నవతెలంగాణ – అశ్వారావుపేట
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ) పెంటేల రవికుమార్ సూచించారు. వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని కోరారు. మన జిల్లా మధ్య తెలంగాణ ప్రాంతంలో ఉండటంతో సాధారణంగా లేదా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని, అయితే ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాల పంపిణీలో అసమానతలు, పొడి విరామాలు (డ్రై స్పెల్స్) ఏర్పడే అవకాశం ఉందన్నారు. దేశంలో ఇప్పటికీ 52 శాతం వ్యవసాయం వర్షాధారంగానే కొనసాగుతోందని, రుతుపవనాల వైవిధ్యం వ్యవసాయ రంగానికి సవాలుగా మారుతోందని తెలిపారు.
తక్కువ వర్షపాతం కారణంగా భూగర్భ జలాల రీఛార్జ్ తగ్గిపోవడంతో పాటు రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతాయని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి కొరత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, ఎరువుల లభ్యత సమస్యలు కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు.
నీటి అవసరం అధికంగా ఉండే వరి వంటి పంటల సాగును తగ్గించి, తక్కువ కాలంలో పండే పప్పుధాన్యాలు, నూనెగింజలు, తృణధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొర్రలు, నువ్వులు వంటి పంటలు వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయని చెప్పారు.
ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణ చేపట్టాలని రైతులకు సూచించారు. ఒక పంట స్వల్పకాల వర్షాభావాన్ని తట్టుకుంటే, మరొక పంట దీర్ఘకాల పొడి పరిస్థితులను తట్టుకునే అవకాశం ఉంటుందని, తద్వారా మొత్తం నష్టాన్ని తగ్గించుకోవచ్చన్నారు.
ఎల్‌నినో అంటే ఏమిటి?
పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర జలాల ఉష్ణోగ్రత సాధారణం కంటే పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితినే ఎల్‌నినో అంటారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలపై పడుతుంది.
తెలంగాణపై ప్రభావం
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉండటంతో పాటు వేడి తరంగాలు పెరిగే అవకాశం ఉంది. భూగర్భ జలాల రీఛార్జ్ తగ్గిపోవడం, దిగుబడులు పడిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
2026 వానాకాలంలో జూన్ నెలలో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, జూలై-ఆగస్టు నెలల్లో పొడి విరామాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఉత్తర తెలంగాణలో సాధారణం కంటే తక్కువ, మధ్య తెలంగాణలో సాధారణం నుంచి అధిక, దక్షిణ తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
వరి రైతులకు సూచనలు
జూలై 15 వరకు సరిపడా వర్షాలు లేకపోతే 125 రోజుల లోపు పండే స్వల్పకాలిక వరి రకాలను ఎంచుకోవాలని సూచించారు. వర్షాల పరిస్థితిని గమనించి మాత్రమే విత్తనాలు వేసుకోవాలని, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రత్తి రైతులు తొందరపడొద్దు
వర్షాధారంగా ప్రత్తి సాగు చేసే రైతులు ఆకాల వర్షాలకు ఆకర్షితులై విత్తనాలు వేయవద్దని హెచ్చరించారు. ఎర్ర నేలల్లో కనీసం 50 మిల్లీమీటర్లు, నల్ల నేలల్లో 60-70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై భూమి చల్లబడిన తర్వాతే ప్రత్తి, కంది విత్తనాలు వేయాలని సూచించారు.
ప్రస్తుతం నమోదవుతున్న 40 నుంచి 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల కారణంగా విత్తనాల మొలక శాతం తగ్గిపోతుందని, దీంతో విత్తన నష్టం, అదనపు సాగు ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఒకవేళ మొలకెత్తినా మొక్కలు ఎండబడి చనిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు.
సరైన సమయంలో విత్తనాలు వేయడం ద్వారా మంచి మొలకలు, అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తే ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించి స్థిరమైన ఆదాయం పొందవచ్చని ఏడీఏ రవికుమార్ తెలిపారు. “సరైన వర్షం – సరైన సమయం – అధిక దిగుబడి” అనే సూత్రంతో రైతులు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.



