 500 నుంచి రూ.700 వరకు ఇస్తున్నారు. పురుషులకు రూ.700 నుంచి రూ.1,000 వరకు ఉంటుంది. ఈ లెక్కన భార్య, భర్తలకు ఇద్దరికీ పని దొరికితే.. రూ. 1500 నుంచి 1800 వరకు వస్తుంది. కానీ నెలలో 30 రోజులు పని దొరకడం లేదు. భార్యకు పని దొరికితే భర్తకు దొరకదు.. భర్తకు పని దొరికితే భార్యకు దొరకదు. దాంతో ఆ కుటుంబం నెల ఆదాయం రూ. 10వేల నుంచి రూ.15 వేలు దాటడం లేదు. దాంతో ఇల్లు గడ్చుడే కష్టమైందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడ్డాకూలీ బతుకుకు భరోసా కరువు
అడ్డా మీద కూలీల బతుకుకు భద్రత లేదు. పనికి పిలిచిన యాజమాన్యం మీద కూడా నమ్మకం లేని పరిస్థితి.. అడ్డామీదికి వచ్చేవారు ఏ పనికి తీసుకుపోతున్నారో తెలియదు. వారు ఏ పని చెబితే ఆ పని చేయాలి. ఇలాంటి సమయంలో కూలీలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పని ప్రదేశంలో ప్రమాదాలు జరిగితే.. ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాగే పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కూడా ఉండటం లేదు. మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీరికి కార్మిక చట్టాలు సైతం వర్తించవు. తమ సమస్యలపై పాలకులు దృష్టి సారించి.. తమకు పనితోపాటు భరోసా కల్పించాలని కూలీలు కోరుతున్నారు.
కష్టంగా బతుకుదెరువు
హైదరాబాద్‌కు వచ్చి నాలుగేండ్లు గడుస్తోంది. సంపాదించింది లేదు. ఊరులో అప్పులకు వడ్డీలు పెరుగుతు న్నాయి. ఒక రోజు పని దొరికితే.. మూడు రోజులు ఇంటికాడనే ఉండాల్సి వస్తోంది. పని ఉన్నరోజు దినసరి కూలీ రూ. 1000 ఉంటుంది. వెయ్యిలో పొద్దంతా కష్టం చేస్తే.. ప్రాణం సొమ్మసిల్లి పోతుంది. కూరగాయలు, పప్పు, ఉప్పులు తీసుకెళ్లితే.. సగం డబ్బులు వాటికే పోతున్నాయి. అప్పులు తీర్చేందుకు నా జీవితమే సరిపోయేట్టు ఉంది. ఊరిలో చేసిన అప్పులు ఎట్లా తీర్చాలో దిక్కుతోచడం లేదు.
వీరబాబు,మునగా మండలం, సూర్యాపేట జిల్లా
అసంఘటిత కార్మికులకు
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
దిన సరి కూలీల సంక్షేమం కోసం ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. కార్మికులు ప్రమాదాలకు గురైనప్పుడు వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలి. అడ్డా కూలీలకు రోజూ పని కల్పించేలా కృషి చేయాలి.
చంద్రమోహన్,
సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి



